కేటీఆర్ దిశా నిర్థేశం… ఇలా చెయ్యాలి..!

రానున్న నాలుగు రోజుల్లో కనీసం ఐదుసార్లు ఒక్కో ఇంటికి వెళ్లాలని పార్టీ నేతలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను వివరించి ఓట్లు అడగాలని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే సరిపోతుందని తెలిపారు. ప్రతి వార్డు, పట్టణాల అవసరాల మేరకు స్థానిక మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్దేశించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌ నుంచి పార్టీ అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.మునిసిపల్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం చేయాల్సిన తీరుపై వారికి దిశానిర్దేశం చేశారు. వివిధ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడుతూ.. మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటోందని, ప్రస్తుతం అందించిన నివేదికల ప్రకారం టీఆర్‌ఎస్‌ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని, టీఆర్‌ఎస్‌ విజయం ఇప్పటికే ఖాయమైందని చెప్పారు. గెలుపు ఖాయమన్న ధీమాలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.

 

పార్టీ బీ-ఫారం కోసం ప్రయత్నించిన తోటి నాయకులను కూడా కలుపుకొని ప్రచారం చేయాలని నిర్దేశించారు. రూ.45 వేల కోట్లతో సర్కారు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, పట్టణాలకు మిషన్‌ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని కేటీఆర్‌ గుర్తు చేశారు. పట్టణాల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేటాయిస్తోందని, టీఎ్‌స యూఎ్‌ఫఐడీసీ ద్వారా రూ.2,500 కోట్లను ప్రత్యేకంగా కేటాయించిందని తెలిపారు. హరిత, స్వచ్ఛ పట్టణాల కోసం చెత్త తరలింపు ఆటోలు, ఇతర వాహనాలను సమకూర్చామని, ప్రతి పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేశామని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల ఖర్చుతో పోలిస్తే పది రెట్లు టీఆర్‌ఎస్‌ సర్కారు చేస్తోందని అన్నారు.కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పాలనను బేరీజు వేసుకుని ఓట్లు వేయాలంటూ ప్రజలను కోరాలని సూచించారు. దేశంలోనే ఆదర్శ మునిసిపాలిటీలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుని పని చేస్తోందన్నారు. నూతన మునిసిపాలిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగవంతంగా పౌర సేవలను అందిస్తామని తెలిపారు.‘‘ఎన్నికలు రాగానే కులం, మతం అంటూ రకరకాల ఫీలింగ్‌లు తీసుకువస్తున్నారు. పని చేసే నాయకులను నీరసించేలాగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. పనిచేసే వారిని గుర్తించండి’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలోని పద్మనాయక కల్యాణ మండపంలో బుధవారం ఆయన మునిసిపాలిటీ టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో లేదు. ఆ పార్టీ చేయగలిగింది కూడా ఏమీ లేదు. పొరపాటున దానికి ఓటు వేస్తే మురిగిపోతుంది.బీజేపీ మాటలు చెబుతుందంతే! ఆ పార్టీ వల్ల కూడా అయ్యేది ఏమీ లేదు. ఐదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా తెలంగాణకు చేసింది గుండు సున్నా’’ అని కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికలు అనగానే ఎన్నో కోణాల్లో ఆలోచించి టికెట్లు కేటాయిస్తామని, ప్రతి వార్డు నుంచి అనేకమంది పోటీ పడినా ఒకరికి మాత్రమే బీఫారం ఇవ్వగలిగామని అన్నారు. దయచేసి అన్నగా, తమ్ముడిగా మన్నించాలని, బీఫారం వచ్చినవారు ఎక్కువ కాదని, రానివారు తక్కువ కాదని, ఒక ప్రాతిపదికన సర్వేల ద్వారా టికెట్లు కేటాయించడంతో కొందరికి నష్టం జరిగి ఉండవచ్చని.. అన్యదా భావించవద్దని నేతలకు సూచించారు.ప్రభుత్వ పనితీరు, ప్రజలపై ఉన్న విశ్వాసం మీద నమ్మకంతో ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లనని, కేవలం సిరిసిల్ల, వేములవాడల్లోనే ప్రచారం చేస్తానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘‘ఎన్నికల ఫలితాలు నా పనితీరుపై తీర్పు అని అన్నాను. దాంతో, పనితీరు పట్ల విశ్వాసం ఉంటే ప్రచారం చేయవద్దని కాంగ్రెస్‌ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు కోదండరెడ్డి సూచించారు. ఆయన సూచనను శిరసా వహిస్తూ స్వాగతిస్తున్నాను. బయటకు ప్రచారానికి వెళ్లను’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎక్కువ సమయం తమ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లోనే ఉంటున్నారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌కు వస్తున్న కేటీఆర్‌ సాయంత్రం వరకు ఉంటున్నారు.

 

భోజనం కూడా ఇక్కడే చేస్తున్నారు. ఎన్నికలు ముగిసే వరకు కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు వస్తారని, అందరినీ సమన్వయం చేస్తారని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత ఒకరు తెలిపారు.గురువారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభా్‌షరెడ్డి, శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు షకీల్‌, హర్షవర్ధన్‌రెడ్డి, కేపీ వివేకానందతో సమావేశమయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేశారు. ఉమ్మడి జిల్లాలవారీ అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులతో నేరుగా మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రెబెల్స్‌తోనూ కేటీఆర్‌ స్వయంగా మాట్లాడి హామీలిస్తున్నారు. కాగా.. టీఆర్‌ఎస్‌ ప్రచారం ఇప్పటికే జోరు మీద ఉందని నేతలు చెబుతున్నారు. ఆడియో, వీడియో, ఇతర రూపాల్లో దానిని ఉధృతం చేయడంపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నారు.

"
"