నవ్యాంధ్ర జీవనాడి.. పోలవరం ప్రస్తుత పరీస్థీతేంటో..?

నవ్యాంధ్ర జీవనాడి.. రైతుల చిరకాల స్వప్నం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరో 17మాసాల్లో పూర్తిచేసి తీరతామని సీఎం ధీమాతో ఇస్తున్న హామీకి తగినట్టుగా పనుల్లో పురోగతి కనపించడం లేదు. కాంక్రీట్‌ పనులతో సహా మిగతావన్నీ ఎనిమిది నెలలుగా పడకేశాయి.స్పిల్‌వే చానల్‌లోకి చేరిన వరద ముంపు జలాలను ఇంకా తోడి పోయనేలేదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల్లో పని కూడా పూర్తికాలేదు. ఎక్కడికక్కడ పనులు పెండింగ్‌లో పడ్డాయి. పనులను పరుగులు పెట్టించే యంత్రాంగం మూలనపడింది. సర్కారు దృష్టి సారించక, కేంద్రం నుంచి నిధులు రాక అంతటా నిశ్శబ్దం నెలకొంది. ఎన్నికలకు ముందువరకు పనుల పురోగతిపై రోజూ కసరత్తు సాగేది. ఇప్పుడంతా భిన్నమైన పరిస్థితి. గత 8నెలల్లో జరిగింది కేవలం 30వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు మాత్రమే. అవీ ఈ మధ్య జరిగినవే. రివర్స్‌ టెండరింగ్‌, కాంట్రాక్ట్‌ ఏజెన్సీల మార్పు వంటి నిర్ణయాలు కూడా పనులు ఆలస్యమవడానికి కారణాలని చెబుతున్నారు.కీలకమైన స్పిల్‌వే పనుల్లో ఇప్పటికి పూర్తయింది 71శాతమే. మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలంటే శరవేగంగా ముందుకు కదిలాలి. గేట్ల అమరికకు వీలుగా విదేశాల నుంచి బుష్‌లు రావాలి. లక్ష్యం మేరకు స్పిల్‌వే నిర్మాణం జూన్‌ నాటికి పూర్తి కావాల్సి ఉంది. స్పిల్‌వే తుదిదశకు చేరుకోవాలంటే మరికాస్త సమయం పట్టే అవకాశం లేకపోలేదని ఇంజనీర్లే చెబుతున్నారు. ఎందుకంటే స్పిల్‌వేతో పాటు స్పిల్‌ చానల్‌ పనులు సమాంతరంగా కొనసాగించాల్సిందే.

 

గత వరదల సమయంలో స్పిల్‌ చానల్‌లో దాదాపు 3టీఎంసీల నీరు నిలిచింది. దీనిలో 2టీఎంసీలు అతి కష్టమ్మీద తొలగించారు. స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. 48గేట్లకు గాను ప్రయోగాత్మకంగా ఇంతకుముందే తొలిగేటు అమర్చేందుకు ప్రయోగం జరిగినా ఇప్పుడా పరిస్థితి లేదు. ఇటీవల ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్‌ ప్రాజెక్టును సందర్శించినప్పుడు మరో ఏడాదిలోపే పనులు పూర్తవుతాయని ధీమాగా వెల్లడించారు. పనుల పురోగతి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. కాంక్రీట్‌ పనుల్లో కొద్దిమాసాలుగా 20వేల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రం పూర్తయింది. ఎన్నికల ముందువరకు స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు దాదాపు 10.86లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తికాగా, ఇప్పుడు స్వల్పమొత్తంలోనే సాగాయి. స్పిల్‌ చానల్‌లో ఇంతకుముందు మాదిరిగానే 12.85లక్షల క్యూబిక్‌మీటర్ల పనులు యథావిధిగానే ఉండి, అంగుళం కూడా కదల్లేదు.ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లోనూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌పై మీటర్‌ ఎత్తున స్ర్టిప్పింగ్‌ వర్కు చేపట్టాలని ఇటీవల ఇంజనీర్లు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు ఈ జూన్‌ నుంచే ఆరంభం కావాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జూన్‌ నాటికి ఈ పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. కానీ గోదావరి వరదల కారణంగా దిగువ కాఫర్‌ డ్యామ్‌ దాదాపు 600మీటర్ల మేర దెబ్బతింది. ఇంతతక్కువ సమయంలో కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం పూర్తిచేయడం అంత తేలిక కాదని, ఒకవేళ పూర్తయినా జూన్‌ తర్వాత నదికి వరదలొస్తే పనులకు ఆటంకమే అంటున్నారు.పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం… బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులే లేకుండా చేస్తోంది. ఈ ఆర్థిక బడ్జెట్‌లో కూడా నయాపైసా వదిల్చలేదు. ఇప్పటిదాక ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.16,996కోట్లుగా ఉంది. దీనిలో కేంద్రంనుంచి దక్కింది రూ.11,868కోట్లు మాత్రమే. ఈ లెక్కన కేంద్రం ఇప్పటికే రూ.5,133 కోట్లు బకాయిపడింది. మరోవైపు ఒడిసా ప్రభుత్వం పోలవరానికి వ్యతిరేకంగా పావులు కదుపుతూనే ఉంది.

 

ఉన్నత న్యాయస్థానం గడప తొక్కుతునే ఉంది. తాజాగా మరోమారు ఈ ప్రాజెక్టుతో ఒడిసాకు ముంపు పొంచి ఉందంటూ అభ్యంతరం లేవనెత్తింది. తగు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిర్వాసితుల విషయంలోనూ ప్రభుత్వం నిఖార్సైన లెక్కలు చూపడం లేదంటూ కేంద్రం తప్పుబడుతోంది. 2013 భూసేకరణ సవరణ చట్టం ప్రకారం భారీగా పరిహారాన్ని చెల్లిస్తామని ప్రకటించినా ఇంకా ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నాయి. ఇలాంటి పెండింగ్‌ అంశాలెన్నో ప్రాజెక్టుపై ప్రభావం చూపుతున్నాయి.

"
"