పెట్టుబడిదారులను బయపడేలా చేస్తున్న ఎపీ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలన్నీ ‘రివర్స్‌‘ చేస్తూ పెట్టుబడిదారులను భయభ్రాంతుల్ని చేస్తున్నారని ‘ది ఎకనమిక్‌ టైమ్స్‌’ సండే మేగజైన్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ‘రివర్స్‌ స్వింగ్‌‘ శీర్షికతో జి.సీతారామన్‌ రాసిన ఈ కథనంలో జగన్‌ వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు జంకుతుండగా.. ఉన్న పెట్టుబడిదారులు కూడా పారిపోతున్నారని పేర్కొన్నారు. ‘కేంద్ర వాణిజ్య శాఖ, ప్రపంచబ్యాంకు, సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన వేర్వేరు సర్వేల్లో.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2016, 2017, 2018 సంవత్సరాల్లో రాష్ట్రం పెట్టుబడులకు/వాణిజ్యానికి అనుకూలంగా ఉందని తేలింది. నిరుడు మే నెలలో చంద్రబాబు స్థానంలో జగన్‌ సీఎం అయ్యారు. గత ముఖ్యమంత్రి తీసుకున్న కొన్ని నిర్ణయాలను రివర్స్‌ చేశారు.

 

దీంతో పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు. ప్రస్తుత, భవిష్యత్‌ పెట్టుబడులకు ముప్పు ఏర్పడింది. సౌర, పవన విద్యుత్‌ కొనుగోలు టారి్‌ఫల పునఃసమీక్ష, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల రద్దు నుంచి కంపెనీలకు కేటాయించిన భూములను వాపస్‌ తీసుకోవడం వరకు.. జగన్‌ ప్రమాదకర సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నందుకు చాలా పశ్చాత్తాపపడుతున్నామని అతిపెద్ద సౌర విద్యుదుత్పత్తి సంస్థ అక్మె సోలార్‌ హోల్డింగ్స్‌ వైస్‌చైర్మన్‌ శశిశేఖర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. భారీ టారి్‌ఫలు ఉన్నాయని.. గత ప్రభుత్వం ఆయా విద్యుదుత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలు) పునఃసమీక్షించాలని జగన్‌ నిరుడు జూలైలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆయా సంస్థలు హైకోర్టుకు వెళ్లాయి. కొనుగోలు ధరలను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఖరారుచేసేదాకా సౌరవిద్యుత్‌కు యూనిట్‌ రూ.2.44, పవన్‌ విద్యుత్‌కు రూ.2.43 చొప్పున సంస్థలకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది’ అని సీతారామన్‌ తెలిపారు.

జగన్‌ ‘రివర్స్‌’ నిర్ణయాల్లో కొన్ని..

2019 జూలై 1: పునరుత్పాద ఇంధన పీపీఏల పునఃసమీక్షకు కమిటీ నియామకం.

సెప్టెంబరు 4: పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి నవయుగ ఇంజనీరింగు కంపెనీకి ఇచ్చిన రూ.3,217 కోట్ల కాంట్రాక్టు రద్దు.

అక్టోబరు 21: నెల్లూరు జిల్లాలో సెజ్‌ ఏర్పాటుకు నవయుగ గ్రూప్‌ కంపెనీకి ఇచ్చిన 4,731 ఎకరాల భూకేటాయింపు రద్దు.

అక్టోబరు 30: విశాఖలో వాణిజ్య సముదాయం కోసం లులు గ్రూప్‌కు ఇచ్చిన 11 ఎకరాల కేటాయింపు రద్దు.

నవంబరు 11: రాజధాని అమరావతిలో సింగపూర్‌ కన్సార్టియానికి ఇచ్చిన స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు రద్దు.

2020 జనవరి 20: విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని (హైకోర్టు ప్రధాన బెంచ్‌) ఏర్పాటుకు ఆమోదం.

బకాయిలు చెల్లించాలని ఆదేశించినా..

పీపీఏల రద్దు దిశగా జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర డిస్కంలు ఆయా ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలతో కలిపి రూ.21 వేల కోట్ల రుణభారం పడుతుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ విశ్లేషించినట్లు సీతారామన్‌ పేర్కొన్నారు. ‘విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.1,450 కోట్ల బకాయిలు చెల్లించాలని హైకోర్టు డిస్కంలను ఆదేశించింది. చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించకపోతే పెట్టుబడిదారుడిలో విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇప్పుడు పునరుత్పాదకత ఇంధన రంగంలో ఇలా జరిగింది. రేపు మిగతా రంగాల్లోనూ జరగొచ్చని శశిశేఖర్‌ వ్యాఖ్యానించారు’ అని తెలిపారు.

కియపై వివాదం..

 

అనంతపురం జిల్లాలో రూ.13 వేల కోట్లతో ఏర్పాటుచేసిన కియ మోటార్స్‌ ప్రాజెక్టు తమిళనాడుకు తరలిపోనుందని రాయిటర్స్‌ వార్తాసంస్థ గత వారం కథనం ప్రచురించింది. దీనిని కియ, రెండు రాష్ట్రప్రభుత్వాలు ఖండించినా.. జగన్‌ ప్రభుత్వానికి, కియకు మధ్య ఘర్షణ వాతావరణం ఉన్న మాట వాస్తవమని సీతారామన్‌ తెలిపారు. ‘పాలక వైసీపీ ఎంపీ ఒకరు నిరుడు జరిగిన ఓ కార్యక్రమంలో కియ ఉన్నతాధికారులను బెదిరించారు. జగన్‌ రాష్ట్రానికి చేస్తున్న నష్టం శాశ్వతంగా ఉండిపోతుందని చంద్రబాబు తనయుడు, ఐటీ మాజీ మంత్రి లోకేశ్‌ అన్నారు. అయితే సరైన విధివిధానాలు పాటించనందునే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను రివర్స్‌ చేశామని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.1,400 కోట్లు ఆదాచేశామన్నారు’ అని ప్రస్తావించారు.

"
"