పోలీసులకు హైకోర్టు కోరడా…

రాజధాని ప్రాంత రైతుల నిరసనలపై పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపట్ల హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనిఖీల పేరుతో సాధారణ పౌరుల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. రాజధాని ప్రాంతంలో పోలీసులది ముమ్మాటికీ అతే అని స్పష్టం చేసింది. రాజధానిలో 144 సెక్షన్‌ విధింపుపై తగిన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సాధారణ జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఆదేశించింది. మహిళల్ని సూర్యాస్తమయం తర్వాత, ముందు నిర్బంధంలో ఉంచరాదని… ఒకవేళ తప్పని పరిస్థితి నెలకొంటే అందుకు కారణాలను వివరిస్తూ నివేదిక సిద్ధంచేసి జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. మహిళల్ని అరెస్టు చేయాల్సివచ్చినప్పుడు తప్పనిసరిగా మహిళా కానిస్టేబుళ్లను వినియోగించాలని, సుప్రీంకోర్టు తీర్పును తు.చ. తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. సహేలీ ఉమెన్స్‌ రిసోర్స్‌ సెంటర్‌ వర్సెస్‌ ఢిల్లీ పోలీసు కమిషనర్‌ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం కింది స్థాయి అధికారుల చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.

 

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన 8 పిటిషన్లతోపాటు మీడియాలో వచ్చిన వార్తా కథనాలు, ఫొటోల ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసును విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. శుక్రవారం జస్టిస్‌ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్లపై మరోమారు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఏజీ ఎస్‌.శ్రీరాంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఫొటోల్లో కనిపిస్తున్న పోలీసులు తమ పేర్లు సూచించే నేమ్‌ప్లేట్స్‌ ఎందుకు పెట్టుకోలేదు? వారిని పోలీసులుగా ఎలా భావించాలి? 144 సెక్షన్‌ గురించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అనుచితంగా మాట్లాడతారా? దీనిని కోర్టు ధిక్కారంగానే భావించవచ్చుకదా?’’ అని నిలదీసింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ జోక్యం చేసుకుని.. మందడంలోని తన కార్యాలయానికి వస్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకుంటున్నారని, ఐడీ కార్డు చూపాలంటూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘రాజధానిలో పౌరులు ఫొటో ఐడీకార్డులు మెడలో వేసుకుని తిరగాలా? ఏ చట్ట నిబంధనల ప్రకారం ఐడీ కార్డులు చూపించాలని పోలీసులు అడుగుతున్నారు? సచివాలయ ప్రవేశంపై నిబంధనలు విధించవచ్చేమో కానీ ఆ మార్గంలోవెళ్లే వారందరిపైనా ఆంక్షలు విధిస్తామనడం సరికాదు’’ అని వ్యాఖ్యానించింది. ఆ ప్రాంతంలో అసెంబ్లీ, సచివాలయం ఉండడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు వహిస్తున్నారని ఏజీ వివరించారు. ‘‘144 సెక్షన్‌ ఎందుకు విధించాల్సి వచ్చింది? పబ్లిక్‌ ఆర్డర్‌కు విఘాతం జరుగుతుందనా? లా అండ్‌ ఆర్డర్‌కు విఘాతం కలుగుతుందనా? రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే 144సెక్షన్‌ విధించడమేంటి? ప్రజాస్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించడమేంటి?’’ అని ప్రశ్నించింది. గ్రామాల్లో పోలీసు కవాతు ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీసింది. పబ్లిక్‌ ఆర్డర్‌కు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఏజీ బదులిచ్చారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చాక అంతా ప్రశాంతంగా ఉందని, మాజీ సీఎం 30కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించినా పోలీసులు ఎలాంటి ఆటంకం కల్పించలేదన్నారు.

 

వ్యక్తిగత పనిమీద వెళ్తున్న తననే పోలీసులు ముప్పుతిప్పలు పెట్టారని, పోలీసుల వ్యవహారశైలి ఎలా ఉంటుందో తనకూ అనుభవంలోకి వచ్చిందని జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓపెన్‌ కోర్టులో ఈ విషయం చెప్పడం సరికాదని, 144 సెక్షన్‌ పేరుతో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తనకూ తెలిసొచ్చిందని పేర్కొన్నారు. పోలీసుల తీరు ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించారు. దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. తమకు ఎలాటి ఇబ్బందులు సృష్టించలేదని రాసివ్వాలంటూ పోలీసులు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఆ వివరాలు అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. పోలీసుల చేతిలో గాయపడి ఆస్పత్రి పాలైన మహిళ శ్రీలక్ష్మి ఆరోగ్య స్థితిని, వైద్యుల నివేదికను తమ ముందుంచాలని సూచించింది.నిరసనకారులపై పోలీసులు దాడులు చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన ఫొటోల్లో కొన్ని మార్ఫింగ్‌వి ఉన్నాయని ఏజీ ఎస్‌.శ్రీరాం తెలిపారు. 2017లో బిహార్‌లోని భగల్‌పూర్‌లో జరిగిన సంఘటనలో గాయపడిన మహిళ ఫొటోను ఇక్కడిదిగా చూపించారని వివరించారు. ‘‘ఫొటోల్లో కనిపించే దానికి, వాస్తవానికి చాలాతేడా ఉంది. ఆ వీడియోలు ధర్మాసనం ముందుంచుతాం. ఇటీవల విజయవాడ బెంజ్‌సర్కిల్‌ నుంచి నిరసనకారులు ర్యాలీ చేపట్టగా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అక్కడ జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడిపోయారు. వారిని పోలీసులు పైకి లేపుతుండగా ఫొటోలు తీసి పోలీసులే మహిళల్ని తోసేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు’’ అని వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఆయా ఫొటోల్లోని పోలీసుల పేర్లు ఇవ్వాలని ఆదేశించింది.

 

‘‘13న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నాం. 20న అసెంబ్లీ ముట్టడి, జైల్‌ భరో, కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని రైతులు, వివిధ పార్టీలకు చెందినవారు పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్‌శాఖపై ఉంది. హద్దుమీరి వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకుంటాం’’ అని ఏజీ వివరించారు. స్పందించిన ధర్మాసనం.. నిరసనకారులు కూడా సంయమనం పాటించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది.రాజధానిలో పౌరులు ఐడీకార్డులు మెడలో వేలాడదీసుకుని తిరగాలా? అడుగడుగునా అన్ని తనిఖీలా? గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు ఎందుకు? 144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పోలీసు అధికారులు అనుచిత వ్యాఖ్యలు చేయడమా?

"
"