అమ్ అద్మికి ఈ విజయం ప్రత్యేకం… ఎందుకంటే….!

ఢిల్లీలో వరుసగా మూడోసారి విజయదుందుభి మోగించింది ఆమ్ ఆద్మీ పార్టీ. దీంతో ముచ్చటగా మూడోసారి ఢిల్లీ సీఎం పీఠంలో అరవింద్ కేజ్రీవాల్ కూర్చోనున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన పాలనకు ప్రజలకు పట్టంకట్టారంటూ అందరూ అంటున్నారుగానీ, ఈ ఎన్నికల్లో గెలవడానికి కేజ్రీవాల్ చాలా కష్టపడాల్సి వచ్చింది. మూడోసారి ఆప్ గెలవకుండా ఉండేందుకు బీజేపీ రకరకాల ఆటంకాలు సృష్టించింది. దీంతో ఈ ఎలక్షన్లలో కేజ్రీ విజయం కష్టమేనంటూ ప్రచారం కూడా సాగింది. మరి వాటన్నింటినీ అధిగమించి ఢిల్లీ పీఠమెక్కుతున్నారు అరవింద్ కేజ్రీవాల్. అందుకే గతంతో పోల్చుకుంటే ఈసారి ఆప్ సీట్లు తగ్గినా ఈ విజయం ఎంతో ప్రత్యేకం.మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని గెలవడం దేశంలో ఏ నేతకూ అంత ఈజీకాదు. మరీ ముఖ్యంగా రెండోసారి గెలవడమంటే చాలాకష్టం. ఎందుకంటే ఈసారి మోదీ పాపులారిటీ ఆకాశన్నంటేసింది. యూపీలాంటి రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థి పేరు ప్రకటించకుండానే బీజేపీ విజయఢంకా మోగించడమే దీనికి పెద్ద ఉదాహరణ. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లలో 50శాతం మోదీ వల్లే పడ్డాయనడం అతిశయోక్తి కాదు. మరోవైపు రాజకీయ చాణక్యుడు అమిత్ షా వ్యూహాలను ఎదుర్కోవడం కూడా మాటలుకాదు. దీనికితోడు ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, చివరకు ఎన్నికల సంఘం కూడా ఆప్ ప్రభుత్వంపై వివక్ష చూపిందనే ఆరోపణలున్నాయి. దానికి తోడు ఇవి అమిత్‌షా వర్సెస్ కేజ్రీవాల్ ఎన్నికలంటూ బీజేపీ భారీగా ప్రచారం చేసింది. దీంతో 2015 ఎన్నికలకన్నా ఈ ఎన్నికలు ఆప్‌కు కష్టతరంగా మారాయి. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొని కూడా ఆప్ విజయం సాధించడం నిజంగా అద్భుతమే.

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆప్ ప్రభుత్వాన్ని బలహీన పరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇది ఎంత దూరం వెళ్లిందంటే.. ఒకానొక సందర్భంలో ఆప్ ప్రభుత్వం చేపట్టాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ వీటో అధికారంతో ఆపేశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అవినీతి నిరోధక శాఖ ఆప్ ప్రభుత్వం చేయిజారిపోయింది. ఇలా తాము పనిచేయాలనుకున్న ప్రతిసారీ కేంద్రం మోకాలడ్డుపెట్టిందని, కానీ తాము పని చేస్తూనే ముందుకుపోయామని ఆప్ ప్రచారం కూడా చేసుకుంది. దీంతో ఎటూ బీజేపీ పనిచేయనివ్వడం లేదుకదా? సరే బీజేపీనే అధికారంలో ఉంటే ఆపేదెవరు? అని ప్రజలు భావిస్తే తమ కొంప కొల్లేరేనని ఆప్ భయపడింది. దీనివల్ల తమకు నష్టమే ఎక్కువని భావించి ఈ ప్రచారాన్ని మానుకుంది. ఇలా తమకున్న అతి తక్కువ వనరులను ఉపయోగించుకొని ఆప్ గెలుపొందడం విశేషం.ఢిల్లీలో దాదాపు 40శాతంమంది ప్రజలు హిందువులే. దీంతో బీజేపీ ఈ ఎన్నికల్లో తమ ట్రంప్ కార్డు ‘హిందూత్వ’ను బాగా ఉపయోగించుకుంది. ఇంతకుమించి వారి వద్ద చెప్పుకోవడానికేం లేదు అని చాలామంది భావించారని చెప్పడం కూడా అతిశయోక్తికాదేమో. ఈ ఎన్నికల్లో అంతలా హిందూత్వను ఉపయోగించింది బీజేపీ. దీనికోసం రామమందిరం, ఆర్టికల్ 370, సీఏఏ-ఎన్నార్పీ-ఎన్నార్సీ అంశాలను తెరపైకి తెచ్చింది. సీఏఏకు వ్యతిరేకంగా ఉన్న ఆప్‌ను చెడుగా చూపించే ప్రయత్నం చేసింది. దీంతో లిబరల్ భావాలు కలిగిన చాలామంది బీజేపీ ఒత్తిళ్లకు తలవంచేశారు. ఇలాంటి సమయంలో కూడా ఆప్ తన మాటమార్చలేదు. సీఏఏకు వ్యతిరేకంగానే నిలబడింది. తాము అందించిన పాలనే తమ అజెండా అంటూ ముందుకుసాగింది. బీజేపీ మతరాజకీయాలకు ఎదురు నిలిచి గెలుపొందింది.2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీ అఖండ విజయం సాధించింది. ఇది జరిగిన ఏడాది తర్వాత జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం మూడే సీట్లు గెలిచింది. దీంతో అవమానానికి గురైన బీజేపీ.. 2020లో ఆప్‌ను ఎలాగైనా ఓడించాలని వ్యూహాలు రచిస్తూ వచ్చింది. దీనికోసం ఐదేళ్ల నుంచి కసరత్తులు చేయడం మొదలెట్టింది. దీనిలో భాగంగానే ఆప్ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవడం, ఆప్ ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం చేసింది. అంతేకాక ఢిల్లీలోని పూర్వాంచల్ ఓటర్లను ఆకర్షించడం కోసం, భోజ్‌పూరి స్టార్ అయిన ఎంపీ మనోజ్ తివారీని ఢిల్లీలో పార్టీ ముఖచిత్రంగా మార్చింది. అయినా సరే ప్రజలు మాత్రం ఆప్‌కే పట్టం కట్టారంటే.. ఆప్ ప్రభుత్వంపై వారికి ఎంత నమ్మకం ఉందో ఊహించుకోవచ్చు.దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి బాగా లబ్ది చేకూర్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సే. ఎందుకంటే ఆ పార్టీ బీజేపీపై గెలవలేదు. ఇతర పార్టీలనూ గెలవనివ్వదు. ఇదే చాలా ప్రాంతీయ పార్టీల్లో ఉన్న అభిప్రాయం. దీనికి ఉదాహరణగా వారు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలను చూపుతున్నారు. యూపీలో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్సే కారణమని పలువురు నేతలు ఆరోపించారు కూడా. బీజేపీ వ్యతిరేక ఓట్లలో కాంగ్రెస్ పార్టీ భారీ చీలిక తెస్తోందనేది వారి వాదన. ఈ సమస్య ఢిల్లీలో కూడా ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ కారణంగా ఎన్నికల ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఆప్ భావించింది కూడా. కానీ కాంగ్రెస్ తమను అవమానించడంతో ఈ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో తాము ఓడిపోతే కాంగ్రెస్‌ పేరు చెప్పి తప్పించుకోవాలని కేజ్రీవాల్ భావించలేదు. బీజేపీ, బీఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ.. ఇలా పార్టీ ఏదైనా ధైర్యంగా ఎదుర్కొని, సొంత కాళ్లపై నిలబడి స్వయంశక్తితో పార్టీని గెలిపించుకున్నారు.వరుస ఓటములు కూడా ఆప్ నేతల మనోస్థైర్యాన్ని దెబ్బతీశాయి. పంజాబ్‌లో ఎలాగైనా గెలవాలని భావించిన ఆప్.. దాదాపు ఢిల్లీ పాలనను పక్కనబెట్టి ప్రచారం చేసింది. కానీ అక్కడ గెలవలేకపోయింది. ఈ ప్రభావం పార్టీ మీద, నాయకుల మీద, ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్‌పైన చాలా ఎక్కువగా పడింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రతికూల ఫలితమే. మరీ ఘోరంగా.. మొత్తం పోలైన ఓట్లలో కేవలం 26శాతమే ఆప్‌కు దక్కాయి. దీంతో ఏం చేయలేని అయోమయంలో పడిపోయారు ఆప్ నేతలంతా. ఆ వెంటనే 2019 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. వాటిలో ఢిల్లీలోని ఏడు స్థానాల్లో పోటీ చేసింది ఆప్. కానీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోయింది. ఇలా వరుస ఓటములతో మనోస్థైర్యం కోల్పోయిన పార్టీ.. ఇలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం అద్భుతమనే చెప్పాలి.

 

ఇవన్నీగాక మళ్లీ ఆప్ చేసుకున్న స్వయంకృతాపరాధాలు కూడా చాలా ఉన్నాయి. పక్కరాష్ట్రం పంజాబ్‌లో గెలవడం కోసం సొంతరాష్ట్రం ఢిల్లీ పాలనను పక్కనబెట్టడం, 67 సీట్లు గెలిచామనే ధీమాతో కొందరు నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రోగాలతో ఢిల్లీ ప్రజలు నానాబాధలూ పడుతుంటే సరిగా పట్టించుకోలేదనే విమర్శలు, ప్రధాని మోదీపై హాస్యాస్పదమైన ఆరోపణలు, బస్సుల షార్టేజి, కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించలేకపోవడం.. ఇవన్నీ ఆప్ ప్రభుత్వంపై ప్రజలకు ఆగ్రహం కలిగించిన అంశాలే. వీటివల్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను తగ్గించుకొని, వారి నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఆప్ నేతలు పడ్డ కష్టం అంతాఇంతా కాదు.ఇలాంటి కారణాల వల్లే ఈ విజయం కేజ్రీకి ఎంతో ప్రత్యేకం. మోదీ-షా ద్వయం వ్యూహాలను, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లనూ తట్టుకుంటూ ప్రజలకు వారందించిన పాలనే వారికి మళ్లీ పట్టం కట్టిందని విశ్లేషకుల అభిప్రాయం.

"
"