వైసీపీ తీరుపై పవన్ అగ్రహం…

రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. మంగళవారం చినకాకాని దగ్గర రైతులతో పోలీసులు వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. రైతులను, మహిళలను భయపెట్టి.. వారిని నిరసనల నుంచి దూరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. నిరసన మొదలుకాక ముందే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్‌ను గృహ నిర్భందంలో ఉంచారని, పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివా్‌సను కారణం చెప్పకుండానే అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారని.. ఇలాంటి చర్యలతో ఆందోళనలను ఆపగలమనుకుంటే పొరపాటని చెప్పారు.

 

రాజధానిని అమరావతి నుంచి తరలించడం.. భూములు త్యాగం చేసిన రైతులకు అన్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. విశాఖపట్నం వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా కనిపించడం లేదన్నారు. ‘రాయలసీమవాసులకు విశాఖపట్నం అంటే దూరాభారం అవుతుంది. ఈ విషయమై సీమవాసుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై వైసీపీ ప్రభుత్వం పట్టునట్టు వ్యవహరిస్తోంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తీవ్ర వెనుకబాటుతనం ఉంది. వాటి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం వద్ద ప్రణాళికలు లేవు’ అని దుయ్యబట్టారు. రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు రాజధాని ప్రాంతాల్లో చేసిన మహా పాదయాత్ర వారి ఆవేదనకు అద్దం పట్టిందన్నారు. వారిని అణచివేయాలని చూస్తే అంతకంటే బలంగా ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. రాజధాని మార్పు ఉద్యోగులకూ ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోందని పవన్‌ తెలిపారు.

"
"