వాళ్ళందరికి హుకుం జారి చేసిన కేసీఆర్

తెలంగాణాలో రాబోతున్న మున్సీపల్ ఏన్నికలు రాబోతున్నాయి. వాటిపై కేసీఆర్ టీఆరెస్ అందరికి అదేశాలిచ్చాడు.  మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన వారిపై వేటు తప్పదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. వార్డు, డివిజన్లలో ఒకసారి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత, ఇక అందరూ వారి గెలుపు కోసం శ్రమించాల్సిందేనని స్పష్టం చేశారు. మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన సమావేశానికి సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా పలువురు మంత్రులు పాల్గొన్న ఈ భేటీ దాదాపు రెండు గంటలపాటు సాగింది.ఈ సందర్భంగా ఏ, బీ ఫారాల జారీ విధివిధానాలను సీఎం కేసీఆర్‌ వివరించారు. పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘‘మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సదే విజయం. అయితే, రెబెల్స్‌ బెడద లేకుండా చూసుకోవాలి. టికెట్‌ దక్కని వారు నిరాశ పడకుండా చూడాలి. కో-ఆప్షన్‌ సభ్యత్వాలు, నామినేటెడ్‌ పదవులు ఇస్తామని వారిని బుజ్జగించాలి. ఒకవేళ ఎవరైనా నామినేషన్‌ వేసినా.. ఉపసంహరించుకునేలా చూడాలి. ఎంత చెప్పినా వినకుండా బరిలో కొనసాగే వారిపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటుంది’’ అని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు.ఎంతటి వారైనా సరే.. పార్టీకి నష్టం చేస్తే ఊరుకునేది లేదని, అటువంటి వారి స్థాయిని కూడా లెక్క చేయబోమని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ‘‘పార్టీలోనే ఉంటారు. వాడిని వీడు ఓడగొడతాడు.. వీడిని వాడు ఓడగొడతాడు. ఇటువంటి సంస్కృతి వద్దు’’ అని హితవు పలికారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు అంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

 

తన సొంత అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌ మునిసిపాలిటీ ఎన్నికల బాధ్యతను ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డికి అప్పగించారు.‘‘మీ నియోజక వర్గంలో జరిగే మునిసిపల్‌ ఎన్నికల్లో ఇతరులు ఎవరూ జోక్యం చేసుకోరు. మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో లోపాలు లేకుండా చూసుకోండి. అన్ని స్థానాల్లో విధిగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే స్పృహలో ఉండండి. వార్డులు/డివిజన్లలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న, గెలిచే వారికే టికెట్లు ఇవ్వండి. ఎవరి ఒత్తిళ్లకూ లొంగవద్దు. ఓడిపోతారని అనుకుంటే.. పార్టీలో ఎంతటి సీనియర్‌ అయినా పక్కనపెట్టండి’’ అని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. టీఆర్‌ఎ్‌సకి ఇతర పార్టీల నుంచి పోటీయే లేదని చెప్పారు.సర్వేల్లో టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని తేలిందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, పార్టీపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందని తెలిపారు. అయితే, ‘‘మునిసిపల్‌ ఎన్నికల్లో రాజకీయంగా కాకుండా స్థానిక పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులో వ్యక్తిగత, సామాజిక అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. వందా.. రెండు వందల ఓట్ల తేడాతోనే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే, జాగ్రత్తగా డీల్‌ చేయండి. గట్టిగా పని చేయండి’’ అని హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీలకు అంత సినిమా లేదని, మునిసిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకి పోటీ ఇచ్చే స్థితిలో కూడా ఆ రెండూ లేవని చెప్పారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఎన్నికల్లో పార్టీని బతికిస్తాయని చెప్పారు. ప్రచారంలో ప్రతి వార్డు, డివిజన్‌లోని లబ్ధిదారులందరి దగ్గరకు వెళ్లాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు ఎవరూ నియోజకవర్గాలను దాటి వెళ్లొద్దని, స్థానిక ప్రజా ప్రతినిధుల సేవలను ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని నిర్దేశించారు. పట్టణాల్లో సోషల్‌ మీడియా వాడకం ఎక్కువగా ఉంటుందని, అందులో ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఇందుకోసం పార్టీలోని ఔత్సాహికులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.నామినేషన్ల దాఖలులో విఫలం కావద్దుమునిసిపల్‌ ఎన్నికల సాంకేతిక ప్రక్రియను సీఎం కేసీఆర్‌ సుదీర్ఘంగా వివరించారు. వారికి స్వయంగా ఏ, బీ ఫారాలను అందజేశారు. శుక్రవారమే పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వాలని చెప్పారు.‘ఎక్స్‌అఫీషియో’ను అధిష్ఠానమే ఖరారు చేస్తుందిమునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చైర్‌పర్సన్‌, మేయర్‌ ఎన్నిక సమయంలో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌ అషీషియో ఓటును ఎవరు ఎక్కడ వినియోగించుకోవాలన్నది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అప్పుడు వారిని తెలంగాణ భవన్‌కు పిలిపిస్తామన్నారు. ఈలోగా ఎక్స్‌ అఫీషియో ఓట్లపై సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు.

 

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం మధ్యలోనే సంక్రాంతి పండుగ వస్తోందని, దానిని కూడా సమర్థంగా వాడుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. ‘‘పండుగ ఉందని ఎవరూ ప్రచారాన్ని నిలిపివేయవద్దు. భోగి, సంక్రాంతి, కనుమ.. మూడు రోజులూ ప్రజలు స్థానికంగా ఇంట్లోనే ఉండి, సంబురాలు చేసుకుంటారు. ఆ సమయంలో వారి వద్దకు వెళ్లి మాట ముచ్చట కలిపి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు కోరండి’’ అని సూచించారు. స్థానికంగా లేని మునిసిపల్‌ ఓటర్లను గుర్తించాలని, వారిని పోలింగ్‌ నాటికి పిలిపించి, ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు.
సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతుండగానే.. మధ్యలో మంత్రి మల్లారెడ్డి జోక్యం చేసుకొని.. చైర్‌పర్సన్‌, మేయర్ల ఎన్నిక ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో, ఆయనపై కేసీఆర్‌ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘‘మంత్రులన్నప్పుడు వారి దగ్గర పూర్తి సమాచారం ఉండాలి. అవగాహన ఏర్పర్చుకోవాలి. ఎమ్మెల్యేలకు చెప్పగలిగేలా ఉండాలి’’ అని చిన్నపాటి క్లాస్‌ తీసుకున్నట్లు తెలిసింది.సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి ఎర్రబెల్లి, ఈటల, నిరంజన్‌ రెడ్డి తదితరులు, మరికొందరు ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఉదయం 10.45 గంటలకే తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కొందరు ఆ తర్వాత నిదానంగా వచ్చారు. దాంతో, ‘‘ముఖ్యమైన సమావేశమని చెప్పాం. ముందురోజు రాత్రి (బుధవారం) హైదరాబాద్‌ చేరుకోవాలని చెప్పాం. అయినా, ఆలస్యంగా వస్తే ఎలా?’’ అంటూ సీఎం కేసీఆర్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

"
"