సొంత కార్యకర్తపై చెయిజారిన టీఆర్ఎస్ …

ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సొంత పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్నారు. దీంతో గ్రామస్థులంతా ఏకమై ఆయనను నిలదీశారు. చేసేదేమీ లేక వారికి క్షమాపణ చెప్పిన ఆయన.. ఆ వెంటనే తిరుగు పయనమయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని తొగుట మండలం వెంకట్రావుపేటలో ఆదివారం జరిగింది. గ్రామంలో కార్యకర్తలను కలిసేందుకు క్రాంతికిరణ్‌ వెళ్లారు. ఆయనతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సిలివేరి మల్లారెడ్డి ఉన్నారు. సమావేశం జరుగుతుండగా అక్కడ కనకరాజు అనే కార్యకర్త తనకు పార్టీలో సభ్యత్వం ఇవ్వకపోవడంపై మల్లారెడ్డిని నిలదీశారు.ఈ తరుణంలో అసహనానికి గురైన క్రాంతికిరణ్‌.. కనకరాజుపై చేయిచేసుకున్నారు. దీంతో గ్రామస్థులంతా ఒక్కటై ‘‘మా ఊరికొచ్చి మా పిల్లలపై చేయి చేసుకుంటావా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘెరావ్‌ చేయడంతో.. ఎమ్మెల్యే వారికి క్షమాపణ చెప్పి, అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయారు. కాగా, సమావేశంలో గొడవ జరగకుండా తాను కనకరాజు భుజంపై చేయి వేసి సముదాయించానని, చేయి చేసుకోలేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు.

"
"