అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు…

పెద్దల చట్టసభల్లో సభ్యులు వ్యవహరిస్తున్న తీరు తలవంపులు తెస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. వారు మాట్లాడే భాష, వ్యవహరించే తీరు సరిగా ఉండడం లేదని వాపోయారు. గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కోనేరు రామకృష్ణారావు రాసిన ‘ఏ చైల్డ్‌ ఆఫ్‌ డెస్టినీ: యాన్‌ ఆటోబయోగ్రఫీ’ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి శనివారమిక్కడ గీతం వర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభలు జరుగుతున్నప్పుడు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తే సభ్యుల ప్రవర్తన మారుతుందని ఆశించామని, కానీ మరింత దారుణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాల చట్టసభల్లోను వ్యవహారాలు ఇలాగే నడుస్తున్నాయన్నారు. శుక్రవారం పార్లమెంటులో సభ్యుల తీరు తనను కలచివేసిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దేనిపైనైనా విభేదించడం, చర్చించడం సహజమని.. ప్రత్యర్థుల్లా ఉండాలి తప్ప శత్రువుల్లా వ్యవహరించకూడదని హితవు పలికారు.

 

తుపాకీ పేలిస్తే పొగ వస్తుందే తప్ప విప్లవం రాదన్నారు. వలసవాదుల పాలనను ప్రశంసించడం మానేసి భారతదేశం గర్వించదగిన అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు, కందుకూరి, ఝాన్సీలక్ష్మీబాయి వంటి వీరుల వాస్తవ చరిత్రను పాఠ్యాంశాలుగా తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించే విద్యా విధానం అవసరమన్నారు. పిల్లలకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని, ఆ తర్వాత ఇంగ్లి్‌షతో పాటు ఎన్ని భాషలైనా నేర్పించవచ్చన్నారు. విద్యతో పాటు వినయం, సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్పించాలన్నారు. విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు రావాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, బోధనను గదులకు పరిమితం చేయకుండా ప్రపంచాన్ని పరిచయం చేయాలని పిలుపిచ్చారు.కోనేరు రామకృష్ణారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ప్రపంచం గర్వించదగిన సైకాలజీ శాస్త్రవేత్త అని, గాంధీజీ సిద్ధాంతాలను అధ్యయనం చేసి ఆచరిస్తున్న వ్యక్తి అని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ‘ఆయన రాసిన పుస్తకాన్ని విద్యావేత్తలతో పాటు విద్యార్థులు కూడా చదవాలి. ఇప్పటివరకు ఆయన 20 పుస్తకాలు, 300 పరిశోధన పత్రాలు సమర్పించారు. అటువంటి వ్యక్తి అనుభవాలు ఈ తరానికి చాలా అవసరం. 88 ఏళ్ల వయసు కలిగిన కోనేరు కుటుంబమంతా విదేశాల్లో ఉంటే.. ఆయన మాతృభూమిపై ప్రేమతో అక్కడి నుంచి తిరిగొచ్చి ఇక్కడే ఉండి సేవలు అందిస్తున్నారు’ అని కొనియాడారు.

 

ఎవరైనా సరే.. అవకాశాలు అందిపుచ్చుకుని ఎక్కడు వెళ్లినా ఆ తర్వాత మాతృభూమికి ఎంతో కొంత తిరిగివ్వాలన్నారు. ప్రపంచ దేశాల్లో అనేక ప్రముఖ కంపెనీలకు సీఈవోలుగా భారతీయులే ఉన్నారని, ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనది మూడో స్థానమని గుర్తుచేశారు. ప్రపంచానికి రాబోయే 35 ఏళ్లకు సరిపడా మానవ వనరులను అందించే సత్తా భారతదేశానికి ఉందని, ఇక్కడ 60 శాతం మంది 35 ఏళ్లలోపు యువతే కావడం విశేషమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అలవరుచుకోవాలని కోరారు. పుస్తక రచయిత కోనేరు మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి అసాధారణమైన వ్యక్తి అని, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అంతటి వారని, ఆయన వల్ల పదవికే గౌరవం దక్కిందన్నారు. కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, గీతం వీసీ శివరామకృష్ణ, చైర్మన్‌ శ్రీభరత్‌ పాల్గొన్నారు.

"
"