రాజధాని మార్పు అంతా ప్లాన్ ….జరిగిన విషయం ఏమిటంటే…

అంతా పథకం ప్రకారమే జరుగుతోంది. వరదలు వస్తే మునిగిపోతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత ఆ భూమి నిర్మాణాలకు పనికిరాదని ప్రచారం చేశారు. రాజధాని నిర్మాణాలలో అవినీతి జరిగిందని సబ్ కమిటీ వేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంటూ ఇంకొన్నాళ్లు రభస సృష్టించారు. జి.ఎన్.రావు కమిటీని తెరపైకి తెచ్చారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక పేరుతో నాటకం రక్తికట్టించారు. హైపవర్ కమిటీ అంటూ ఇంకొకటి నియమించారు. చివరకు ఈ నివేదికలన్నీ రాజధాని తరలింపు అనే ముందస్తు పథకానికి ఉపయోగించారనేది రాజధాని రైతుల ఆరోపణ. క్యాబినెట్, అసెంబ్లీ సమావేశాల్లో మమ అనిపించడమే ఇంక మిగిలింది. ప్రతిపక్షాలకు, రైతులకు, వైసీపీలోని ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా రాజధాని విషయంలో ఎలాంటి స్కెచ్‌ వేశారో ఈ కథనంలో మీరే చూడండి!రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అంటారు.. ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ తలుచుకున్నారు. అమరావతి ప్రాంత రైతులతోపాటు రాష్ట్ర ప్రజలకీ ఆ దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఒక రూపం తీసుకుంటున్న ఏపీ రాజధాని అమరావతిని ధ్వంసం చేయాలనుకోవడం ప్రజల భవిష్యత్తుని దెబ్బతీయడం కాక ఇంకేమిటి?

 

సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాలను నిలిపివేసింది. ఈ మేరకు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేసింది. అయితే ఈ చర్యపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో రైతులకు కౌలు మాత్రం చెల్లించారు. కానీ అక్కడనుంచే అసలు స్కెచ్ మొదలైంది. కృష్ణానదికి వరదలు రాగానే.. రాజధాని మునిగిపోతోందని లేనిపోని ప్రచారాలు చేశారు. 2009లో 11 లక్షల 75 వేల క్యూసెక్కుల వరద ముంచెత్తినా మునగని రాజధాని ప్రాంతం.. 2019లో 8 లక్షల క్యూసెక్కుల వరదకే ఎలా మునిగిపోతుందీ? అని రైతులు గట్టిగా ప్రశ్నించారు. అంతేకాదు- కరకట్ట దాటి చుక్కనీరు కూడా బయటికి పొంగలేదు. వైసీపీ నేతలు ఎంత అల్లరి చేద్దామని చూసినా.. చంద్రబాబు అద్దెఇంటిలోకి కూడా నీళ్లు ప్రవేశించలేదు. ఇలా వైసీపీ పెద్దల “ప్లాన్‌- ఏ” విఫలం అయ్యింది.ఆ తర్వాత వారు “ప్లాన్‌- బీ”ని తెరపైకి తెచ్చారు. రాజధాని అమరావతిలో అవినీతి జరిగిందంటూ అధికారపక్ష మంత్రులు నానా యాగీ చేశారు. అమరావతి భూములు నిర్మాణాలకు పనికిరావని కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే రాజధాని ప్రాంతానికి చెందిన 29 గ్రామాలలో లక్షలాది మంది ప్రజలు బ్రహ్మాండమైన ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్నారు. ఇలా వైసీపీ నేతలు చేస్తున్న ఒక్కో వాదం వీగిపోతుంటే వారు మరో వాదాన్ని లేవనెత్తుతూ అమరావతిపై రభస సృష్టిస్తూనే వచ్చారు.ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ తనంతట తానుగా అమరావతిపై స్వల్పకాలిక చర్చను లేవదీసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు ఆ పార్టీ నేతలు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కావాలనీ, అంత బడ్జెట్ తమ వద్ద లేదనీ ఇంకో రాగాన్ని కూడా మొదలుపెట్టారు.

 

దీంతోపాటు ప్రజలను మానసికంగా సిద్ధంచేసేందుకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ రాజధానిని మూడు భాగాలు చేయోచ్చని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.ఆనాడు అసెంబ్లీలో సీఎం జగన్‌ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. ఆయన కోరుకున్న విధంగానే జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. “రాజధాని గ్రామాలలో ఒక్కరోజు కూడా పర్యటించని జీఎన్ రావు కమిటీ అమరావతిని మార్చాలంటూ నివేదిక ఎలా ఇచ్చింది?” అని రైతులు నిలదీశారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు, రాజధాని సమగ్రాభివృద్ధి కోసం నివేదిక ఇవ్వాలని జీఎన్ రావు కమిటీని నియమిస్తూ ఇచ్చిన జీవోలో ప్రభుత్వం పేర్కొనగా, ఆ కమిటీ అభివృద్ధి అంశాన్ని మరిచిపోయి ఏకంగా రాజధానిని విడదీయాలని తేల్చేసింది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా దాదాపు ఇదే తరహా నివేదికను ఇచ్చింది. రాష్ట్రంలో ఒక్కరోజు కూడా పర్యటించని బీసీజీ కమిటీ కేవలం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌తోపాటు అధికారులు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఈ నివేదిక ఇచ్చిందని అధికారులే చెబుతున్నారు.ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటినుంచి నిశితంగా గమనిస్తూ వచ్చిన రైతులకి వైసీపీ సర్కార్‌ స్కెచ్‌ అర్థమైపోయింది. దీనికి తుది ఘట్టంగా హైపవర్‌ కమిటీని నియమించడం, సిఫార్సులను ఆమోదించడం, క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం, అదే రోజున అంటే జనవరి 18వ తేదీన అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఇంత పెద్ద వ్యవహారాన్ని ఇటు ప్రతిపక్షాలకు గానీ చివరకు వైసీపీలోని ఎమ్మెల్యేలకు కూడా ఏమాత్రం తెలియకుండా అధికారపక్ష వ్యూహకర్తలు అమలుచేయడం విడ్డూరం! దీంతో రాజధాని పరిధిలో ఉన్న ముఖ్యంగా గుంటూరు, కృష్ణాజిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు.

 

రాజధాని మార్పు నిర్ణయం తర్వాత ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలను అధినేతకు చెప్పలేక, తమను నిలదీస్తున్న ప్రజానీకానికి సరైన సమాధానం చెప్పలేక అధికారపార్టీ ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. సన్నిహిత అనుచరుల వద్ద తమ అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. మరికొందరు మాత్రం “మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత తమను పిలిచి మాట్లాడటం ఏమిటని” గుర్రుగా ఉన్నారు. పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని వైసీపీ ప్రజాప్రతినిధులు నమ్ముతున్నారు కూడా! ప్రతిపక్షం వద్ద గుట్టుగా ఉండటం సమర్థనీయమే కానీ.. మా దగ్గరెందుకు రహస్యం పాటించారని కొందరు అంతర్గతంగా మాట్లాతున్నారు. ఈ అంశాన్ని ప్రజలు మనసులో పెట్టుకుంటే మాత్రం తమకి భవిష్యత్తు ఉండదని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా మూడు రాజధానుల ఆటలో ప్రజలనే కాదు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్‌ పావులుగా మార్చడం విడ్డూరం!

"
"