తెలుగుదేశం మళ్ళీ బుట్టలో పడుతుందా..?

అవును తెలుగుదేశం మళ్ళీ బుట్టలో పడుతుంది… ఎన్నికలకు ముందు ఏ మాయలో పడి అలసత్వం ప్రదర్శించిందో ఇప్పుడు అదే బుట్టలో పార్టీ మొత్తం పడుతుంది. రాజకీయంగా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని కొన్ని ప్రచారాలు నాశనం చేశాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వాటిలో ప్రధానంగా పార్టీకు అనుకూలంగా పని చేస్తుంది అనే ముద్ర ఉన్న కొన్ని ప్రముఖ మీడియా చానెల్స్. వాటి కారణంగా అధినేత చంద్రబాబు సైతం కొన్ని విషయాల్లో అలసత్వం ప్రదర్శించారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

రాజకీయంగా ఆయన తీసుకునే నిర్ణయాలను కూడా ఆ మీడియా ప్రభావితం చేయడంతో… తెలుగు తమ్ముళ్లు నష్టాన్ని అంచనా వేయలేకపోయారు.తెలంగాణ ఎన్నికల ముందు ఒక మీడియా ఛానల్ లో కెసిఆర్ కి వ్యతిరేకంగా వార్త రావడం, ఒక హీరోయిన్ తెలుగులో సినిమాలు చేయను అని చెప్పడం వంటి వాటిని ప్రజాకూటమి గెలుపు సంకేతాలుగా ప్రచారం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది ఎన్నికల్లో జగన్ ప్రచారానికి జనం రాక ఇరుకు సందుల్లో పెడుతున్నారు అని మాట్లాడటం… దానికి టీడీపీ కార్యకర్తలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో జరగాల్సిన నష్టం జరిగింది. చిన్న చిన్న విషయాలను పట్టుకుని పార్టీకి అనుకూలంగా మార్చుకునే అలవాటు ఉన్న టీడీపీ క్యాడర్ ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అనుకూల మీడియాలో మూడు నెలల నుంచి వస్తుంది.దీనికి సంబంధించిన పేపర్ క్లిప్ లు సహా పలు వీడియోలు సోహాల్ మీడియాలో పోస్ట్ చేసి జగన్ పతనానికి నాంది పడింది అంటూ వ్యాఖ్యానిస్తున్నాయి.

పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీ ఏదో మాట్లాడినా ప్రభుత్వానికి ఎంపీ వ్యతిరేకం అని ఆ మీడియా రాసింది. దీనిని నమ్మిన క్యాడర్… ఎక్కువగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు ఒక్కరు అంటే ఒక్కరు కూడా అది ఎంత వరకు సబబు, జగన్ మీద క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత ఉందా అనే విషయాన్ని ఆలోచించడం లేదు… పోస్టులు చూసి సంబరపడుతున్నారు. అదే పది మందికి చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అనుకూల మీడియా బుట్టలో టీడీపీ క్యాడర్ పడుతుంది. ప్రజా వ్యతిరేకతను ఎక్కువ ఊహించుకుంటుంది.

"
"