ప్రభుత్వ వైఖరితో పరువు పోగోట్టుకుంటున్న పోలీస్ శాఖ…?

ఐపీసీ అంటే… ఇండియన్‌ పీనల్‌ కోడ్‌! భారతీయ శిక్షా స్మృతి! కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో మరో అనధికార కోడ్‌ అమలవుతోందనే విమర్శలు వెలువడుతున్నాయి. అదే… వైసీపీ కోడ్‌! ఇది అధికార పార్టీ నేతల సొంత శిక్షా స్మృతి! చాలాచోట్ల అసలు ఐపీసీ కంటే, వైసీపీ కోడ్‌ అమవుతోందని చెబుతున్నారు. పలుమార్లు డీజీపీ స్వయంగా హైకోర్టు ముందు హాజరు కావడం, పోలీసులపై తరచూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడం దీని ఫలితమే! ‘ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ గాడి తప్పుతోంది. రూల్‌ ఆఫ్‌ లా అమలు కావడంలేదు.డీజీపీని ఇప్పటికే పలుసార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదు. పోలీసు వ్యవస్థను అదుపు చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలి’ అంటూ హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. స్థానిక పోలీసు అధికారుల అత్యుత్సాహమే డీజీపీకి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తోందనే వ్యాఖ్యలు ఆ శాఖలోనే వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో భార్యాభర్తలను పోలీసులు నిర్బంధించి తమకు తెలియదని చెప్పడంతో… కుటుంబ సభ్యులు హై కోర్టును ఆశ్రయించారు.విశాఖ జిల్లాలో తమ పార్టీ నాయకుడి కుమారుడి పెళ్లికి వెళ్లేందుకు విమానాశ్రయంలో దిగిన చంద్రబాబును పోలీసులు కదలనివ్వలేదు. ‘విశాఖలో బాబు అడుగుపెట్టొద్దు’ అనే అధికార పార్టీ నేతలు తాము అనుకున్నది సాధించారు. ఈ రెండు ఘటనల్లోనూ డీజీపీని పిలిపించిన హైకోర్టు.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించింది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక న్యాయవాదిపై పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించి… డీజీపీ ప్రతినిధిగా జిల్లా ఎస్పీని గట్టిగా మందలించింది. గుంటూరులో స్థల వివాదంలో కొందరిని బంధించిన పోలీసులపై ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇలాంటి అనుభవాలతోనైనా జాగ్రత్తగా ఉండాల్సిన పోలీసులు… ఓ యువకుడిపై నమోదైన కేసులో మేనమామను బంధించారు.వారు చెప్పిందే చట్టం…

పోలీసులు ఉన్నది ప్రజలను, బాధితులను కాపాడేందుకే! శిక్షణ సమయంలో ఇదే ప్రమాణం చేస్తారు. కానీ… చివరికి, తాము అనుకున్న చోటికి పోస్టింగ్‌ ఇప్పించిన నేతలు చెప్పిన చట్టాన్ని అమలు చేస్తున్నారు. కొందరైతే ఈ విషయంలో మరీ శ్రుతిమించి, అధికార పార్టీ నేతలకు ‘జీ హుజూర్‌’ అంటున్నారు. రాజమహేంద్రవరంలో అధికార పార్టీ నాయకుడి ఇసుక వాహనానికి అడ్డొచ్చాడని స్థానిక ఎస్‌ఐతో చెప్పి దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ వెంటనే శ్రీకాకుళం జిల్లాలో స్థానిక వైసీపీ నేత సమక్షంలోనే ఒక సీఐ దళితుడిని బూటుకాలితో తన్నారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా చీరాలలో ఇలాంటి ఘటనే జరిగింది.వీటిపై స్పందించిన డీజీపీ సవాంగ్‌ బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్‌ చేశారు. అయినప్పటికీ… చాలామంది పోలీసు అధికారులు మారడం లేదు. అధికార పార్టీ నేతలు చెప్పిన చట్టాన్ని అమలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు స్థానిక వైసీపీ నేతల ఆదేశాలు/ఆకాంక్షల మేరకు నడుచుకున్న సంఘటనల్లో మచ్చుకు కొన్ని…భర్తను కోల్పోయి స్టేషన్‌కు వెళితే…

చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో గొర్రెలు మేపుతూ జీవనం సాగించే వెనుకబడిన వర్గానికి చెందిన రవి అదే ప్రాంతానికి చెందిన అధికారపార్టీ నేత ధనశేఖర్‌ రెడ్డికి గొర్రెలు అమ్మిన డబ్బు అప్పుగా ఇచ్చాడు. అది తిరిగి ఇవ్వాలని పదేపదే కోరగా… ఆగస్టు 25న ‘డబ్బులిస్తాను రా’ అంటూ రవిని ధనశేఖర్‌ రెడ్డి బయటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రవి సమీప గుట్టల్లో శవమై కనిపించాడు. భార్య రమాదేవి పోలీసు కేసు పెట్టి… ధనశేఖర్‌ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేయగా, విచారించి చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధితురాలిపై ఒత్తిడి పెంచారు. ససేమిరా అనడంతో లాఠీలతో కొట్టారు.ఆశ వదులుకోండి.. లేదంటే అట్రాసిటీ కేసు..

గుంటూరులోని పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక వ్యక్తి స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఫెన్సింగ్‌ ధ్వంసం చేసి బోర్డులు తొలగించి 800గజాల స్థలంలోకి ప్రవేశించారు. స్థల యజమానులైన వృద్ధులు ‘ఇది మా ఆస్తి.. మీరెవరు?’ అని ప్రశ్నించడంతో ‘మా ప్రభుత్వం వచ్చింది. నేను ఎక్కడ అడుగుపెడితే అది మాదే’ అంటూ అప్పటికే పలు కేసులున్న ఆ వ్యక్తి బెదిరించాడు. బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ ఆస్తి పత్రాలు చూపించి ఫిర్యాదు చేయగా… పోలీసులు మరుసటి రోజు పిలిపించి ‘వాడితో మీ కెందుకు?ఇదిగో మీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఫిర్యాదు చేశాడు. స్థలం దగ్గరికి వచ్చిన వ్యక్తుల్లో ఎస్టీ వర్గం వ్యక్తి ఉన్నారట. రాజీ పడండి’ అంటూ సలహా ఇచ్చారు. కబ్జా చేసేందుకు వచ్చిన వ్యక్తి గురించి విచారించాలని బాధితులు కోరినా… ‘వాడి గురించి మాకు తెలుసు. మీరే వాడితో పెట్టుకోకండి’ అని పోలీసులే బాధితులను భయపెట్టారు. 35 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని వదులు కోవాలా.? అట్రాసిటీ కేసులో చిక్కుకోవాలా? ఏం చేయాలో తేల్చుకోలేక వృద్ధులు సతమతమవుతున్నారు.టీడీపీ నేతను పొగిడినందుకు..

కృష్ణా జిల్లా కంచికచర్లలో పేకాట ఆడుతున్నారంటూ ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసి గేమింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఆరుగురిని సంబంధీకులు స్టేషన్‌ జామీను ఇచ్చి తీసుకెళ్లగా… తల్లిదండ్రుల్లేని రాజశేఖర్‌ రెడ్డి అనే యువకుడిని స్థానిక టీడీపీ నేత ఒకరు స్టేషన్‌లో సంతకం పెట్టి విడిపించారు. కృతజ్ఞతతో ‘అన్నా నువ్వు అసలైన నాయకుడివి’ అంటూ ఆ యువకుడు వాట్సాప్‌ స్టేట్‌సలో పెట్టుకున్నాడు. అది చూసిన వైసీపీ నేతలు కంచికచర్ల పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి రాజశేఖర్‌ రెడ్డిని స్టేషన్‌కు పిలిపించారు.‘తెలుగుదేశం వాడిని పొగుడుతూ పోస్టింగ్‌లు పెడతావా?’ అంటూ ఎస్‌ఐ తిట్టి, కొట్టారు. తాను ఎవ్వరినీ దూషించలేదని, సాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్‌ చెప్పానని.. రాజశేఖర్‌ రెడ్డి బదులిచ్చినా వినిపించుకోలేదు. ఈ అవమానం భరించలేక ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.దళిత కుటుంబాన్ని బంధించిన ప్రకాశం పోలీస్‌..

ప్రకాశం జిల్లాలో దళిత కుటుంబానికి చెందిన తండ్రి, కుమారుడిపాటు సోదరుడిని ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి గత నెలలో అనధికారికంగా బంధించారు. ఒక రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీకి 15లక్షలు ఇవ్వాలంటూ రాత్రి పదింటి వరకూ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. తానెవ్వరికీ బాకీ లేనని, ఏదైనా ప్రాంసరీనోటు, చెక్‌ లాంటిది ఉంటే చూపాలని బాధితుడు ఎంత వేడుకున్నా పోలీసులు కనికరించలేదు. దీంతో సిగరెట్‌ తాగి వస్తానంటూ బయటికి వెళ్లిన దళితుడు రైలు కిందపడి ప్రాణాలు వదిలేశాడు. ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించగా రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ సర్వీసులో ఉండగా వసూళ్లకు బాధితుడిని వినియోగించుకున్నారని తేలింది.గంగిరెడ్డి కబ్జాకు అలిపిరి సీఐ అండ

తిరుపతిలోని ఒక కర్రల మిల్లుకు ఇటీవల కొందరు వ్యక్తులు వెళ్లి ‘ఇది మా స్థలం. మేం కొల్లం గంగిరెడ్డి మనుషులం. ఖాళీ చేయండి’ అని బెదిరించారు. సొంత ఆస్తిని ఎలా వదిలిపెట్టి పోతామని కర్రల మండీ యజమాని ప్రశ్నించాడు. రెండు రోజుల తర్వాత వచ్చిన మరికొంతమంది అందులో పనిచేసే వారిని బయటికి పంపి గేటుకు తాళం వేశారు. దీంతో బాధితులు అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా… ‘ఇది సివిల్‌ మ్యాటర్‌’ అని బదులిచ్చారు.దౌర్జన్యంగా తాళం వేయడం సివిల్‌ ఎలా అవుతుందని బాధితులు ప్రశ్నించగా వాళ్లతో గొడవెందుకు రాజీపడితే సమస్య ఉండదు కదా? అని సలహా ఇచ్చారు. దీంతో తమకు న్యాయం జరగదని భావించిన కర్రల మండీ యజమాని ఎర్రచందనం స్మగ్లర్‌ గంగిరెడ్డికి బంధువైన సీఐ తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారించిన అనంతపురం డీఐజీ కాంతి రాణా అలిపిరి సీఐపై బదిలీవేటు వేశారు.

"
"