విజయన్ ప్రభుత్వంపై , కేంద్రం సీరియస్

పినరయ్ విజయన్ నేతృత్వంలోని కేరళ సర్కారుపై కేంద్ర హోంశాఖ సోమవారం సీరియస్ అయ్యింది. ముందే నిర్ణయించుకున్న ప్రాంతాల్లో క్షౌర శాలలు, పుస్తకాల షాపులు, రవాణా, రెస్టారెంట్లను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించడంపై కేంద్ర హోంశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య లాక్‌డౌన్ నియమాన్ని నీరుగార్చడమేనని తీవ్రంగా మండిపడింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈ విషయంపై కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘాటు లేఖ రాశారు.

 

ప్రకృతి వైపరిత్యాల కింద హోంశాఖ ఇచ్చే మార్గదర్శాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించడం సరైన చర్య కాదని కేంద్ర హోంశాఖ లేఖలో ప్రస్తావించింది. ‘‘ప్రకృతి వైపరిత్యాల చట్టంలోని 4(1), (2) క్లాజ్ ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించవద్దు. కచ్చితంగా అమలు చేయాల్సిందే’’ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తన లేఖలో ప్రస్తావించారు.అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానం సూచించిన వాటిని కూడా ఆయన లేఖలో జత చేశారు.

 

అయితే దీనిపై కేరళ ప్రభుత్వం ఓ స్పష్టతనిచ్చింది. రవాణా వ్యవస్థను రాష్ట్రంలో ఎక్కడా అనుమతించడం లేదని ప్రకటించింది. రెస్టారెంట్లు, క్షౌర శాలలు, ఇతర వాటిని ఇచ్చిన అనుమతులను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందేనని కేంద్ర హోంశాఖ కేరళ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.

"
"