ఏపీలో హైపవర్ కమిటి భేటి.. చర్చలో వచ్చే ఆంశాలివే..

రాష్ట్ర రాజధాని మార్పు జరగబోతుందని అందరూ అనుకుంటున్నారు.దినితో రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఏపీలో అమరావతిని రాజధానిగా కొనసాగించే అవకాశాలు 99 శాతం కనిపించట్లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీలో 10 మంది మంత్రులు, కొందరు అధికారులు అందరూ కలిసి చర్చించుకుంటున్నది అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే అంశంపై కాదు… రాజధానిని తరలించేందుకు ఏం చెయ్యాలి, అప్పుడు అమరావతి రైతులకు ఎలా న్యాయం చెయ్యాలి… ఈ అంశాలపైనే. ఇప్పటికే రెండుసార్లు కూర్చొని GN రావు కమిటీ రిపోర్టు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించిన హైపవర్ కమిటీ… ఇవాళ మరోసారి కూర్చొని… రెండు కీలక అంశాలపై చర్చించబోతోంది. అమరావతిలో రైతులకు ప్యాకేజీ, అమరావతి నుంచీ ఉద్యోగులను వైజాగ్‌కి ఎలా తరలించాలి అనే అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.

 

ఆ తర్వాత సంక్రాంతి హడావుడి ముగిశాక మరోసారి భేటీ అయ్యి… రిపోర్ట్ రెడీ చేసి… ఈ నెల 20కల్లా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశమై… ఏపీ రాజధాని ఏది అనే అంశంపై క్లారిటీ ఇవ్వనుంది. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి… చర్చించనుంది. ఆ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఉంటుంది. ఇవన్నీ జరిగేటప్పటికీ… జనవరి ముగిసే అవకాశాలు బాగా ఉన్నాయి.వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో పాలనా రాజధానిని ఏర్పాటు చేయబోతోందన్న అంశంపై ఏపీలోగానీ, తెలంగాణలో గానీ ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. అది ఆల్రెడీ ఫిక్సైపోయిందని చాలా మంది అంటున్నా్రు కూడా. అవన్నీ పక్కన పెడితే… వైజాగ్‌ని పాలనా రాజధానిగా ఎలా మార్చాలి? అమరావతి నుంచీ ప్రభుత్వ శాఖల్ని ఎలా తరలించాలి? అక్కడి రైతులతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్స్‌ విషయంలో ఏం చెయ్యాలి? రైతులను ఎలా ఒప్పించాలి? వాళ్లకు ఇప్పుడు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించాలి? వంటి అంశాలు ఇవాళ చర్చిస్తారని తెలిసింది. గత ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.30వేల నుంచి రూ. 50వేల వరకు ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది. వ్యవసాయ కూలీలకు నెలకు రూ.2500 పెన్షన్ ఇస్తోంది. మొత్తం సేకరించిన భూమి 33,500 ఎకరాలు. అందులో 6000 ఎకరాల్ని కొన్ని సంస్థలకు కేటాయించింది గత ప్రభుత్వం. కొన్ని భూముల్లో రోడ్లు పడ్డాయి. ఇప్పుడు భూములు తిరిగి ఇవ్వాలంటే ఇవన్నీ సమస్యగా మారుతున్నాయి. పోనీ భూములు ఇవ్వకుండా ప్యాకేజీ ఎలా ఇవ్వాలి అనేది చర్చిస్తున్నారు.

 

సచివాలయ ఉద్యోగులు కూడా… హైదరాబాద్‌ నుంచీ అమరావతికి వచ్చిన తాము… మళ్లీ అక్కడి నుంచీ వైజాగ్ వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్లను ఒప్పించే అంశంపైనా చర్చ జరుగుతోంది. ప్రభుత్వమేమో… ఈ నెల 18నే కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకుంటోంది. పండుగ ఉంది కాబట్టి… 18 లోగా హైపవర్ కమిటీ రిపోర్ట్ రెడీ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

"
"