రోడ్డేక్కిన అమరావతి రైతుల ఉద్యమం…

సోమవారం మహా పాదయాత్రతో తమ ఐక్యత చాటిన అమరావతి రైతులు… మంగళవారం ‘హైవే దిగ్బంధం’ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారు. నడిపించే నాయకులు లేకున్నా… సాధారణ మహిళలు, రైతులే ముందుకు నడిచారు. అఖిలపక్ష జేఏసీ రెండు రోజుల ముందే హైవే దిగ్బంధం సమయం, స్థలం గురించి ప్రకటించింది. దీనిని విఫలం చేసేందుకు పోలీసులు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. అటు మంగళగిరి నుంచి ఇటు నాగార్జున యూనివర్సిటీ దాకా టియర్‌ గ్యాస్‌, ఫైరింజన్లను ముందే సిద్ధం చేసుకున్నారు. మొదలుపెడితే కనీసం నాలుగైదు గంటలు ఆపకుండా నిరసన తెలపాలనే ఉద్దేశంతో రైతులు చేసుకొన్న ఏర్పాట్లను గుర్తించి, ఛిన్నాభిన్నం చేసేశారు. హైవే దాపుల్లో వారు ఉంచుకున్న మంచినీటి ప్యాకెట్లను, పులిహోర, పెరుగన్నం తయారీకి సిద్ధం చేసుకొన్న వంట సామగ్రి, సరుకులను స్వాధీనం చేసుకొన్నారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఇలా హైవే పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. కానీ… ఇవేవీ రైతులను అడ్డుకోలేకపోయాయి.

 

చినకాకాని హైవే మీదకు బిలబిలా రైతులు, కూలీలు, మహిళలు వచ్చేశారు. చుట్టుపక్కల పొదలు, గుట్టలు, పొలాల మీదుగా వడివడిగా దూసుకొచ్చారు. మెరుపు వేగంతో హైవేను దిగ్బంధించేశారు.ఉదయం పది గంటలకల్లా ఎటు చూస్తే అటు నిరసనకారులే! రెండు కిలోమీటర్ల పొడవునా గుంపులు గుంపులుగా హైవేపై కూర్చున్నారు. దీంతో ఇటు గుంటూరు, అటు విజయవాడ వైపు వేలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. జై అమరావతి, సేవ్‌ అమరావతి నినాదాలు మోగుతూనే ఉన్నాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు నానాతంటాలు పడ్డారు. ఒక్కో నిరసనకారుడిని పట్టుకెళ్లి వాహనం ఎక్కించడం… అంతలోనే మరోచోట మరో నిరసన బృందం తయారు కావడం! దీంతో ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. దీనికితోడు తీవ్రస్థాయిలో ప్రతిఘటనలు, తోపులాటలూ జరిగాయి. ఉదయం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల దాకా… ఇవే దృశ్యాలు! వార్డు స్థాయి నేతలను కూడా పోలీసులు ముందే అదుపులోకి తీసుకున్నప్పటికీ… సాధారణ రైతులు, మహిళలే ఒక్క ఉదుటన హైవేపైకి తరలి రావడం విశేషం. సర్వీసు రోడ్లను సైతం వదలకుండా బైఠాయించడంతో హైవేపై వాహనాలు ఎటూ కదల్లేకపోయాయి. తొలుత పోలీసులు అయిదారు పర్యాయాలు ఆందోళనకారులను బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించి మంగళగిరి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత నిరసనకారుల సంఖ్య అంతకంతకు పెరిగింది. దీంతో… ఒక దశలో పోలీసులు కూడా చేతులెత్తేశారు. చివరికి… మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో నిరసనకారులు స్వచ్ఛందంగా ఆందోళనను విరమించారు.

"
"