వీఆర్వోలకు చెక్

రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) వ్యవస్థను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ భూహక్కులు-పట్టాదార్‌ పాస్‌పుస్తక చట్టం-2020 బిల్లును కూడా కేబినెట్‌ ఆమోదించింది. సోమవారం రాత్రి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటితోపాటు పలు బిల్లులు, ఆర్డినెన్సులకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. కొత్త సచివాలయం నిర్మాణం, పాత సచివాలయ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలన అనుమతులు, కొత్తగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్స్‌ ఆఫీస్‌ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపుల కోసం సవరించిన పరిపాలన అనుమతులు ఇచ్చింది. 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్‌ చేసిన సిఫారసులనూ కేబినెట్‌ ఆమోదించింది. తెలంగాణ మునిసిపాలిటీ యాక్ట్‌-2019లోని సవరణ బిల్లులకు, పంచాయతీరాజ్‌-రూరల్‌ డెవల్‌పమెంట్‌-గ్రామ పంచాయత్స్‌-ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీ యాక్ట్‌-2018 సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ యాక్ట్‌-2017 సవరణ బిల్లు, తెలంగాణ స్టేట్‌ ప్రైవేటు యూనివర్సిటీస్‌ యాక్ట్‌ సవరణఆర్డినెన్స్‌-2020కీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ది తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌-2020, ది తెలంగాణ ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ బిల్‌-2002కి ఆమోద ముద్ర వేసింది. ఆయుష్‌ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్‌ను, టీఎస్‌ బీపాస్‌ బిల్లు, తెలంగాణ కోర్ట్‌ ఫీజ్‌ అండ్‌ సూట్స్‌ వాల్యుయేషన్‌ యాక్ట్‌-1956 సవరణ బిల్లు, ది తెలంగాణ సివిల్‌ కోర్ట్స్‌ యాక్ట్‌-1972కు సవరణ బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బిల్లులు, ఆర్డినెన్సుల వివరాలను అధికారులు చదివి వినిపించిన అనంతరం వాటిని కేబినెట్‌ ఆమోదించింది. ఈ బిల్లులు, ఆర్డినెన్సులను శాసనసభలో ప్రవేశపెట్టానున్నారు.9న అసెంబీల్లో రెవెన్యూ బిల్లు..

రెవెన్యూశాఖలో అవినీతికి అడ్డుకట్ట వేసేలా ఆర్‌వోఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టాన్ని సమూలంగా సవరిస్తూ రూపొందించిన తెలంగాణ భూహక్కులు-పట్టాదార్‌ పాస్‌పుస్తక చట్టం-2020 బిల్లును ఈ నెల 9న (బుధవారం) శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సభలో చర్చించి.. ఆమోదించిన అనంతరం గవర్నర్‌ ఆమోదానికి పంపించనున్నారు. దీనికి ఆమోదం లభిస్తే.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అంతా తహసీల్దార్‌లే చూస్తారు. రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ జరిగిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌ జరిగాక… ఆ భూముల లావాదేవీలు సరైనవా? కాదా? అని నిర్ధారించడానికి వీలుగా నోటీసులు జారీ చేసి, 30 రోజుల గడువు అనంతరం మ్యుటేషన్‌ చేసేవారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ గడువును వారం రోజులకు కుదిస్తూ ఆర్‌వోఆర్‌ యాక్ట్‌ను సవరించింది. ఇప్పుడు పూర్తిగా నోటీసుల విధానానికే స్వస్తి పలుకుతూ చట్టాన్ని రూపొందించింది. దీంతో ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ జరిగితే చాలు.. రెవెన్యూ రికార్డుల్లోకి ఆటోమేటిక్‌గా పేరు చేరనుంది. మ్యుటేషన్‌ కాగానే ఆ డేటా పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణా కేంద్రానికి చేరుతుంది. ఆ తర్వాత వారం రోజుల్లో పాస్‌పుస్తకం నేరుగా భూముల యాజమాని/రైతు ఇంటికే వస్తుంది.

"
"