సీయం జగన్ పై ఫైర్ అయిన పవన్…మరి ఇంత దారుణమా..?

‘‘వైసీపీని గెలిపిస్తే రాష్ట్రంలో పాలెగాళ్ల ఫ్యాక్షనిజం పాలన వస్తుందని నేను 2014లోనే చెప్పాను. రాష్ట్రంలో ప్రశాంతతకు మారుపేరైన కాకినాడలో ఇప్పుడు ఆ ఛాయలు బయటపడ్డాయి. సహనం జనసేన బలం. చేతగానితనం అనుకోవ ద్దు. మేం తెగిస్తే మీరు ఎవరూ ఉండలేరు. అధికారం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదు. అరికాలు నుంచి నెత్తి వరకూ మదమెక్కితే బూతులు వస్తాయి. అటువంటి వారిని ప్రజలు రాజకీయాల నుంచి వెలివేయాలి’’’ అని జనసేనాని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కాకినాడలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారు. వారిని పరామర్శించడానికి పవన్‌ మంగళవారం కాకినాడ వచ్చారు. స్థానిక నాయకుడు పంతం నానాజీ ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న బాధితులను పరామర్శించారు.అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్న వైసీపీ నేతలు లేని గొడవలు సృష్టించి శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తుంటే పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు.

 

కాకినాడలో వైసీపీ ర్యాలీలో ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడిన భాష వింటే ప్రజాప్రతినిధులు ఈ స్థాయిలో ఉంటారా! అని ఆశ్చర్యం వేసిందన్నారు. ఈ నేత ఉపయోగించిన భాష పట్ల మా కార్యకర్తలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే వారిపై దాడులు చేయడం క్షమించరాని నేరమన్నారు. మా కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తే తిరిగి మా వాళ్లపైనే ఐపీసీ 307 సెక్షన్‌తో కేసులు పెట్టడంపై తాను రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులను అడిగానన్నారు. కాకినాడ అల్లర్లపై స్థానిక పోలీస్‌ యంత్రాంగం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని, అన్యాయానికి గొడుగు పట్టవద్దని జిల్లా ఎస్పీకి సూచించారు.వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు దిగొచ్చారా? అని పవన్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంకో సారి ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటే చేతులు ముడుచుకుని కూర్చోమని పోలీస్‌ ఉన్నతాధికారులకు స్పష్టం చేస్తున్నామని అన్నారు. కాకినాడలో తమ కార్యకర్తలపై జరిగిన దాడులు చాలా బాధగాను, ఒకింత ఆవేదనను కలిగిస్తున్నాయన్నారు. తమ వద్ద ఉన్న వీడియో క్లిప్పింగ్‌లను త్వరలో గవర్నర్‌కు అందించి ఫిర్యాదు చేస్తామని, జిల్లాలోని ఇద్దరు ముఖ్య అధికారులను సస్పెండ్‌ చేయాలని కోరతామని తెలిపారు. పాలెగాళ్ళు, ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేసే వారికి చరమగీతం పలకాలన్నారు. ‘తెగించే నేను రాజకీయాల్లోకి వచ్చాను. న్యాయం పక్షాన నిలబడతాను. చెడు ధోరణి మార్చుకోని నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు. అధికారం శివుడి మెడలో పాములాంటిది. పవర్‌ ఎప్పుడూ ఒకరి చేతిలో ఉండదు. మొన్న గొడవలో మా నాయకులపై, ఆడపడుచులపై పడిన దెబ్బలు నేను ఎప్పటికీ మరువను. వేచి చూస్తాను’’ అని అన్నారు. త్వరలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ఊదరగొడుతోందన్నారు. ఆ పార్టీ నేతల మాటలు చూస్తుంటే ఆంగ్ల మాఽధ్యమం కంటే ముందు బూతుల మాధ్యమం వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలో సుమారు రెండు నెలల నుంచి నెలకొన్న సమస్యలను కేంద్రంలోని పెద్దలకు వివరిద్దామని తాను ఢిల్లీ వెళ్ళినట్లు చెప్పారు. కేంద్రంలోని ఎన్డీయే పెద్దలకు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించానన్నారు. ఈ నెల 16న విజయవాడలో బీజేపీ ముఖ్య నేతలతో కీలక భేటీ ఉందన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు కాకుండా అమరావతి కేంద్రంగా ఒకే రాజధాని ఉండాలని జనసేన భావిస్తుందన్నారు. సమావేశంలో పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌, పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

"
"