వైసీపీలో ముసలం… రచ్చకెక్కిన వర్గపోరు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలంలో వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. కవలకుంట్ల గ్రామంలో ఒకవర్గంవారు శిలాఫలకం ఏర్పాటు కోసం దిమ్మె ఏర్పాటు చేయగా, మరోవర్గం అభ్యంతరం తెలపడంతో అక్కడ మంత్రి సురేష్‌ శంకుస్థాపన చేయాల్సిన పనులు ఆగిపోయాయి. మండలంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం అన్ని గ్రామ పంచాయతీల్లో పలు పనులకు శంకుస్థాపనులు చేశారు. కవలకుంట్లలో కూడా రూ.30 లక్షలతో సీసీడ్రైన్స్‌ పనులకు శంకుస్థాపన చేసేందుకు వైసీపీలోని సొసైటీ వర్గం శిలాఫలక దిమ్మెను ఏర్పాటు చేసింది.

 

అయితే శిలాఫలకంలో కార్యనిర్వాహకుల పేర్లలో మాజీ సర్పంచి వర్గం పేర్లు లేకపోవడంతో అభ్యంతరం తెలిపారు. దీంతో సొసైటీ వర్గంవారు తాము నిర్మించుకున్న దిమ్మెను తామే తొలగించారు. దీంతో మంత్రి కవలకుంట్లలో పనులకు శంకుస్థాపన చేయకుండా మిగిలిన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించారు. గతంలో ఇదే గ్రామంలో గ్రామసచివాలయానికి ఓ వర్గం రంగు వేయించడంతో మరోవర్గం దానిని తొలగించింది. దీంతో ఇప్పటికి రంగు వేయకుండానే అలాగే సచివాలయం దర్శనమిస్తోంది.

"
"