సొంతతప్పిదంతో అడ్డంగా ఇరుక్కున ఏపీ ప్రభుత్వం…

అమరావతి: ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌లో మరోసారి తప్పులు దొర్లాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌‌ను అధికారులు గ్రూపుల నుంచి తొలగించారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు కాస్త అటూ..ఇటూగా అదే బులెటిన్‌ విడుదల చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. సవరించిన బులెటిన్‌లోనూ ప్రకాశం జిల్లా కేసులను 44గా ప్రభుత్వం పేర్కొంది. జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇక్కడే అధికారులు పప్పులో కాలేశారు. 42మంది చికిత్స చేస్తున్నామని, ఒకరు డిశ్చార్జ్‌ అంటూ వెల్లడించారు.

 

మొదటగా 44 పాజిటివ్ కేసులున్నట్లు ప్రకటించిన అధికారులు తిరిగి 42 కేసులున్నట్లు చెప్పడం… అధికారుల తప్పిదమేననే విమర్శలు వస్తున్నాయి. అయితే అధికారులు చెబుతున్నట్లుగానే 42 మందికి చికిత్స అందిస్తున్నామని, ఒక కరోనా బాధితుడికి రోగం నయం కావడంతో డిశ్చార్జ్‌ చేస్తున్నామని ప్రకటించారు. అధికారులు చెబుతున్నట్లు 44 కేసులున్నాయని మొదట చెప్పారు. తర్వాత 42 యాక్టివ్ కేసులున్నాయని, ఒకరిని డిశ్చార్జ్ చేశామని చెబుతున్నారు. మరో బాధితుడు ఏమైయ్యాడని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలో మొత్తం 647కి కరోనా పాజిటివ్‌ కేసులు చేరాయి. ఏపీలో గత 24గంటల్లో 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో 17మంది మృతి చెందారు. 65 మందిని డిశ్చార్జ్‌ చేశారు. కర్నూలు జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 26 కేసులు నమోదయ్యాయి. కృష్ణా 6, తూర్పుగోదావరి జిల్లాలో, 5, అనంతపురం 3, గుంటూరు 3, విశాఖ ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. అనంతపురం 29, చిత్తూరు 28, తూ.గో. 24, గుంటూరు 129, కడప 37, కృష్ణా 75, కర్నూలు 158, నెల్లూరు 67, ప్రకాశం 44, విశాఖలో 21, పశ్చిమగోదావరి జిల్లాలో 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

"
"