హర్‌సిమ్రత్‌ కౌర్ సంచలనం.. అందుకే రాజీనామా చేసా..

కేంద్ర మంత్రివర్గంలో రైతులకు మద్దతుగా తన గొంతు వినిపించేందుకు ఎంతగా ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆవేదనతో రాజీనామా చేసినట్లు శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ చెప్పారు. మూడు రైతు వ్యతిరేక బిల్లులకు ఆమోదం పొందే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఆపాలని, బిల్లులను విస్తృత సంప్రదింపుల కోసం సెలెక్ట్ట్‌ కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు.హర్‌సిమ్రత్‌ శుక్రవారం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడారు. పార్లమెంటు చర్చలో మూడు బిల్లులపై నిరసన తెలిపేందుకు ఐసీయూలో ఉన్న తల్లిని వదిలి వచ్చానని వెల్లడించారు. నిరసనలో భాగంగానే మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. ‘మూడు బిల్లులూ పంజాబ్‌ వ్యవసాయ రంగాన్ని సర్వ నాశనం చేస్తాయి. రైతులను విశ్వాసంలోకి తీసుకోకుండా వీటిపై ముందుకు వెళ్లొద్దని ముందునుంచీ చెబుతున్నా’ అని ఆమె అన్నారు.కాగా, హర్‌సిమ్రత్‌ 2014 నుంచి ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. మరోవైపు నిత్యావసరాల బిల్లు, వ్యవసాయ ఉత్పత్తుల బిల్లు, గిట్టుబాటు ధర కోసం ప్రైవేటుతో ఒప్పందాల బిల్లులకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. కాంగ్రెస్‌, మరికొన్ని విపక్షాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. ఎన్‌డీఏ నుంచి అకాలీదళ్‌ ఒక్కటే వారికి తోడైంది.‘ఆర్డినెన్స్‌ల జారీకి ముందు మంత్రివర్గం అభిప్రాయం కోసం పంపినప్పటి నుంచీ ఈ బిల్లులను నేను వ్యతిరేకిస్తున్నా. ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా పని చేశా. రైతుల్లో అనుమానాలు, భయాలు తొలగిపోయే వరకు బిల్లులపై ముందుకు వెళ్లొద్దని చెబుతూనే ఉన్నా. నా మాట విని ఉంటే ఇప్పుడు రైతులు రోడ్ల మీదకు వచ్చేవారు కాదు. బిల్లులను పాస్‌ చేయించుకోవడానికి పరుగులు తీయొద్దు. సెలెక్ట్‌ కమిటీకి పంపినపుడే అన్ని వర్గాలతో చర్చలకు అవకాశం ఉంటుంది’ అని హర్‌సిమ్రత్‌ ఇంటర్వ్యూలో చెప్పారు.తన రాజీనామాను పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ డ్రామాగా అభివర్ణించడంపై మండిపడ్డారు. ‘ఆయనే అతిపెద్ద డ్రామా ఆర్టిస్టు. అబద్ధాల కోరు. బిల్లులపై ముఖ్యమంత్రులను సంప్రదించినప్పుడు అమరీందర్‌ మద్దతు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలోనే పెట్టింది. రైతుల మద్దతుపై మనుగడ సాగించే, పంజాబ్‌ రైతుల ఒత్తిడి కారణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నాం’ అని వెల్లడించారు.జనసంఘ్‌ కాలం నుంచి బీజేపీ, అకాలీదళ్‌ మిత్రపక్షాలు. 1997 నుంచి కలిసి పోటీ చేస్తున్నాయి. ఎన్‌డీఏ నుంచి బయటకు వెళ్లే విషయం పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని హర్‌సిమ్రత్‌ చెప్పారు. 2022లో పంజాబ్‌ ఎన్నికలు ఉన్నాయి.

"
"