అమరావతిలో హైఅలర్ట్…తీవ్ర ఉత్కంఠ

‘మనకు మూడు రాజధానులు ఉండొచ్చు. విశాఖ పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా మారొచ్చు’ అని గత నెల 17వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటను ‘శాసనం’గా మార్చేందుకు రంగం సిద్ధమైంది. సర్కారు పెద్దలు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే… సోమవారం శాసనసభలో అమరావతికి ‘డెత్‌ వారెంట్‌’ జారీ కావడం తథ్యం! పరిపాలనను విశాఖకు తరలించేందుకు ఎప్పుడో మొదలైన ప్రయత్నాలు… ఇక సాధికారికంగా, లాంఛనంగా ముందుకు సాగుతాయి. హైకోర్టు కర్నూలుకు తరలిపోతుంది. విశాఖ, అమరావతిలో హైకోర్టు ధర్మాసనాలు ఏర్పాటవుతాయి. అమరావతిలో శీతాకాల, వర్షాకాల సమావేశాలు మాత్రం జరుగుతాయి. బడ్జెట్‌ భేటీకి విశాఖే వేదిక అవుతుంది.

 

వెరసి… ‘అమరావతి’ నామమాత్రంగా మిగులుతుంది. కాగా, సోమవారం ఉదయం 9 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్‌ కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించే అవకాశముంది. సీఆర్‌డీఏ చట్టం రద్దుతోపాటు ఇప్పటిదాకా సీఆర్‌డీఏ నిర్వహించిన కొన్ని బాధ్యతలను విజయవాడ – గుంటూరు – మంగళగిరి – తెనాలి (వీజీఎంటీ) పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించడం వంటి బిల్లులను ఆమోదించే అవకాశముంది. అలాగే, ‘మూడు రాజధానుల’ నిర్ణయంపైనా కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం… ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశమవుతుంది. ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది. అనుకున్నది సాధించేందుకు అధికార పక్షం… ఎలాగైనా అడ్డుకునేందుకు విపక్షం ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి.దీంతో సోమవారం సభలో జరిగే పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏదిఏమైనా మూడు రాజధానులకు సభలో ఆమోదం పొంది తీరాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పాలన వికేంద్రీకరణపై తమ వాదనను సమర్థిస్తూ, విపక్షాన్ని దునుమాడుతూ సభలో ఒక వీడియో ప్రజంటేషన్‌ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక… మంగళవారం ఉదయం 11 గంటలకు శాసన మండలి సమావేశం కానుంది. పెద్దల సభలో తమదే పైచేయి కావడంతో సర్కారు ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలని విపక్షం భావిస్తోంది. అదే జరిగితే ఏం చేయాలన్న అంశంపై అధికార పక్షం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలి ఆమోదించని పక్షంలో… బుధవారం మరోమారు ఈ బిల్లులను శాసనసభలో ఆమోదించి, తిరిగి మండలికి పంపించాలని భావిస్తున్నారు. అప్పుడు… ఆ బిల్లులను మండలి తోసిపుచ్చినా ఒరిగేదేమీ ఉండదు. అంతటితో ఆగకుండా… తన నిర్ణయాలకు అడ్డుపడుతున్న శాసనమండలిని రద్దు చేయాలన్న తీవ్ర నిర్ణయాన్నీ ముఖ్యమంత్రి తీసుకోవచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

‘దయచూపు దుర్గమ్మా… పాలకుల మనసు మార్చు మాయమ్మా!’ అంటూ రాజధాని ప్రాంత మహిళలు బెజవాడ కనకదుర్గకు మొక్కులు చెల్లించుకున్నారు. తమ గ్రామాల నుంచి చెప్పుల్లేకుండా కాలి నడకన ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. ‘అమరావతిని కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పిస్తాం’ అని నినదిస్తూ కొందరు యువకులు రాజధాని పరిధిలో నిర్మితమైన ఉద్యోగుల క్వార్టర్లపైకి ఎక్కారు. భూములిచ్చి భంగపడ్డాం అంటూ వారి కుటుంబ సభ్యులు ఇలా కన్నీరు మున్నీరయ్యారు.అభివృద్ధి వికేంద్రీకరణ కావాలా… పాలన వికేంద్రీకరణ జరగాలా? అంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. 3409 మంది అమరావతికి జై కొట్టగా… మూడు రాజధానులకు 37 ఓట్లు మాత్రమే పడ్డాయి.

"
"