రాజధానిపై పవన్ గ్యారంటీ…

అసెంబ్లీలో 151 సీట్ల బలం ఉంది.. ఏమైనా చేస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనివ్వబోమని తేల్చిచెప్పారు. గురువారం విజయవాడలో బీజేపీ-జనసేన భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ సహా ఉభయ పార్టీల నేతలతో కలిసి కన్నా విలేకరుల సమావేశంలోమాట్లాడారు. సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఏపీ భవిష్యత్‌, రాష్ట్ర ప్రజల హితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ జగన్‌ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతోందని ఆక్షేపించారు.‘రాష్ట్ర రాజధానిగా అమరావతిని అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ లోపల, బయటా అంగీకరించాయి.

 

ఇప్పుడు జగన్‌ దానిని మారుస్తానంటూ ఏకపక్షంగా ముందుకెళ్తే ఎలా సాధ్యమవుతుంది? బీజేపీ-జనసేన ఉమ్మడి పోరాటంతో ప్రజల్లోకి వెళ్తాయి’ అని స్పష్టం చేశారు.ఈ నెల 20న రాజధానిని తరలించేందుకు జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి విలేకరులు ప్రశ్నించగా.. ‘ఎలా సాధ్యం? పీపీఏల విషయంలో ఏమైంది..? పోలవరం అంశం ఆయన(జగన్‌) అనుకున్నట్లు జరిగిందా.? అసెంబ్లీలో బలం ఒక్కటే సరిపోదు.. పోరాటాలతో పాటు అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తాం. అమరావతి మాత్రం కదలదు’ అని తేల్చిచెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వండి.. స్వర్గం చూపిస్తానంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. కుటుంబం, కులం, అవినీతి, అరాచకంతోపాటు ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రాధాన్యమివ్వడం దారుణమని తెలిపారు. రాష్ట్రాన్ని.. వైసీపీ పెట్టుబడిదారుల బారిన పడనివ్వబోమన్నారు.దేశ ప్రయోజనాలే ప్రధాని మోదీకి ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దమనసుతో తమతో కలిసి వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు కన్నా చెప్పారు. రెండు పార్టీలూ కలిసి నేతల నుంచి కార్యకర్తల వరకూ ఎలాంటి విభేదాలు లేకుండా దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తామన్నారు.

 

కుటుంబం, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో జగన్‌ ప్రభుత్వం ప్రజల్లో చులకనైపోయిందని.. ఈ విషయాలను మరింత లోతుగా ప్రజలకు వివరించి 2024లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.‘ఆంధ్రప్రదేశ్‌కు కులం, కుటుంబం, అవినీతి, అరాచకమనే గ్రహణాలు పట్టాయి.. జాతీయవాదం, అవినీతి రహితం, ప్రజా సంక్షేమం అనే ఆయుధాలతో వాటిని ఓడిస్తాం.. బంగారు ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తాం’ అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ స్పష్టం చేశారు. జీవీఎల్‌ మాట్లాడుతూ.. రెండు పార్టీలు కలవడం శుభపరిణామమని, విజయ బావుటా ఎగురవేస్తామని అన్నారు.

"
"