కోనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు…అసలు జరుగుతున్న విషయం ఇదే..?

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడు రోజులపాటు జరుగనున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో (20, 21, 22 తేదీల్లో) వీటిని నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి, శాసనసభాపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆర్థిక. సభావ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రతిపక్షం టీడీపీ నుంచి టీడీఎల్పీ ఉప నేత కె.అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సమావేశాల్లో పెడుతున్న బిల్లుల గురించి బుగ్గన ఈ సందర్భంగా వివరించారు. సీఆర్‌డీఏను రద్దు చేస్తున్నామని.. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశ పెడుతున్నామని, అమరావతి మెట్రోపాలిటన్‌ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మూడు రోజులపాటు సమావేశాలు జరపాలనుకుంటున్నామని, ఈ బిల్లులతోపాటు మరి కొంత ఇతర ఎజెండాను కూడా చర్చిస్తామని చెప్పారు.

 

బిల్లులను ప్రవేశపెడుతున్న తీరుపై అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘బిల్లులను అప్పటికప్పుడు పెట్టబోమని, పెట్టిన తర్వాత వాటిని అధ్యయనం చేయడానికి సమయం ఇస్తామని.. ప్రతి బిల్లుపై నాలుగైదు రోజులు చర్చిస్తామని బీఏసీ మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడీ బిల్లును ఇంత రహస్యంగా, హడావుడిగా ఎందుకు పెట్టారు? రాజధాని మార్పు వంటి పెద్ద విషయంలో దాపరికం ఎందుకు? ఈ బిల్లు పెట్టి సభను రెండు రోజులు వాయిదా వేయండి. అందరూ చదువుకుని వస్తారు’ అని సూచించారు. పరిపాలనా వికేంద్రీకరణను వద్దనుకుంటున్నారా.. రాష్ట్రమంతా అభివృద్ధి జరగొద్దనుకుంటున్నారా అని పాలక పక్షం ఆయన్ను ప్రశ్నించింది. అమరావతిని తరలించొద్దనడానికీ, అభివృద్ధిని వ్యతిరేకించడానికీ సంబంధం ఏమిటని అచ్చెన్న నిలదీశారు.గతంలో రాజధానిగా అమరావతి ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం బిల్లు కూడా పెట్టలేదని, అసెంబ్లీలో కేవలం ప్రకటన చేసిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రోజు సభలో జరిగిన దృశ్యాలను ఆయన తన ఫోన్లో అచ్చెన్నకు చూపించారు. తాము ప్రకటన చేయడంతోపాటు బిల్లు కూడా పెట్టామని, బిల్లుపై చర్చలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారని అచ్చెన్న గుర్తుచేశారు. అత్యవసర సమయాల్లో స్పీకర్‌ అనుమతితో ఎప్పుడైనా బిల్లులు పెట్టవచ్చని బుగ్గన పేర్కొన్నారు. బిల్లులో కేవలం మూడు పేజీలు ఉన్నాయని, ఈ మాత్రం దానికి రెండు రోజుల సమయం అవసరం లేదని.. టీడీపీ తన అభిప్రాయం చెప్పవచ్చని జగన్‌ తెలిపారు. దీనిని తాము వ్యతిరేకిస్తామని అచ్చెన్న అనగా.. బిల్లును చించివేయవచ్చని.. సభ నుంచి వాకౌట్‌ కూడా చేయవచ్చని జగన్‌ సూచించారు. బయటకు వెళ్లడానికి అచ్చెన్నాయుడు లేచి నిలబడినప్పుడు సీఎం వ్యంగ్యంగా వంగి నమస్కారం చేశారు.శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనంపైనా బీఏసీ భేటీలో చర్చ జరిగింది.

 

జిల్లా తీవ్రంగా వెనుకబడిందని.. విశాఖలో రాజధాని పెట్టడాన్ని అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు వ్యతిరేకించడం దుర్మార్గమని స్పీకర్‌ తమ్మినేని వ్యాఖ్యానించారు. ‘గత 20 ఏళ్ల నుంచి ఆ జిల్లాలో మంత్రులుగా అధికారం చెలాయించింది తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావులే. వారిద్దరూ ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. ఇరవై ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు వెనుకబాటుతనం గురించి మీరే మాట్లాడడం ఏమిటి? వెనకబాటుతనానికి మీ బాధ్యత లేదా’ అని అచ్చెన్న ప్రశ్నించారు. అచ్చెన్నతో వాదన అనవసరమని, ఆయన మారడని స్పీకర్‌ అన్నారు. అనంతరం మూడు రోజులు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.శాసన మండలి సమావేశాలను రెండు రోజులపాటు జరపాలని నిర్ణయించారు. మండలి ఛైర్మన్‌ ఎంఎ షరీఫ్‌ అధ్యక్షతన మండలి సభా వ్యవహారాల సంఘం సమావేశం జరిగింది. మంగళవారం నుంచి రెండు రోజులపాటు నిర్వహించాలని నిశ్చయిచారు. బిల్లులతోపాటు రైతులపై లాఠీచార్జి, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అంశాలపైనా చర్చిస్తారు.

"
"