సీయం కి ఒకలా, సామాన్యుడికి ఒకలా..?

ఏపీ అధికారుల తీరును ప్రజలు తప్పుబడుతున్నారు. నాయకుల నివాస ప్రాంతాలకు ఓ నియమం సాధారణ ప్రజలు ఉండే ప్రాంతానికి మరో రూలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాలపై అధికారులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. రెడ్‌జోన్లపై జిల్లా అధికారుల భిన్నవైఖరి ప్రదర్శిస్తున్నారు. గుంటూరు నగరంలో ఒక్క కరోనా కేసు వచ్చినా అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. రెడ్‌జోన్ ప్రకటించడం వల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడం.. అక్కడి వారు బయటకు రాకుండా కట్టదిట్టమైన చర్యలు చేపడుతారు.

 

ప్రభుత్వ ఉద్దేశం కూడా కరోనా నుంచి ఇతరులను రక్షించమే ప్రధాన కారణం. గుంటూరు పట్టణంలోని కొరిటెపాడు, చైతన్యపురిలో ఒక్క కేసు ఉన్నా రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అయితే తాడేపల్లిలో సీఎం జగన్ నివాస ప్రాంతం రెడ్‌జోన్‌ కాదని కలెక్టర్‌ శామ్యూల్ ఆనంద్ చెబుతున్నారు. 4 పాజిటివ్‌ కేసులు వస్తేనే రెడ్‌జోన్‌ పరిధిలోకి వస్తుందని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే కలెక్టర్ వివరణకు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ‘సీఎం నివాసానికి ఒక రూల్‌, సామాన్యులకు మరో రూలా’ అంటూ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.తాడేపల్లి పాత టోల్ గేట్ సమీపంలోని మారుతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే వృద్ధురాలు ఇవాళ చనిపోయారు. అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతి చెందిన అనంతరం టెస్టులు నిర్వహించగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే ఆమె నివాసం ఉండే అపార్ట్‌మెంట్ ఉంటుంది.

 

దీంతో రెడ్ జోన్‌ పరిధిలోకి సీఎం జగన్ నివాసమంటూ పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ వార్తలను గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఖండించారు. సీఎం నివాసం రెడ్‌జోన్‌లో లేదని తేల్చి చెప్పారు. నాలుగు పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతం రెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని, తాడేపల్లిలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదయిందని శామ్యూల్ ఆనంద్ తెలిపారు.

"
"