టీఆర్ఎస్ లో ముసలం..వెగంగా మారుతున్న పరీస్థీతులు..

మునిసిపల్‌ ఎన్నికల్లో తమకు ఎదురులేదని అధికార టీఆర్‌ఎస్‌ చెబుతున్నప్పటికీ.. అన్ని చోట్లా కేక్‌ వాక్‌ సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లోనైనా నెక్‌ టు నెక్‌ ఫైట్‌ తప్పదని పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ బలంగా ఉన్న మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎ్‌సకు గట్టి పోటీ అనివార్యమని వారు చెబుతున్నారు. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే తేలిందని, అందుకే అధిష్ఠానం రెబెల్స్‌ విషయంలో కలవరపడుతోందని అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీగా టీఆర్‌ఎ్‌సకి ఈ ఎన్నికల్లో సానుకూలత ఉన్నప్పటికీ, దాదాపు సగం మునిసిపాలిటీల్లో గెలుపు కోసం ఎంతో కొంత శ్రమించక తప్పదని పార్టీ ముఖ్యులు పలువురు అభిప్రాయపడుతున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా, స్థానికంగా ఉండి రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్న చోట్ల మునిసిపల్‌ పోరు ఆసక్తిగా మారిందని చెబుతున్నారు.అక్కడ టీఆర్‌ఎ్‌సకి నువ్వా? నేనా? అనే రీతిలో ఆ రెండు పార్టీల నుంచి పోటీ ఎదురవుతున్నట్లు సర్వే ఫలితాల్లో వెల్లడైందని సమాచారం. వందల్లో ఓట్ల తేడా జరిగినప్పటికీ, వార్డులు/డివిజన్లు చేజారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనమైన 12 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారికి, టీఆర్‌ఎస్‌ నేతలకు పూర్తి స్థాయిలో పొసగటంలేదు.

 

ఆ ప్రాంతాల్లోని మునిసిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎ్‌సకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందుకే పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని, ఒక్క చోట ఓడిపోయినా పదవులు ఊడతాయని మంత్రులకు సీఎం కేసీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారని అంటున్నారు. అదే సమయంలో రెబెల్స్‌ బరిలో లేకుండా చూసుకోవాలని, పార్టీ గీత దాటితే సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామంటూ ఆయన ప్రకటన చేశారని చెబుతున్నారు. వాస్తవానికి అధికార పార్టీగా టీఆర్‌ఎస్‌ మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చక్రం తిప్పే వీలుంటుంది. చైర్‌పర్సన్‌/మేయర్‌ పదవులు దక్కించుకోవటానికి సరిపోను వార్డులు/డివిజన్లలో గెలవలేకపోతే, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు.అయితే ఇందుకోసం శిబిరాలు నిర్వహించాల్సి వస్తుంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారికి ఎన్నికల్లో వారు ఖర్చు చేసిన మొత్తంతోపాటు, అదనంగా కొంత చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇన్ని తలనొప్పులకన్నా ఎన్నికల్లోనే గట్టిగా కొట్లాడి చైర్‌పర్సన్‌/మేయర్‌ పదవులు కైవసం చేసుకోవటానికి అవసరమైన వార్డులు/డివిజన్లు గెల్చుకోవాలనేది టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం వ్యూహంగా కనిపిస్తోంది. ఎక్కడైనా ఒకటి, రెండు ఓట్లు తక్కువ పడితే చూసుకోవచ్చని, ఎక్స్‌ అఫీషియో ఓట్లతోనూ నెట్టుకురావచ్చనేది పార్టీ ముఖ్యుల అభిప్రాయంగా ఉంది.మల్కాజిగిరి, నల్లగొండ, భువనగిరి, చేవెళ్ల, జహీరాబాద్‌, మెదక్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మునిసిపాలిటీలు, పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి సొంత అసెంబ్లీ నియోజకవర్గం జగిత్యాల వంటి ప్రాంతాల్లో టీఆర్‌ఎ్‌సకు గట్టి పోటీ ఇస్తామని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇందుకు ఆ పార్టీ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (పీసీసీ అధ్యక్షుడు), రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్లు, నియోజకవర్గ నేతలు స్థానికంగా అందుబాటులో ఉండటం కారణమని చెబుతున్నారు.

 

ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బీజేపీ ప్రధానంగా గట్టి పోటీ ఇచ్చే అంచనాలు ఉన్నాయి. తమ ప్రాంతాల్లో ఎన్నికలు జరిగే మునిసిపాలిటీల్లో ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఆ పార్టీ ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావు పనిచేస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు.

"
"