డబ్ల్యూహెచ్‌వో సంచలన వ్యాఖ్యలు..అసలు కథ ముందుంది…

ప్రాణాంతక మహమ్మారి కొవిడ్-19 అసలు రూపం ఇంకా రాలేదనీ.. ముందు ముందు దీని తీవ్రత మరింత ఉధృతంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పేర్కొన్నారు. చాలామందికి ఈ వైరస్ తీవ్రతపై ఇంకా అవగాహన రాలేదని ఆయన అన్నారు. ‘‘మమ్మల్ని నమ్మండి. ముందు ముందు మరింత ఉత్పాతం రాబోతోంది. ఈ విషాదాన్ని మనం కలిసికట్టుగా ఆపాలి. ఈ వైరస్‌ గురించి ఇంకా చాలామందికి అర్థం కాలేదు..’’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ వ్యాఖ్యానించారు. డబ్ల్యూహెచ్‌వో దగ్గర ఎలాంటి రహస్యాలు లేవనీ… ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచడం పెను ప్రమాదమని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయమని ఆయన గుర్తుచేశారు.

 

‘‘ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మన మధ్య విబేధాలుంటే ఆ పగుళ్లను ఉపయోగించుకుని ఇది మరింత చొచ్చుకెళుతుంది…’’ అని ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. అమెరికాకి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సిబ్బంది తమతో కలిసి పనిచేస్తున్నారనీ.. అలాంటప్పుడు అమెరికాకి తెలియకుండా మేము ఏదైనా ఎలా దాచిపెట్టగలమని ఆయన ప్రశ్నించారు. వందేళ్ల క్రితం కోటి మందిని బలితీసుకున్న స్పానిష్ ఫ్లూకి.. కరోనా వైరస్‌కు చాలా సామీప్యతలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ మానవాళికి ప్రధమ శత్రువనీ.. అందరూ కలిసి కట్టుగా ఈ రక్కసిపై పోరాడాలని తాము తొలి రోజు నుంచి చెబుతూనే వచ్చామన్నారు. చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన ఈ వైరస్‌పై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంతో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించిన నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం.

"
"