ఐదేళ్లలో దూరం అవ్వని జగన్ అయిదు నెలల్లో దూరమవుతాడా…?

కేంద్రానికి జగన్ దూరం జరిగే విషయంలో… తెలుగుదేశం క్యాడర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రధానిగా తాను ఎన్నికైతే దేశంలో ఉన్న అవినీతి పరుల భరతం పడతాను అని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ… ప్రధాని అయిన తర్వాత ఆ విషయంలో పెద్దగా దూకుడు చూపించలేదు. దీనితో చాలా మంది దేశం దాటేసారు, మరికొందరు దేశంలోనే ఉన్నారు… మరికొందరు బెయిల్ మీద ఉన్నారు… వారిలో సీఎం జగన్ ఒకరు. జగన్ అవినీతి కేసుల్లో మోడీ దూకుడు అనేది ఎక్కడా కనపడలేదు. పైగా విజయసాయి రెడ్డి రాయబారంతో జగన్ సీఎం కూడా అయ్యారు.

గత ఐదేళ్లలో ఆయన కోర్ట్ కి వెళ్లడం మినహా పెద్దగా జగన్ కు వచ్చిన నష్టం అనేది ఏం లేదు. పాదయాత్ర కూడా సాఫీ గా జరిగింది. ఇక ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఆయన విధానాలు కొన్ని తలనొప్పిగా మారాయనే విషయం కాస్త అర్ధమవుతుంది. ఇంత దానికే జగన్ కేంద్రానికి దూరం అయిపోయాడు అనే ప్రచారం మొదలుపెట్టారు. వీరికి తగ్గట్టు… ఇటీవల కేంద్ర ప్రభుత్వం టీడీపీ ఎంపీలకు నామినేటెడ్ పదవులు చిన్న చిన్నవి ఇచ్చింది. అవి పెద్దగా ప్రాధాన్యత ఉన్నవి కూడా కావు. కనీసం మీడియానే వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనికి టీడీపీ క్యాడర్ హుషారు అంతా ఇంతా కాదు. కేంద్రానికి జగన్ దూరమయ్యారని… అధికారంలో లేనప్పుడే ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు. అధికారంలో ఉన్నప్పుడు జరుగుతుందా…? విజయసాయి రెడ్డి లాంటి నమ్మకస్థుడు ఢిల్లీలో గత అయిదేళ్లుగా లేకపోవడంతో టీడీపీ నష్టపోయింది. దాని గురించి చంద్రబాబు నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు ఎవరూ ఆలోచించలేదు.

రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో మోడీ గాని బీజేపీ గాని లాభపడేది ఏమి లేదు. హిందుత్వ భావజాలానికి ఏ మాత్రం ఆకర్షించని రాష్ట్రం ఇది. ఇప్పుడు మోడీకి జగన్ దూరం జరిగారని టీడీపీ ప్రచారం చేసుకున్నా… అది జగన్ కి గాని ఆయన పార్టీకి గాని ఏ నష్టం లేదు. ఆర్ధికంగా బలవంతుడు అయిన జగన్… ఏ రకంగా అయినా కేంద్రాన్ని తనకు దగ్గర చేసుకోవచ్చు, చంద్రబాబు అన్ని ప్రయోజనాలు కూడా కేంద్రానికి ఇవ్వలేకపోవచ్చు ఏమో… కాబట్టి జగన్ దూరం జరగడం అనేది టీడీపీ ఆశ మినహా మరొకటి లేదు.

"
"