అడ్డంగా దోరికిన మంత్రి…ఇదేం పని..?

కోట్లు విలువ చేసే నాలా స్థలాన్ని ఆక్రమించి అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారంటూ ఓ మంత్రిపై టీఆర్‌ఎస్‌ నేతలు, స్థానికులు ఆందోళనకు దిగారు. ఐదు గ్రామాల చెరువుల నీరు ప్రవహించే ఫాక్స్‌సాగర్‌ నాలాను కబ్జా చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని, నిర్మాణాలను నిలిపివేయాలని దూలపల్లి, కొంపల్లి గ్రామాల టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజలు అధికారులను కోరారు. మంత్రి వ్యవహారాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దృష్టికి తీసుకువెళ్లారు. నాలా కబ్జా అవుతున్నా కొంపల్లి మునిసిపల్‌ కమిషనర్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

 

వివరాల్లోకి వెళితే.. కొంపల్లి, దూలపల్లి గ్రామాల సరిహద్దులోని సర్వే నంబర్‌ 99, 170-సీలలో 200 మీటర్ల విస్తీర్ణంలో నాలా ప్రవహిస్తోంది. దీని ద్వారా కొంపల్లి, దూలపల్లి, మైసమ్మగూడ, గుండ్లపోచంపల్లి గ్రామాల్లోని ఐదు చెరువుల అలుగు నీరు ప్రవహించి ఫాక్స్‌సాగర్‌లో కలుస్తుంది. కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న ఈ స్థలం చుట్టు మంత్రి, అతడి అనుచరులు రేకులతో ప్రహారీ ఏర్పాటు చేశారు. పైపెచ్చు అక్కడ గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలనూ సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో దూలపల్లి, కొంపల్లి గ్రామాల టీఆర్‌ఎస్‌ నేతలు బూర్గుబావి హన్మంత్‌రావు, సన్నా శ్రీశైలంయాదవ్‌, బూర్గుబావి సత్యనారాయణతోపాటు మరి కొందరు శనివారం మంత్రి వైఖరిని నిరసిస్తూ సంఘటనా స్థలంలో ఆందోళన చేపట్టారు.అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు విషయాన్ని వివరించగా ఆయన సంఘటన స్థలానికి చేరుకుని మేడ్చల్‌ కలెక్టర్‌తో మాట్లాడారు.

 

కాగా, దుండిగల్‌ తహసీల్దార్‌ భూపాల్‌ సంఘటనా స్ధలానికి చేరుకుని నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనులు నిర్వహించకుండా జేసీబీతో కాలువ తవ్వారు. నాలా ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు. చిన్న డబ్బా వేసుకుంటేనే ఆగ మేఘాలపై వచ్చే కమిషనర్‌ ఈ నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు.

"
"