జగన్ ని వాళ్ళే కలవలేరు… ఇక రాజధాని రైతులు ఏలా కలుస్తారు..అర్కె షాకింగ్ పాయింట్…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తనను తాను గర్భగుడిలోని మూలవిరాట్టుగా భావిస్తున్నట్టున్నారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని చూశాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ధోరణి ఇందుకు విరుద్ధంగా ఉంది. గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రతిరోజూ తన క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలను కలిసి విజ్ఞప్తులు స్వీకరించేవారు. ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి ఇందుకు పూర్తి భిన్నం. తనకు నచ్చిన లేదా అవసరమైన అతి కొద్దిమంది వ్యక్తులను మినహా ఎవరినీ ఆయన కలవరు. ఎవరితోనూ మాట్లాడరు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ధోరణి కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతోపాటు ఇతర వర్గాల ప్రజలు ఆందోళన బాట పట్టినా జగన్మోహన్‌ రెడ్డిలో చలనం ఉండదు. రైతులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి కూడా ఆయనకు మనసు రావడం లేదు. ‘రైతులకు ఏమి కావాలో కనుక్కుని సమస్య పరిష్కరించండి’ అని తమను ఆదేశించినట్టుగా మంత్రులు బయటికి చెబుతున్నారు. లోపల జగన్‌ వారితో ఏమన్నారో ఆ దేవుడికే తెలియాలి! రాజధాని విషయమై ప్రజలలో గందరగోళం నెలకొన్నప్పటికీ ఈ విషయంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి తాను ఏమి అనుకుంటున్నదీ బహిరంగంగా చెప్పరు. కమిటీల ద్వారా లేదా మంత్రుల ద్వారా చెప్పిస్తుంటారు. ఆయన ఈ వైఖరి చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.
రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఒక పెద్ద మనిషి… మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్‌ రెడ్డిని అభినందించాలనుకుని అపాయింట్‌మెంట్‌ కోరారు. తనకు అపాయింట్‌మెంట్‌ కావాలని ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరగా.. ‘సారీ! ఎవరినీ కలవకూడదని ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. మీకు ఏదైనా పని ఉంటే చెప్పండి’ అని బదులిచ్చారు. దీంతో అవాక్కయిన ఆయన.. ‘నాకు పనేమీ లేదు! కేవలం అభినందించడానికే కలవాలనుకున్నా’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు.
‘రాజధానిపై ఇంత గందరగోళం ఎందుకు? కనీసం మీరైనా చెప్పవచ్చు కదా?’ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరిని హైదరాబాద్‌లో ఉండే మరో పెద్ద మనిషి ప్రశ్నించగా.. ‘సర్లెండి! ఏడు నెలలుగా నాకే అపాయింట్‌మెంట్‌ లేదు! నేనేమి చెప్పాలి!’ అని నిట్టూర్చారట.ఈ ఎమ్మెల్యే తరచుగా విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ.. కళ్లెగరేస్తూ మరీ ప్రతిపక్షాలను తిట్టిపోస్తుంటారు కూడా! అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, శాసన సభ్యులదీ ఇదే పరిస్థితి! అయితే తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు మధనపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని రైతులను జగన్మోహన్‌ రెడ్డి కలుసుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది.
 
"
"