మరోకసారి ఏపీ నెం 1

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి సత్తా చాటింది. జాతీయ స్థాయిలో వరుసగా నాలుగో ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను శనివారం కేంద్రం ప్రకటించింది. సులభతర వ్యాపార నిర్వహణ (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స)పై వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి, వాటిపై పారిశ్రామికవేత్తల్లో సర్వే చేసి ఈ ర్యాంకులను ప్రకటిస్తారు.‘రాష్ట్ర వ్యాపార ప్రక్రియ సంస్కరణలు-19’ పేరుతో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా… తెలంగాణకు మూడో స్థానం దక్కింది. అనూహ్యంగా యూపీ రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో 2015లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. 2016, 2017లో వరుసగా నంబర్‌వన్‌ స్థానం దక్కించుకుంది. 2018లో ఏపీ, తెలంగాణ కలిసి ఉమ్మడిగా నంబర్‌వన్‌గా నిలిచాయి. తాజాగా 2019లోను ఏపీ ప్రథమస్థానంలో నిలిచింది.ఎవరిదీ ఘనత…

ఏపీకి అగ్రస్థానంలో నిలవడం తమ ఘనతే అని ఇటు జగన్‌ సర్కారు, అటు టీడీపీ ప్రకటించుకున్నాయి. సీఎం జగన్‌ చూపిన దార్శనికత వల్లే ఏపీ ప్రథమస్థానంలో నిలిచిందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులను ఆయన అభినందించారు.మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానాల వల్లే ఈ ర్యాంక్‌ లభించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ‘ముందుండడంకాదు. ఎవరికీ అందనంత దూరంలో ఉండాలని చంద్రబాబు వెంటపడి చేసిన పనుల ఫలితమే వరుసగా మూడో ఏడాదీ ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది’ అని పరిశ్రమల శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

ఏపీకి నెంబర్‌ ర్యాంక్‌ క్రెడిట్‌ తమదంటే తమదని అధికార, విపక్షాలు పోటాపోటీ ప్రకటనలు ఇచ్చుకున్నాయి. అయితే కేంద్రం ప్రకటన చూస్తే అసలు ‘క్రెడిట్‌’ ఎవరిదో అర్థమైపోతుంది.దీనిప్రకారం… 2019 మార్చి 31 వరకు అమలులో ఉన్న విధానాలపై సర్వే నిర్వహించారు. అంతకుముందు ఏడాదికాలం పాటు అమల్లో ఉన్న విధానాల ఆధారంగా దేశంలోని ఏ రాష్ట్రంలో సులువుగా వ్యాపా రం చేసుకోవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నదానిపై పరిశీలించి, సర్వే చేసి ర్యాంకులిచ్చారు. అప్పుడు ఏపీలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే.జగన్‌ సర్కారు 2019 మే 30న కొలువుతీరింది. అందువల్ల… ఈ ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పవచ్చు. మొత్తం 187అంశాల్లో సంస్కరణలను పరిశీలించారు.. కేంద్రప్రభుత్వం-ప్రపంచబ్యాంకు కలిసి ఈ సర్వే చేయగా…ఏపీ వందశాతం మార్కులతో మొదటిస్థానంలో నిలిచింది. షాపుల పునరుద్ధరణ చట్టంనుంచి దుకాణాలకు మినహాయింపు ఇవ్వడం, అన్ని కార్మిక చట్టాల కింద ఒకే రిటర్న్‌ దాఖలుకు అవకాశం కల్పించడం, బాయిలర్‌ తనిఖీలు మూడోపార్టీ చేసేలా సంస్కరణలు తేవడం, రిస్క్‌లేని పరిశ్రమలకు తనిఖీలు తగ్గించడం, సింగిల్‌ డెస్క్‌ విధానం 2015కు సవరణలు తేవడం, సకాలంలో పరిశ్రమలకు భూకేటాయింపులు తదితర కారణాలతో ఏపీ ప్రథమస్థానంలో నిలిచిందని పరిశ్రమలశాఖ కమిషనర్‌ జేవీఎన్‌ సుబ్రమణ్యం పేర్కొన్నారు.వాస్తవానికి ఈ సర్వే జరిగిన కాలంలో పరిశ్రమలశాఖ కమిషనర్‌గా సిద్ధార్థ జైన్‌ ఉన్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్న ల్‌ ట్రేడ్‌ రూపొందించిన 2019 ర్యాంకులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం విడుదల చేశారు. గతేడాది మార్చి 31వరకు రాష్ట్రాలు అమలుచేసిన సంస్కరణలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం… వాటిని మదించి తాజా ర్యాంకులు రిలీజ్‌ చేసింది.డీపీఐఐటీ ఈసారి ర్యాంకింగ్‌ విధానాన్ని మార్చేసింది. ఆయా రాష్ట్రాల పనితీరుతోపాటు 35 వేల యూజర్ల ఫీడ్‌బ్యాక్‌ను కూడా పరిగణలోకి తీసుకుని ర్యాంకులను తయారుచేశారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన ఆత్మనిర్భర్‌ స్కీమ్‌ను కూడా ఈసారి ర్యాంకుల నిర్ణయంలో పరిగణలోనికి తీసుకున్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ ర్యాంకుల్లో పడిపోయిన రాష్ట్రాలకు తాజా ర్యాంకుల జాబితా ఒక హెచ్చరికలాంటిద న్నారు. తాజా రిపోర్టులో భారత్‌ స్థానం 63 నుంచి 14కి ఎగబాకిందని ఆయన అన్నారు.ఈసారి ప్రత్యేకతలు ఏమిటంటే?…

అంతకుముందు 19 స్థానంలో ఉన్న లక్షద్వీప్‌ ఈదఫా 15వ స్థానానికి చేరుకుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు ఈసారి తమ స్థానాలు కోల్పోయాయి.బాబు వల్లే: అమర్‌నాథ్‌ రెడ్డి

చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన పనులు, చూపిన చొరవ వల్లే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాడు ఎన్నికల కంటే ఈ ర్యాంకు కోసమే ఎక్కువ దృష్టిపెట్టారన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే కొద్దికాలం ముందు కూడా తాను ఈ విషయమై ఢిల్లీవెళ్లి అన్ని వివరాలు సమర్పించానన్నారు.మరోవైపు ఇది చంద్రబాబు కృషికి నిదర్శనమని నారా లోకేశ్‌ పేర్కొన్నారు. వ్యాపార సంస్కరణల కార్యాచరణను సమర్థవంతంగా అమలుచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కాగా, వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలను పరిగణన లోకి తీసుకొంటే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో రాష్ర్టానికి పదో స్థానం వచ్చేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కుటుంబరావు వ్యాఖ్యానించారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకులతో తమకు పనిలేదని గతంలో చెప్పిన మంత్రి గౌతంరెడ్డి ఇప్పుడు ఈ ర్యాంకు తమ ఘనతేనని ఎలా చెప్పుకొంటారని ఆయన ప్రశ్నించారు.

"
"