ఢిల్లి మొత్తాన్ని ఊడ్చేసిన చిపురు..హస్తిన గడ్డపై సత్తా ఛాటిన అమ్ అద్మి

దేశ రాజకీయాలకు, జాతీయ పార్టీల బల ప్రదర్శనకు ప్రధాన వేదికగా నిలిచే రాజధాని ఢిల్లీలో… సామాన్యుడి పార్టీ మరోసారి సత్తా చాటుకుంది. ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలనే అస్త్రాలుగా బరిలోకి దిగిన ఆ ధైర్యం ముందు బడా రాజకీయ దిగ్గజాల వ్యూహాలు చిన్నబోయాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి చీపురుపట్టి ఢిల్లీని ఊడ్చేసింది. ఇవాళ వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 70 స్థానాలకు గానూ 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దీంతో జాతీయ పార్టీలైన బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీ మరోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది.

 

కాగా పార్లమెంటు ఎన్నికలు జరిగి సంవత్సరం కూడా తిరక్క ముందే… హస్తినలో ఆయా పార్టీల హస్తరేఖలు మారిపోవడంపై రాజకీయ వర్గాల్లో విశేష ఆసక్తి నెలకొంది. గతేడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది.ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలుండగా ప్రధాని నరేంద్రమోదీ హవాతో 2019 ఎన్నికల్లో బీజేపీ ఇక్కక క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 7 స్థానాల్లోనూ విజయం సాధించి తిరుగులేదనిపించుకుంది. తీరా తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం ఓటరు ఆమాద్మీ పార్టీ వైపు మొగ్గుచూపాడు. దీంతో కేంద్రంలో, రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వాలు కావాలనే దానిపై ఢిల్లీ ఓటరుకు స్పష్టమైన అవగాహన ఉందనేందుకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా అచ్చం ఇదే పరిస్థితి చోటుచేసుకున్న విషయం గుర్తు చేస్తున్నారు.

 

దేశ వ్యాప్తంగా మోదీ మేనియా కారణంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. ఢిల్లీలో మొత్తం 7 ఎంపీ స్థానాలు బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. ఆ మరుసటి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమాద్మీ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. మొత్తం 70 స్థానాలకు గానూ ఆమాద్మీ పార్టీ 67 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయగా… బీజేపీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. మళ్లీ ఇప్పుడు దాదాపుగా అదే సీన్ రిపీట్ అవుతుండడం గమనార్హం.

"
"