ఎపీ పరీస్థితి ఇంత దారుణమా..?

జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం దేశవిదేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ పరువును దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రం ప్రస్తావన వస్తే ఆసక్తి కనబరిచేవారు. ఇప్పుడు ఇక అక్కడ ఏముందిలే అని పెదవివిరిచే పరిస్థితులు ఏర్పడ్డాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల స్థాపనకు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు జంకుతున్నారు. ఇప్పటికే పెట్టినవారు పక్క రాష్ట్రాల వైపు వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. మూటాముల్లె సర్దుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నానాటికీ పడిపోతోంది. రాష్ట్రంలో ఏ వ్యాపారంలోనైనా పెట్టుబడులు పెట్టడం వృథా అన్న అభిప్రాయం బలపడుతోంది. అంతేకాదు.. ప్రభుత్వాన్ని నమ్మి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల పరిస్థితే అగమ్యగోచరంగా మారిపోయింది.

 

దీంతో రాష్ట్రంలో ఇంకెక్కడా రైతులు తమ భూములిచ్చేందుకు ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏ ప్రభుత్వమైనా కొన్ని నిర్ణయాలను తనకు నచ్చినవిధంగా తీసుకోవడంలో తప్పులేదు. కానీ తొందరపాటుతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందుల్లో పడేస్తుంది. ఆ నిర్ణయాల గొలుసుకట్టు ప్రభావం భవిష్యత్‌పై పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో కనిపించకపోవడంతో ఆంధ్రపై గత ఐదేళ్లలో ఏర్పడిన సానుకూలత వేగంగా దూరమవుతోంది.వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోటీ నెలకొంది. దావోస్‌ వెళ్లినా, అమెరికా వెళ్లినా.. దేశంలోనే ఎక్కడకు వెళ్లినా ఎలాగోలా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దేశంలోని అన్ని రాష్ట్రాలూ అడుగులు వేస్తున్నాయి. ఎవరైనా పెట్టుబడిదారు కాస్త సంసిద్ధత తెలిపితే చాలు.. ఎర్రతివాచీ పరిచి, అవసరమైన రాయితీలన్నీ ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో.. ఇప్పటికే ఉన్న కంపెనీలు వెళ్లిపోకుండా చూసుకోవడం, చర్చల దశలో ఉన్నవాటిని మరింత ముందుకు తీసుకెళ్లడం ఏ ప్రభుత్వమైనా చేస్తుంంది. మన రాష్ట్రంలో మాత్రం తద్భిన్నంగా జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో దాదాపు రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెడతామనే ప్రతిపాదనతో వచ్చిన రిలయన్స్‌ సెజ్‌ జాడ లేకుండా పోయింది.

 

విశాఖపట్నంలో భారీ పెట్టుబడితో అంతర్జాతీయ కన్వెన్షన్‌ కేంద్రం నిర్మించి.. వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న ‘లులు’ గ్రూప్‌నకు భూ కేటాయింపు రద్దు చేశారు. అమరావతిలో సింగపూర్‌ కన్సార్షియం చేపడతానన్న స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు రద్దయింది. ఆ తర్వాత రాజధానినే మార్చేస్తామంటూ ప్రకటన వెలువడింది. మరోపక్క పీపీఏల సమీక్షపై న్యాయస్థానాల్లో వివాదాలు నడుస్తున్నాయి. ఇవన్నీ రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఉన్న కంపెనీలకే కాంట్రాక్టులు రద్దు చేస్తుంటే.. కొత్తగా మేం వెళ్లి ఏం చేస్తామన్న భావన కొందరు పెట్టుబడిదారుల్లో కలుగుతోంది.

"
"