ఆయనే అభివృద్ది చేసాడు… చివరికి ఆక్కడే..?

శ్మశాన వాటికల అభివృద్ధికి రూపశిల్పి నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు. శ్మశాన వాటిక అంటేనే అదేదో అక్కడకు వెళ్ళగూడని ప్రదేశమని ప్రజలు భావిస్తారు. ఇలాంటి శ్మశాన వాటికలను ఉద్యానవనాల్లా మార్చిన ఘనత కోడెలకు దక్కింది. చివరి మజిలిలో జరిగే అంత్యక్రియలు కూడా మంచి వాతావరణంలో జరగాలని ఆయన భావించేవారు. అందుకే అధ్వాన స్థితిలో కనీసం అంత్యక్రియలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్న రోజులవి. పట్టణంలో శ్మశానవాటికలు ఘోరస్థితిలో ఉండేవి. వర్షం కురిస్తే అంత్యక్రియలు నిర్వహించలేని విధంగా పట్టణ వాసులు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. నాడు శాసన సభాపతిగా బాధ్యతలను చేపట్టిన వెనువెంటనే డాక్టర్‌ కోడెల శ్మశానవాటికలపై దృష్టి సారించారు. అనుకున్నదే తడువుగా పట్టణంలోని శ్మశాన వాటికల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇందుకు దాతల సహకారాన్ని తీసుకున్నారు. దాతలు కూడా వీటి అభివృద్ధికి విరాళాలు అందజేశారు.

మునిసిపాలిటీ నిధులకు దాతలు విరాళాలను కలిపి పట్టణంలోని ఐదు శ్మశాన వాటికల అభివృద్ధికి కోడెల శ్రీకారం చుట్టారు. గుంటూరు రోడ్డులోని స్వర్గపురి- 1, పల్నాడు రోడ్డులోని స్వర్గపురి – 2, ముస్లింల శ్మశాన వాటిక కబ్రస్తాన్‌, క్రైస్తవుల శ్మశానవాటిక పరదేశిలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. వాటి అభివృద్ధి కోసం దాదాపు రూ.6 కోట్ల వరకు నిధులు వెచ్చించారు. దీంతో సర్వాంగసుందరంగా ఆయా శ్మశాన వాటికలు రూపుదిద్దుకున్నాయి. ఇక్కడ జరిగిన శ్మశానవాటికల అభివృద్ధి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. కోడెల ఇక్కడ చేసిన శ్మశాన వాటికల అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శ్మశానవాటికల అభివృద్ధిని పెద్ద ఎత్తున చేపట్టింది.కాగా,కోడెల స్ఫూర్తితో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లోని అన్ని శ్మశానవాటికలను అభివృద్ధి చేశారు. రెండు నియోజకవర్గాల్లో సుమారు మూడువందల శ్మశాన వాటికలను అభివృద్ధి చేయించ గలిగారు. ఎంత సంపాదించినా చివరి మజిలీ శ్మశాన వాటికతోనే ముగుస్తుందని కోడెల భావించే వారు. స్వర్గానికి రహదారిగా ఉన్న శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి చూపించి పేదల మన్ననలను అందుకున్నారు.గుంటూరు రోడ్డులోని స్వర్గపురి-1 శ్మశాన వాటిక అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఈ శ్మశాన వాటికను నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రారంభించారు.

శ్మశాన వాటికల అభివృద్ధి సృష్టికర్త కోడెల అని చెప్పవచ్చు. గుంటూరు రోడ్డులోని శ్మశాన వాటికను ఉద్యానవనంలా తీర్చిదిద్దారు. చివరకు కోడెలకు ఈ శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిగాయి. ఈ శ్మశాన వాటికను అభివృద్ధి చేసిన తీరును ఆయన అంత్యక్రియల సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని కోడెలకు ఘన నివాళులర్పించారు. కోడెల జోహార్‌ అంటూ నినదించారు. అభివృద్ధి ప్రదాత, అపరభగీరథుడు కోడెల అంటూ ఆయన అభిమానులు కీర్తించారు.

"
"