వైసీపీ మంత్రి ఇంత దౌర్జన్యమా..! సమాధానం చేప్పమంటే కొట్టించాడు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్‌లో ఓ రైతుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ నిర్వాసిత రైతును ‘ఎవడురా నువ్వు’ అని ప్రశ్నించారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి కనుసైగ చేయడంతో ఆయన గన్‌మెన్‌, ఉద్యోగులు దుర్భాషలాడుతూ రైతుపై మూకుమ్మడిగా దాడి చేశారు. వంద అడుగుల దూరం లాక్కెళ్లారు. పిడిగుద్దులు గుద్దారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద ఆదివారం చోటు చేసుకున్న ఘటన ఇది. ఇందుకు కారణం.. తమ భూమిని తీసుకున్నందుకు పరిహారం చెల్లించాలని ఆ రైతు అడగడమే! బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పనులు చేస్తున్న నిర్మాణ సంస్థ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కావడమే!కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్‌ వద్ద 11.39 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. సదరు నిర్మాణ పనులను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందుకు ప్రభుత్వం రెండు దఫాలుగా భూసేకరణ చేపట్టింది. భూ సేకరణలో బస్వాపూర్‌కు చెందిన ఉడుత సత్తయ్య, ఉడుత నర్సింహ, ఉడుత యాదయ్య కుటుంబాలకు చెందిన భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. కానీ, నష్టపరిహారం మాత్రం పూర్తిగా చెల్లించలేదు. మరో 21.50 ఎకరాల భూమికి చెల్లింపులు చేయాల్సి ఉంది. తమకు రావాల్సిన నష్ట పరిహారంపై రెండు, మూడేళ్లుగా నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. పరిహారం చెల్లించే వరకు పనులు చేయనివ్వకుండా అడ్డుకోవాలని ఆదివారం ఉదయం నిర్వాసిత రైతు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 

పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. అప్పుడే నిర్మాణ సంస్థకు చెందిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అక్కడికి వచ్చారు. ఆయనను గుర్తించిన నిర్వాసిత రైతు కుమారుడు ఉడుత రవి.. ‘సార్‌! మాకు నష్టపరిహారం చెల్లించలేదు.. మా భూమిలో పనులు నిలిపివేయండి’ అని కోరాడు. దాంతో, ఆగ్రహించిన మంత్రి.. ‘‘ఎవడివిరా నీవు.. పనులు నిలిపివేయమనడానికి!?’ అంటూ హూంకరించారు. వెంటనే ఆయన వెంట ఉన్న గన్‌మెన్‌, అక్కడి ఉద్యోగులు రైతుపై పడి పిడిగుద్దులు గుద్దుతూ.. నానా దుర్భాషలాడుతూ వంద అడుగుల దూరం ఈడ్చుకువెళ్లారు. నిస్సహాయ స్థితిలో ఆ యువ రైతు తన చేతికి అందిన మట్టి పెడ్డను విసిరాడు. దాంతో, ప్రాజెక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న శశి అనే వ్యక్తి చెవికి గాయమైంది.అతడిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ భూమికి న్యాయంగా రావాల్సిన పరిహారం కోరితే దాడికి పాల్పడి దౌర్జన్యం చేశారని బాధితుడు ఉడుత రవి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయం మీడియాకు పొక్కిన తర్వాత గ్రామంలో కొంతమంది నిర్మాణ సంస్థ తరఫున వకాల్తా పుచ్చుకుని.. అతడిని అందుబాటులో లేకుండా తప్పించినట్టు తెలిసింది. మంత్రికి చెందిన కంపెనీ ఉద్యోగులపై మట్టి పెడ్డతో దాడి చేసినందుకు ‘నీపైనే కేసు పెడతారు’ అంటూ అతనిని బెదిరించినట్లు సమాచారం.‘‘మా తమ్ముడి కుటుంబానికి చెందిన ఎనిమిది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 30 గుంటల భూమికి పరిహారం చెల్లించాల్సి ఉంది. దానిపై నిలదీశాడన్న ఆగ్రహంతో పెద్దిరెడ్డి గన్‌మెన్‌ దాడి చేసి గాయపరిచారు. పరిహారం చెల్లింపులో జాప్యం చేయడమే కాకుండా అడిగితే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు’’. భూమిని నమ్ముకుని బతికే ఈ బాధిత కుటుంబం రిజర్వాయర్‌లో భూమిని కోల్పోయి అదే రిజర్వాయర్‌ కట్టపై కూలీలుగా పని చేస్తున్నారు. పరిహారం కోసం నిలదీసినందుకు మంత్రి పెద్దిరెడ్డి అనుచరులతో చావు దెబ్బలు తిన్న ఉడుత రవి కూడా నెలకు రూ.8 వేలకు అదే ప్రాజెక్టు క్యాంపులో పనిచేస్తున్నారు. అతడి తండ్రి నర్సింహ, తల్లి నర్సమ్మ కట్టకు మట్టి పోస్తూ దినసరి కూలీలుగా పని చేసే దుస్థితికి చేరుకున్నారు. రిజర్వాయర్‌ నిర్మాణంలో భూమిని కోల్పోయిన అనేక మంది నిర్వాసితులకు కుంటి సాకులతో పరిహారం చెల్లించకపోగా.. ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరించడం పరిపాటిగా మారిందని గ్రామస్థులు తెలిపారు. ఇటీవల ఓ యువకుడిని ఇలాగే బెదిరిస్తే.. అతడి తల్లిదండ్రులు కాళ్లావేళ్లా పడాల్సి వచ్చిందని గ్రామస్థులు తెలిపారు.

 

బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులను దక్కించుకున్న పీఎల్‌ఆర్‌ ప్రాజెక్టుకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుట్టుచప్పుడు కాకుండా వారానికోసారి వచ్చిపోతుంటారు. ఉదయం 9 గంటలలోపే ఆయన వచ్చి పనుల తీరును చూసి వెళుతుంటారని గ్రామస్థులు తెలిపారు. ఇద్దరు గన్‌మెన్‌, ఆయన మాత్రమే వచ్చి ఇక్కడి సైట్‌ అధికారులకు సూచనలు చేస్తారన్నారు. ఆయన రాలేని పరిస్థితుల్లో ఆయన కుమారుడు, ఎంపీ మిథున్‌ రెడ్డి వచ్చి వెళుతుంటారని గ్రామస్తులు ‘ఆంధ్రజ్యోతికి‘ తెలిపారు. రిజర్వాయర్‌ పనులు సాగుతున్న ప్రదేశానికి ఆదివారం ఉడుత రవి, అతడి కుటుంబ సభ్యులు మద్యం తాగి వచ్చి పనులు నిలిపివేయాలని దౌర్జన్యం చేశారని, దాడిలో తమ ఉద్యోగి శశి తలకు గాయమైందని ప్రాజెక్టు మేనేజర్‌ రమణారెడ్డి తెలిపారు. ఘటనతో మంత్రి పెద్దిరెడ్డ్డికి సంబంధం లేదని పేర్కొన్నారు.

"
"