కేసీఆర్ ప్లానింగ్.. అంతా భవిష్యత్త్ కోసమేనా..

తెలంగాణా ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీవైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల అంతర్గత సంభాషణల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయమని, అయితే అరంగేట్ర ముహూర్తం ఎప్పుడనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వారు పేర్కొంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా పావులు కదుపుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైందనే అభిప్రాయం ఆ పార్టీలో అంతర్గతంగా వ్యక్తమవుతోంది. జమిలి ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత చూసుకుందామని ఊరుకుంటే, పూర్తి స్థాయి సన్నద్ధత ఉండదని గులాబీ బాస్‌ కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2022 లేదా 2023లో జమిలి ఎన్నికలకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదనే వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. బీజేపీ తర్వాతి లక్ష్యం, దేశంలో అధ్యక్ష తరహా పాలన అనే సంకేతాలు అందటంతోనే సీఎం కేసీఆర్‌ ‘నయా భారత్‌’ పేరిట జాతీయ పార్టీ ఏర్పాటుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.ఈ విషయమై సోమవారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ‘నయా భారత్‌.. జాతీయ స్థాయిలో కేసీఆర్‌ పార్టీ’ శీర్షికన వచ్చిన కథనం అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. మరోవైపు టీఆర్‌ఎ్‌సలో అంతర్గతంగానూ చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటం, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్టటం ఒక దానితో మరొకటి ముడిపడి ఉండటం కూడా అందుకు ఒక కారణమైంది. ఈ మేరకు కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే విషయంలో టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఎటువంటి అనుమానాలు లేవు. కానీ ఆయన ‘జాతీయ’ అరంగేట్రం ముహూర్తంపైనే గులాబీ దళంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్త సచివాలయం నిర్మాణం వంటివి పూర్తి స్థాయిలో కొలిక్కి రావటానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని, ఆ తర్వాత పాలన మంత్రి కేటీఆర్‌కు అప్పగించి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని విశ్లేషిస్తున్నారు.ప్రస్తుతం అన్నీ అనుకూల పరిస్థితులే

సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన కొందరు మాత్రం ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటానికి అంత సమయం పట్టకపోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలన్నీ కేసీఆర్‌ ‘జాతీయ’ అరంగేట్రానికి అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. ‘‘జీఎస్టీ సహా వివిధ అంశాలపై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గుర్రుగా ఉన్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం అని భావిస్తున్న కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పటిప్పుడే కొలిక్కి వచ్చే వాతావరణం కనిపించటంలేదు. ఇంతకు మించిన తరుణం ఏముంటుంది?’’ అని పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు.ముందే వెళ్తే మంచిది!

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నందున ఒకింత ముందుగానే రంగంలోకి దిగాలనే యోచనతో టీఆర్‌ఎస్‌ చీఫ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే జాతీయ పార్టీ ఏర్పాటుకు ఆయన పావులు కదుపుతున్నారని సమాచారం. తన ప్రయత్నానికి బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు కలిసి రానప్పటికీ, 16 లోక్‌సభ స్థానాలతోనూ కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషించవచ్చనే ఉద్దేశంతో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఇప్పటిలానే ఉంటుందని చెప్పలేమనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని సమాచారం. జాతీయ రాజకీయ రంగప్రవేశంపై సీఎం కేసీఆర్‌ ఏ క్షణమైనా తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

"
"