కియా ఉంటుందా.. వెళుతోందా?

కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోనుందని రాయిటర్స్‌ వార్తా సంస్థ ఇచ్చిన కథనంపై ఏర్పడిన గందరగోళం మరింత తీవ్రమైంది. తన కథనానికి కట్టుబడి ఉన్నానని.. ట్విటర్‌ నుంచి తొలగించడం అవాస్తవమని స్పష్టం చేసింది. కొన్ని సవరణలతో పాత కథనాన్ని తాజాగా రీట్వీట్‌ చేసింది. దీనిపై ప్రభుత్వ స్పందన తెలియరాలేదు. ఈ నెల 5న రాయిటర్స్‌ తొలిసారి కియ తరలింపుపై కథనం ఇచ్చింది. ‘1.1 బిలియన్‌ డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు తరలిపోనుంది. ఆంధ్ర ప్రభుత్వ విధానాలు మారడంతో ఈ నిర్ణయం తీసుకున్న కియ మోటార్స్‌… తరలింపుపై తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది..’ అని అందులో పేర్కొనడం రాష్ట్రంలోనే గాక.. దేశమంతటా కలకలం రేగింది. జగన్‌ ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రం నుంచి ఢిల్లీలో పార్లమెంటు దాకా విపక్షాలు విరుచుకుపడ్డాయి.

 

దీంతో రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమల మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి హడావుడిగా కియ యాజమాన్యంతో మాట్లాడారు. అనంతరం కియ ఎక్కడకూ వెళ్లడం లేదని స్పష్టం చేశారు.ఆ సంస్థను కూడా ఆ మేరకు ప్రకటన ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. దాంతో ఆ సంస్థ కూడా.. ప్లాంటును తరలించే ఆలోచనేదీ లేదని వెల్లడించింది. మరుసటి రోజు కూడా మేకపాటి ఢిల్లీలో ఆటో ఎక్స్‌పోలో పాల్గొని.. కియ ప్రతినిధులతో మాట్లాడారు. అప్పుడూ రాయిటర్స్‌ కథనాన్ని కియ ఖండించింది. ఇదే సమయంలో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. వెళ్లడం లేదని కియ స్వయంగా చెబుతున్నా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన్ను విమర్శించారు. ఈలోపు శనివారం రాత్రి తన కథనాన్ని రాయిటర్స్‌ ఉపసంహరించుకుందని.. ట్విటర్‌ నుంచి తొలగించిందని ప్రభుత్వం పేర్కొంది. దానిని రాయిటర్స్‌ ఇప్పుడు తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మారిన విధానాలు, అదే విధంగా తమకిచ్చిన రాయితీలపై ప్రభుత్వ పునరాలోచన, స్థానికులకే 75 శాతం ఉద్యోగాలివ్వాలనడం, ఇతరత్రా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కియ యాజమాన్యం తమిళనాడుకు తరలిపోయే ఆలోచన చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయని తన కథనంలో పేర్కొంది. ఆ సంస్థకు భూమి ఇచ్చినప్పుడు వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించే అవకాశం ఇచ్చారని, అదేవిధంగా విద్యుత్‌ విషయంలోనూ రాయితీలిచ్చారని.. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం వాటిని పునఃసమీక్ష చేస్తుండడం కియకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని పేర్కొంది.మరోవైపు.. నైపుణ్యాలు కావాల్సిన ఉద్యోగాలు కాకుండా.. ఇతర వాటిల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇస్తున్నామని..

 

ఇప్పుడు నైపుణ్య ఉద్యోగాల్లోనూ 75 శాతం కోటా ఇవ్వాలంటే.. అవసరమైన నైపుణ్య మానవ వనరుల లభ్యత ఇక్కడ లేదని కియ అంటున్నట్లు తెలిసిందని వెల్లడించింది. కాగా.. 1.1 బిలియన్‌ డాలర్ల వ్యయంతో నెలకొల్పిన ఇంత భారీ ప్లాంటును తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్నదే. నష్టం కూడా భారీగానే ఉంటుంది. అందుకే తరలింపు ఖర్చు కూడా తమిళనాడు ప్రభుత్వం ఇస్తామంటోందని ఒక రహస్య వ్యక్తి తమకు చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో కియ ప్రతినిధులు, వారితో కలిసుండే వారితో మాట్లాడాకే ఆ వార్తా సంస్థ తాజా ట్వీట్‌ చేసిందని సమాచారం. దీంతో కియ మన రాష్ట్రంలో ఖాయంగానే ఉంటుందా? ఈ ప్రచారానికి ముగింపు ఎప్పుడు.. అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.

"
"