వైసీపీ వింత ప్రవర్తన… అసలు జరుగుతున్నది ఇదేనా..?

‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని జగన్‌ పదే పదే చెబుతుంటారు. వైసీపీ నేతలు కూడా తమ నేత మాటిస్తే వెనుకడుగువేసే ప్రసక్తే లేదని.. విశ్వసనీయతకు మారుపేరని అంటుంటారు. కానీ గడచిన 8 నెలలుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తద్విరుద్ధంగా ఉండడంతో సామాన్యుల్లో, రాజకీయవర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతల్లోనూ విస్మయం వ్యక్తమవుతుంది.ప్రతిపక్ష నేతలపైన, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన పోలీసు, ఉన్నతాధికారులపైనా కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మింగుడుపడడం లేదు. అన్నిటినీ మించి రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నడుస్తున్నాయి. సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపారని ఏకంగా శాసనమండలినే రద్దు చేయాలని తీర్మానించడం, తాజాగా విద్యుత్‌ చార్జీల పెంపుపై జనాలకు నోటమాట రావడం లేదు. జగన్‌ యూటర్న్‌ తీసుకున్నారని విమర్శిస్తున్న రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్న అంశాలివీ..తన పాలన మనసుతో ఉంటుందని.. కక్షలు, కార్పణ్యాలూ లేకుండా అందరినీ ఒకేలా చూసుకుంటానని.. పాలనా ఫలాలను అర్హులందరికీ అందిస్తానని.. లబ్ధిదారులు ఏ కులానికి చెందినవారో.. ఏ మతానికి చెందిన వారో.. ఏ పార్టీకి చెందిన వారో.. చివరకు తన పార్టీకి ఓటేశారో లేదో కూడా చూడనని గత ఏడాది మే 30వ తేదీన ప్రమాణ స్వీకార సమయంలో జగన్‌ పేర్కొన్నారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశం సాక్షిగా.. గతంలో చంద్రబాబు హయాంలో నిర్మించిన ప్రజా వేదికను అక్రమ కట్టడంగా ప్రకటించి.. దానిని కూల్చేయాలని ఆదేశించారు.నదీగర్భానికి అనుకుని ఉన్న అక్రమ కట్టడాలన్నిటినీ రాష్ట్రవ్యాప్తంగా కూల్చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రజావేదికను అర్ధరాత్రి పొక్లయిన్లతో నేలమట్టం చేశారు. ఆ శిధిలాలను ఇంతవరకు తొలగించకపోవడం గమనార్హం. అదే సమయంలో మిగతా అక్రమ కట్టడాల్లో ఒక్క దానినీ కూల్చకపోవడం గమనార్హం. ప్రజావేదిక సమీపంలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని కూల్చేందుకు ప్రభుత్వ పెద్దలు చేయని ప్రయత్నమంటూ లేదు.

 

చంద్రబాబు నివాసం ముంపునకు గురవుతుందని.. దానిని ఖాళీచేయాలంటూ.. అనేకసార్లు నోటీసులిచ్చారు. ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు.2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిగా జగన్‌కు అవకాశం వస్తే.. రాజధానిని అమరావతి నుంచి మార్చేస్తారని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఈ ప్రచారం విస్తృతంగా సాగడంతో.. ఎన్నికల్లో దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. తాడేపల్లిలో జగన్‌ సొంతిల్లు నిర్మించుకున్నారు. ప్రారంభోత్సవ సమయంలో.. ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకోలేదని.. జగన్‌ మాత్రం.. రాజధాని పరిధిలోని తాడేపల్లిలో సొంతిల్లు నిర్మించుకున్నారని.. అమరావతి ఇక్కడి నుంచి తరలిపోదనేందుకు ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలని కూడా ప్రశ్నించారు.ఈ సమయంలోనే రాజధాని తరలింపుపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ కార్యాలయం వేదికగా సమావేశం జరిగింది. అమరావతిని తరలించబోమంటూ జగన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీర్మానించారు. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇతర నేతలు విజయవాడలో స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజుల పాటు పాలనంతా ఇంటి నుంచే కొనసాగించారు. సచివాలయం వైపు తొంగి చూడలేదు. దీంతో.. మళ్లీ అమరావతిని మార్చేస్తారన్న అనుమానాలు పెరిగిపోయాయి. ఇదే తరుణంలో జగన్‌ మంచి ముహూర్తం చూసుకుని సచివాలయంలో అడుగు పెట్టారు. వెలగపూడిలోని సచివాలయానికి రాకపోకలు సాగిస్తూ వచ్చారు.అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలూ ముగిశాయి. రాజధాని మార్పు ఉండదని అందరూ భావించారు. కట్‌ చేస్తే.. సీన్‌ రివర్స్‌ అయింది. అమరావతి ముంపు ప్రాంతమని.. ఒక సామాజిక వర్గానికే అది రాజధాని అని.. రాష్ట్ర ఆదాయం మొత్తం అక్కడే పెట్టాలా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వచ్చారు. సీఎం నుంచి మంత్రులెవరూ ఖండించలేదు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున జగన్‌ ఒక్కసారిగా పిడుగులాంటి ప్రకటన చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటే.. రూ.లక్ష కోట్లు కావాలని.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు.కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం, అమరావతిలో అసెంబ్లీ ఇలా మూడు రాజధానులుగా ఏర్పడొచ్చని పేర్కొన్నారు. తదనుగుణంగా జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ)లను ఏర్పాటుచేసి.. అవి నివేదికలు ఇవ్వకముందే హైపవర్‌ కమిటీని వేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఏకంగా పాలన వికేంద్రీకరణ-3 రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీలో పెట్టి ఆమోదించేశారు. శాసనమండలిలో బ్రేక్‌ పడడం, ఈలోపు కార్యాలయాల తరలింపును హైకోర్టు నిలిపివేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాట ఇచ్చాక జగన్‌ వెనక్కి తగ్గరనే వైసీపీ నేతలు 3 రాజధానులపై సమాధానం చెప్పలేకపోతున్నారు.కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేస్తానని జగన్‌ పాదయాత్ర సమయంలో వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక.. రూ.40 వేలకు పైగా వేతనం తీసుకుంటున్న ఆ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా పంపేశారు.

 

ఉద్యోగ నియామకాల్లో తరతమ భేదాలుండవని చెప్పారు. కానీ పార్టీతోనూ, సొంత మీడియాతో సంబంఽధం కలిగిన వారిని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి.. రూ.లక్షల వేతనాలిస్తున్నారు.గద్దెనెక్కిన వారం రోజుల్లో ప్రభుత్వోద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎ్‌స)ను రద్దుచేసి పాత విధానం పునరుద్ధరిస్తానని జగన్‌ ప్రకటించారు. ఇంతవరకు అతీగతీ లేదు. సీపీఎస్‌ రద్దుపై కమిటీని వేస్తున్నట్లు మాత్రం ప్రకటించారు. అదేమైందో.. ఏం చెప్పిందో ఇప్పటి వరకూ సమాచారం లేదు.ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం ఐదు గంటల తర్వాత కార్యాలయాల్లో ఉండాల్సిన పనిలేదని సచివాలయ ఉద్యోగులు కలసి అభినందించిప్పుడు సీఎం జగన్‌ అన్నారు. తాను గంటల కొద్దీ సమీక్షలు నిర్వహించబోనని వెల్లడించారు. దాంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఇప్పుడు షరామామూలే! రాత్రి ఏడు గంటల వరకూ పనిచేయాల్సి వస్తోందని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాట డీఎంకే అధినేత స్టాలిన్‌ సమక్షంలో.. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని జగన్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ విద్యుత్‌ చార్జీలను తాజాగా పెంచారు.కేంద్రం ఏటా రైతులకు ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా.. రైతు భరోసా కింద ఒక్కో రైతుకూ రూ.12,500 చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్‌ ప్రకటించారు. కానీ .. ఇప్పుడు ఆ 6,000తో కలిపి రూ.13,500 చేశారు.

"
"