ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. లక్షన్నర ఉద్యోగాలు ఔట్

‘అన్ని శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకే మొదట వేతనాల చెల్లింపు.. ఆ తరువాతే అధికారుల వంతు’ అనేసరికి పొంగిపోయారు. ‘ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు’ అనే ప్రకటన విని, తమనూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించారని సంతోషించారు. అయితే, ఆ పేరిటో లేక మరో ముసుగులోనో వారిని తొలగించే ప్రయత్నాలు ముమ్మరం అయినట్టు తెలిసింది. కొంతకాలంగా ఏదో కారణంతో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వం.. ఈసారి భారీఎత్తునే దానిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వారి నెత్తిపై ఉద్వాసన కత్తి వేలాడుతుందని, అది ఎప్పుడైనా వారి కొలువులను కత్తిరించే ముప్పు పొంచి ఉన్నట్టు చెబుతున్నారు. ‘ఆర్థిక శాఖ అనుమతిలేదు’ అనే ఒకేఒక్క కారణం చెప్పి.. దాదాపు లక్షన్నరమందిని తొలగించే ప్రయత్నాలు ఆ శాఖ స్థాయిలోనే ముమ్మరంగా సాగు తున్నట్టు తెలిసింది. ఆర్థికశాఖ, సాధారణ పరిపాలనశాఖ రోజుకో మెమో, సర్క్యులర్‌తో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని అసలే హడలెత్తిస్తున్నాయి.

ఇప్పుడు ఏకంగా వారి ఉద్యోగాలకే ఎసరొచ్చింది. ఆయా విభాగాల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి ఉందా..లేదా అనే వివరాలు పంపాలని అన్ని శాఖల హెచ్‌వోడీలకు, జిల్లా కలెక్టర్లకు, సచివాలయ అధికారులకు ఆర్థికశాఖ లేఖ రాసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీకి జీతాలు ఇవ్వాలంటే వారు ఏ తరహా సిబ్బందో వివరాలివ్వాలని, అందుకు సీఎ్‌ఫఎంఎస్‌ లాగిన్‌ ఐడీ వినియోగించుకోవాలని ఈశాఖ మెమో ద్వారా సూచించింది. ఆర్థికశాఖ 15 కాలమ్స్‌తో వివరాలను పంపాలంటూ ఒక నమూనాను అన్ని శాఖలకు పంపింది. ఈ నమూనాలో మంజూరైన పోస్టుల సంఖ్య, మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగుల సంఖ్య, ప్రభుత్వ ఆదేశాలతో మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సంఖ్య, నియామకం చేపట్టిన విధానం, వేతనాలు, మంజూరు కాని పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సంఖ్యతో పాటు కాంవారికి రావాల్సిన జీతాల పెండింగ్‌ బిల్లులు తదితర వివరాలు కలిగిన 15 కాలమ్‌ పూర్తి చేసి పంపాలని సూచించారు.ఈ వివరాలన్నీ వచ్చిన తర్వాత ఎవరిని కొనసాగించాలో నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి, ఇటీవలి కాలంలో ఏదో ఒక కారణం వెతికి.. తొలగించేయడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది మార్చి 31కు ముందు ఉద్యోగాల్లో చేరిన రూ.40వేల పైబడి వేతనాలు పొందుతున్న సిబ్బందిని ఇప్పటికే తొలగించారు. పేపర్‌ నోటిఫికేషన్‌, ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఏకపక్షంగా తీసేశారు. కాగా, పలు శాఖలకు సంబంధించిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఈ ఏడాది మార్చి నుంచి జీతాలివ్వడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్థికశాఖ అనుమతి పొందకుండా నియామకమైన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కేటాయింపులు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో దాదాపు రెండు లక్షలమంది ఉన్నారు. వారిలో ఆర్థిక శాఖ అనుమతి, బడ్జెట్‌ కేటాయింపులతో నియమించినవారు 40 వేలకు మించి ఉండరు. ఈ నెల 14న సచివాలయంలో జరిగిన వివిధ శాఖల నోడల్‌ అధికారుల సమావేశంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల అంశం చర్చకు వచ్చింది. బడ్జెట్‌ లేకపోవడం, సిబ్బంది కాంట్రాక్టు రెన్యువల్‌ కాకపోవడం, ఆ ఉద్యోగుల నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి లేకపోవడమే దీనికి కారణమని తేల్చారు.

"
"