వైసీపీకి మరో ఊహించని షాక్ … శత్రుచర్ల రాజీనామా

ఏపీలో ఎన్నికల ముందు వైసీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. విజయనగరం జిల్లాకు చెందిన కీలక నేత, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మామ, మాజీ శాసన సభ్యులు శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.. త్వరలోనే మునిసిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో శత్రుచర్ల రాజీనామా చేయడం వైసీపీకి షాకేనని తెలుస్తోంది. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు వలనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శత్రుచర్ల ప్రకటించారు.

కార్యకర్తల సమావేశం తర్వాత ఏ పార్టీలో చేరుతానన్నది ప్రకటిస్తానని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అదే జరిగితే వైసీపీతో పాటు డిప్యూటీ సీఎంకు కూడా పెద్ద షాకేనని ఆయన అభిమానులు, కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు పుష్పశ్రీవాణి భర్త పరక్షిత్‌రాజుతో పాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు చంద్రశేఖరరాజును బుజ్జగిస్తున్నారని సమాచారం. ఫైనల్‌గా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో..? ఏ పార్టీ కండువా కప్పుకుంటారో వేచి చూడాలి.

‘శత్రుచర్ల’ కుటుంబానికి కంచుకోట ‘కురుపాం’..

కాగా.. జిల్లాలో కురుపాం నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఒడిశా సరిహద్దుకు ఆనుకుని ఉన్న కురుపాంలో 11 పర్యాయాలు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా శత్రుచర్ల వంశానికి చెందిన వారే శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గంలో ప్రజలకు వారి మాటంటే ఎంతో గౌరవం. అందుకే ఆ కుటుంబానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1967లో మొదటిసారిగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. తొలి ఎమ్మెల్యేగా 1967లో శత్రుచర్ల ప్రతాపరుద్రరాజు ఎన్నికయ్యారు.

ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన శత్రుచర్ల పరక్షిత్‌రాజు సతీమణి పాముల పుష్పశ్రీవాణి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు శత్రుచర్ల విజయరామరాజు. 1978, 1983, 1985, 1999లలో ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 1989లో విజయరామరాజు తమ్ముడు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, 2009లో మేనల్లుడు వీటీ జనార్దన్‌ థాట్రాజ్‌లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014లో ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషం. ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే శత్రుచర్ల విజయరామరాజు మినహా ఎవరైనా ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారు. రెండో సారి గెలవలేకపోయారు

"
"