ప్రభుత్వ తీరుపై మండిపడ్డ గవర్నర్ తమిళి సై

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా పనిచేయలేదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతను ప్రభుత్వం చాలా తక్కువగా అంచనా వేసిందని విమర్శించారు. ఫార్మా హబ్‌, మెడికల్‌ హబ్‌ రాష్ట్రంగా ఈ విషయంలో ప్రభుత్వం మరింత గట్టిగా చర్యలు చేపట్టాల్సిందని.. అలా జరగలేదని అమె పేర్కొన్నారు. వైద్య పరంగా అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటే రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉండేదన్నారు. వైర్‌సను అదుపు చేసే విషయంలో గట్టిగా పని చేయాలంటూ వైద్య నిపుణురాలిగా ఉన్న అనుభవంతో తాను, మూడు నెలల క్రితమే ప్రభుత్వాన్ని హెచ్చరించానని చెప్పారు. వైరస్‌ వ్యాప్తి ప్రాథమిక దశలో ఉన్నప్పుడే కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి తాను ఆరు, ఏడు లేఖలను రాశానని.. రాష్ట్రంలో కరోనా తీవ్రతను నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే తెలియజేసినా, పరీక్షల సంఖ్య పెంచాని కోరినా స్పందించలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

 

రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల తీరుపై ఓ ఆంగ్ల చానల్‌తో గవర్నర్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా 80 శాతం కరోనా కేసులు 10 రాష్ట్రాల నుంచే ఉన్నాయని ప్రధానమంత్రి మోదీ చెప్పారని, ఆ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు. రోజుకు 50 కేసులు వచ్చే రాష్ట్రంలో ఆ సంఖ్య 2000-2600 దాకా వెళ్లిందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు లక్షకు చేరువ కావడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలపై చేసిన సూచనలేవీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రాష్ట్రంలో కేసులు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7 వేల వైద్యులతో పాటు 20 వేల మంది నర్సుల అవసరం ఉందని, వైద్యసిబ్బందితో పాటు బెడ్లను కూడా అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచాలని లేఖల ద్వారా నేరుగా సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదన్నారు. కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు.కరోనా కట్టడి చేయాలంటే పరీక్షలు ఒక్కటే మార్గం అని, టెస్టులు చేయించుకోవాలనుకున్న వారందరికీ పరీక్షలు చేయాలని సూచించానని, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల పేరు చెప్పి ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. పేద వర్గాల కోసం జిల్లా ఆస్పత్రుల్లో కరోనా చికిత్సను ప్రారంభించాలని, మెడికల్‌ కాలేజీల్లోని ఆస్పత్రులను వినియోగించుకోవాలని, ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయాని సూచించినా ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని పేర్కొన్నారు. దాంతో 33 జిల్లాల నుంచి కరోనా రోగులంతా చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా పరీక్షలు చేయడానికి వీలుగా సంచార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని పదే పదే కోరానని వెల్లడించారు. జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వైద్యసిబ్బందిని పెంచితే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. పరీక్షలు చేయడం, కాంట్రాక్ట్‌లను గుర్తించడం, వైద్య సేవలు అందించడం వంఇ చర్యలతోనే కరోనాను కట్టడి చేయగలమన్నారు.

 

కరోనా చికిత్సలో కీలకమైన ప్లాస్మా దానాన్ని పెంచడాన్ని ప్రోత్సహించాలని కోరారు.కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కుల ధారణ అత్యంత కీలకమైందని గవర్నర్‌ తమిళసై అన్నారు. మాస్కుతో 90 శాతం కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని చెప్పారు. మాస్కుల ధారణతో వైరస్‌ వ్యాప్తిచెందకుండా అడ్డుకోవచ్చని పలు దేశాల్లో నిరూపితమైందని చెప్పారు. శానిటైజర్ల వినియోగం, భౌతికదూరం పాటించడం వంటి చర్యలతో కూడా కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కేసులు పెరిగిపోతున్న తరుణంలో రాజకీయ నాయకులు కూడా మాస్కులు ధరించడం లేదని, భౌతికదూరం పాటించడం లేదని విమర్శించారు. ప్రార్థనామందిరాల్లో కూడా భౌతికదూరం పాటించడం వంటి చర్యలను చేపట్టాలన్నారు.

"
"