పివీకి భారతరత్న ఇవ్వాలి…

భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువును ఏర్పాటు చేయాలని, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి పీవీ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభ, మండలిలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆయన తెలిపారు. పీవీకి భారతరత్న ప్రకటించడం ఇప్పటికే ఆలస్యమైందని, ఆయనకు మర్యాద లభించలేదనే బాధ తెలంగాణ బిడ్డలుగా తమకు ఉందని అన్నారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో భారతరత్న ప్రకటించడం సముచితంగా ఉంటుందని అన్నారు. పీవీకి మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ మంగళవారం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధో సంపన్నుడు, బహముఖ ప్రజ్ఞాశాలి పీవీ అని కొనియాడారు.‘‘భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతికి ఒక విశిష్ట సందర్భం ఉంది. తెలంగాణ అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. 2020 జూన్‌ 28న పీవీ జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూలకారకుడు పీవీయే. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొదటి దక్షిణ భారతీయుడిగా, తెలంగాణ ముద్ద బిడ్డగా చరిత్ర సృష్టించిన ఘనుడు. అందుకే పీవీ మన ఠీవి అని తెలంగాణ సగర్వంగా చాటుకుంటున్న సందర్భం ఇది’’ అని కేసీఆర్‌ అన్నారు.పీవీ ‘అంతర్జాతీయ భారత్‌’ నిర్మాత!

‘‘ఆధునిక భారతదేశ చరిత్రను మలుపుతిప్పింది జవహర్‌లాల్‌ నెహ్రూ, పీవీ నరసింహారావులే. నెహ్రూ నవభారత నిర్మాత కాగా, పీవీ అంతర్జాతీయ భారత నిర్మాత. పీవీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతోంది. దేశ ఆర్థికస్థితి అథోగతిలో ఉంది. మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ.. రాజకీయ స్థిరత్వం నెలకొల్పాలి. కాలం విసిరిన ఈ సవాళ్ల నడుమ తనదైన దార్శనికతతో పీవీ ధైర్యంగా ముందగుడు వేశారు’’ అని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పీవీ.. వాటిని అత్యంత సాహసోపేతంగా అమలు చేశారని ప్రశంసించారు. ‘‘లైసెన్స్‌ పర్మిట్‌ రాజ్‌ను అంతం చేశారు. దేశాభివృద్ధిలో ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని పెంచారు.అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేసి ఆర్థికవ్యవస్థను పట్టాలెక్కించి.. పరుగు తీయించారు’’ అని కేసీఆర్‌ అన్నారు. ప్రస్తుతం భారతీయ మేధావులు విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేయడం, దేశానికి విదేశీ మారక నిల్వలు పెద్ద ఎత్తున సమకూరడం,ప్రభుత్వ రంగ కంపెనీల్లో సైతం పోటీతత్వం పెరగడం వెనక పీవీ దార్శనికత ఉందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. భారత విదేశాంగ విధానంలో మేలిమలుపులు ఆయన దౌత్యనీతి ఫలితమేనని తెలిపారు.పీవీ భూస్వామ్య కుటుంబంలో పుట్టి.. భూసంస్కరణలకు నాంది పలికిన మహానీయుడని కేసీఆర్‌ కొనియాడారు. దేశంలో భూసంస్కరణలను అత్యంత నిజాయతీగా అమలుచేసిన సీఎం అని, 1972లో భూసంస్కరణల చట్టం చేశారని గుర్తుచేశారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారన్నారు. భూసంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేసినందుకు, ముల్కి రూల్స్‌ను సమర్థించినందుకు ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించారని అన్నారు. ‘‘రాష్ట్ర విద్యామంత్రిగా గురుకుల పాఠశాలలను, కేంద్ర మానవ వనరుల శాఖమంత్రిగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారు. ఇవి గ్రామీణ విద్యార్థులకు ఉన్నతమైన విద్యను ఉచితంగా అందిస్తున్నాయి. 7-10 తరగతి వరకు ఉండే డిటెక్షన్‌ పద్ధతిని రద్దుచేశారు. పిల్లలు జీతగాళ్లు, డ్రాపౌట్స్‌, బాలకార్మికులుగా మిగిలిపోతున్నారనే ఉద్దేశంతో మానవీయ కోణంలో ఆలోచించి ఆయన ఈ సంస్కరణ చేశారు. అన్ని కోర్సుల అకాడమీ పుస్తకాలు తెలుగులో లభించాలనే ఉద్దేశంతో తెలుగు అకాడమీని స్థాపించారు.’’ అని సీఎం చెప్పారు. పీవీ మహోన్నత సాహితీవేత్త అన్నారు.అసెంబ్లీలో పీవీ చిత్రం

పీవీ తైలవర్ణ చిత్రాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డిని సీఎం కేసీఆర్‌ కోరారు. ప్రారంభానికి తమను పిలిచి ఘనంగా జరపాలన్నారు. సీఎం విజ్ఞప్తి మేరకు అసెంబ్లీ ప్రాంగణంలో పీవీ చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తామని స్పీకర్‌ తెలిపారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. పీవీకి భారతరత్న ప్రకటించాలనే తీర్మానాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించే దిశగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యక్తిగతంగా తన చిన్నతనంలో అమ్మమ్మ ఊర్లో మొదటిసారి పీవీ నరసింహారావు పేరు విన్నానని గుర్తుచేసుకున్నారు. పట్వారీ నుంచి ప్రధాని వరకు ఎదిగిన తెలంగాణ ముద్దు బిడ్డ అని అన్నారు. పీవీ పూర్వ వరంగల్‌ జిల్లా లక్నెపల్లిలో జన్మించడం ఆ జిల్లా వ్యక్తిగా అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. పీవీ పుట్టి, పెరిగి, విద్యాభ్యాసంచేసిన వరంగల్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రకటించారు. కాళేశ్వరం వద్ద పీవీ నరసింహారావు మెమోరియల్‌ పార్కు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.నాకు ఇంజనీరింగ్‌ సీటు ఇప్పించారు: గంగుల

పీవీ నరసింహారావుతో తనకు చాలా అనుబంధం ఉందని, 1984లో ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తనకు ఇంజనీరింగ్‌ సీటు ఇప్పించారని మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. రూ.18 వేలు కట్టాలని కళాశాల వారు వేధిస్తే.. వెనకబడిన వర్గాల వారు డబ్బు కట్టలేరని పీవీ అన్నారని గుర్తుచేసుకున్నారు. ఆయన వల్ల నాలుగేళ్లు ఒక్కరూపాయీ చెల్లించకుండా ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించానని చెప్పారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ తీర్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కరీంనగర్‌-వరంగల్‌ రహదారికి ఆయన పేరు పెట్టాలని గంగుల కోరారు.

"
"