మమతా నుండి ఉహించని స్పందన… కెంద్రం పై ఫైర్

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర బృందాలను ఆయా రాష్ట్రాలకు పంపాలని నిర్ణయించింది. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉల్లంఘనలు, వైద్య సిబ్బందిపై దాడులకు సంబంధించి పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఆరు కేంద్ర బృందాలను కేంద్ర హోం శాఖ ఆ రాష్ట్రాలకు పంపేందుకు రంగం సిద్ధం చేసింది. పరిస్థితిని సమీక్షించి కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించడమే ఈ బృందాల పని.

 

అయితే.. పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర బృందాలను పంపాలన్న హోం శాఖ నిర్ణయంపై సీఎం మమత బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతును, సలహాలను స్వాగతిస్తున్నామని.. అయితే కేంద్ర బృందాలను ఎందుకు పంపాలని కేంద్రం భావిస్తుందో సరైన కారణాలు తెలియజేయాలని ఆమె అడిగారు. సరైన కారణాలు లేకుండా తాను రాష్ట్రంలోకి కేంద్ర బృందాలను అనుమతించినట్లయితే సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లవుతుందని మమత ట్వీట్ చేశారు. ముంబై, పుణె, ఇండోర్, జైపూర్, కోల్‌కత్తా నగరాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. రానున్న రెండుమూడు రోజుల్లో కేంద్ర బృందాలను పంపనున్నట్లు కేంద్ర హోం శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

"
"