కాళోజీ రావ్ ప్రజల గుండే చప్పుడు

రాజకీయ, సాంఘిక చైతన్యం ఉన్న వ్యక్తులే ప్రజల కోసం పాటుపడతారు. నిరంకుశత్వాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే తెగువ కలిగి ఉంటారు. వారికి ప్రాణ భయంగానీ, జైలు భయంగానీ ఉండదు. ఆ కోవకు చెందినవారే కవి కాళోజీ. తెలంగాణ విముక్తి పోరాటం, ప్రత్యేక తెలంగాణ పోరాటం, ప్రజా హక్కుల పోరాటం లాంటి ప్రతీ పోరాటానికి ప్రతిధ్వనిగా నిలిచిన యోధుడు. ప్రజాస్వామ్యం బతకాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఎదురు తిరిగి ప్రశ్నించే వాడుండాలి. ఆ కొరత కాళోజీ తీర్చాడు. అయన అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావ్ రాజారాం కాళోజీ. నాన్ ముల్కీ ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర పోరాటం చివరి వరకు ఆయన అచంచల విశ్వాసంతో పాల్గొన్నారు. కాళోజీ కవి లేకుండా తెలంగాణను ఊహించుకోలేం. కాళోజీ 1953లో నాన్ ముల్కీ ఉద్యమంలో దూకి కీలకమైన పాత్రను పోషించారు. 1969 జనవరి 22న ‘తెలంగాణా విమోచనోద్యమ సమితి’ని స్థాపించి, దాని ఆధ్వర్యంలో ఒక విద్యా సదస్సును నిర్వహించారు.ఆరు నెలలు దాటక ముందే అంటే, జూన్ 6న ‘తెలంగాణా రచయితల సంఘాన్ని’ ఏర్పాటుచేసి తెలంగాణ సాధన కోసం భారీ సదస్సును నిర్వహించి పోరాట జెండాను ఎగురవేశారు. పదిరోజుల తర్వాత, 1969 జూన్ 16న ‘తెలంగాణా బంద్’ జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను బలంగా వ్యక్తం చేసేందుకు అదే ఏడాది జూలై 12న తెలంగాణ లిబరేషన్ డే పాటించిన కారణంగా కాళోజీని, కొల్లూరు చిరంజీవిని ఆనాటి ప్రభుత్వం ఆగస్ట్ 10న అరెస్ట్ చేసింది. యాధృచ్ఛికంగా అదే రోజు 151 సెక్షను కింద నర్సంపేట పోలీసులు ననుమాసస్వామితో పాటు 22 మందిని అరెస్ట్ చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు.జీవన్మరణ సమస్యగా మారిన తెలంగాణా పోరాటంలో కవి కాళోజీ పాత్ర విస్మరించ లేనిది. ఆ ప్రజాకవి కాళోజీ గళంలాగానే ఆనాటి పాత్రికేయుల కలాలు కూడా కదిలాయి. 1969 ఫిబ్రవరిలో ఇంగ్లీషు పత్రిక దక్కన్ క్రానికల్‌లో పని చేసే ప్రతాప్ కిశోర్, ఆయన మిత్రులు మదన్ మోహన్, గోపాల్ కిషన్, మునీర్ జమాల్‌ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ పోరాట సమితిని ఏర్పరచారు. అనతికాలంలోనే అది తెలంగాణ ప్రజాసమితిగా రూపాంతరం చెందింది. అలాగే 1969 ఏప్రిల్‌లో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక తెలంగాణావాదాన్ని నిర్మొహమాటంగా సమర్థించింది. తెలంగాణ ప్రజలకు అప్పట్లో అండగా నిలిచింది ఆంధ్రజ్యోతి పత్రికే. 1969 జూన్‌లో తెలంగాణకు ఏ ఏ రంగాల్లో అన్యాయం జరిగిందో అంకెలతో సహా ఆ పత్రిక సంపాదకీయంలో అచ్చువేశారు. నార్ల సంపాదకీయాలు ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి కంటగింపయ్యాయి. నిధులు, నీళ్లు, నియామకాల నినాదానికి అంకురం వేసింది ఆ పత్రికే అనేది విస్మరించకూడని విషయం.తెలంగాణా కోసం గళమెత్తి గర్జించిన కాళోజీ కవిత్వం కాలాతీతం. స్వపర భేదాలు పాటించకుండా ధిక్కరించడం ఆయన నైజం. ‘మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోర్కొక్కటి తెలంగాణ, వెలసి నిలిచి ఫలించాలి భారతాన’ అంటూనే ‘తెలంగాణ వేరైతే తెలుగు భాష మారుస్తారా? పండిన వరికంకుల గింజ రాలనంటుందా?’ అంటూ వాస్తవికతను ప్రబోధించారు. ‘అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడు’ అనడం ఆయనలోని తత్వాన్ని ఆవిష్కరించింది. చట్టసభలో ఉన్నా, సమాజంలో ఉన్నా ఆయన స్వాభావికంగా ఎప్పుడూ ప్రజల మనిషే. ప్రజల కోసం నిరంతరం సంధించిన ధిక్కార స్వరమే.వందేమాతరం ఉద్యమం మొదలు గాంధీ సత్యాగ్రహోద్యమం, రజాకర్ల ప్రతిఘటనోద్యమాల్లో పాల్గొని 1939లో, 1943లో జైలుకెళ్లారు. అదేవిధంగా 1969, 2001 నాటి తెలంగాణ ఉద్యమాల్లోనూ చురుకుగా పాల్గొని స్ఫూర్తినిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణా పోరాటంలో కవి కాళోజీ పాత్ర చిరస్మరణీయం. ఆయన తన నడవడితో ఆదర్శంగా చాటిన ప్రశ్నించే తత్త్వాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని సాగాలి.

"
"