కోత్తపలుకులో చర్చించిన ఏబిఎన్ ఆర్కే….

‘కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలి’’ అని ఏపీ అధికారులు అలా కోరారో లేదో.. ‘‘మీ రాజధాని ఏది? రాజధాని ఎక్కడ ఉంటుందో తేలకుండా తరలింపు విషయం ఎందుకులే!’’ అంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ స్పందించారు. దీంతో ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మౌనం వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత పరిస్థితికి ఈ సంఘటన అద్దంపడుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న నినాదాలతో ప్రజలు ఆందోళనకు దిగుతుండగా, మూడు రాజధానుల నిర్ణయానికి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తదుపరి అడుగులు వేస్తోంది. ఈ వివాదం ఎంతకాలం కొనసాగుతుందో, అంతిమంగా ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది.రాజధాని రగడను కమ్మ–రెడ్ల మధ్య పోరాటంగానే కొన్ని వర్గాల ప్రజలు పరిగణిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌కు ఈ దుస్థితి ఏమిటా? అని ఆలోచనాపరులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం నోరు విప్పకుండా తన మంత్రులతో వివాదాస్పద ప్రకటనలు చేయిస్తూ అలౌకిక ఆనందం పొందుతున్నారు.

 

ఈ నేపథ్యంలోనే అవినీతి కేసులలో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారంనాడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో చేతులు కట్టుకుని నిలబడిన సన్నివేశం ఆవిష్కృతమైంది. జగన్మోహన్‌రెడ్డి రాజకీయ భవితవ్యం ఇప్పుడు న్యాయమూర్తి చేతిలో ఉంది. అలాంటి జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో న్యాయస్థానాలు ఎక్కడ ఉండాలో నిర్ణయించబోతున్నారు.ఈ పరిస్థితిని బ్యూటీ ఆఫ్‌ డెమోక్రసీ అనాలో, ఐరనీ ఆఫ్‌ డెమోక్రసీ అనాలో తెలియని పరిస్థితి! ఆర్థిక నేరాలకు సంబంధించిన తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలను ఏమనుకోవాలి? ‘‘వేల కోట్ల రూపాయలను కైంకర్యం చేసిన వ్యక్తిని దూరంగా పెట్టవలసిన ప్రజలే మీరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పడం ఏమిటి?’’ అని ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి మాటలు విన్నప్పుడు నిజమే కదా? అని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్‌రెడ్డినే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. రాష్ట్రానికి అధికారిక రాజధాని ఏదో చెప్పకుండా మూడు ముక్కలాటకు తెర తీశారు.సహజ సిద్ధంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చెబుతున్న ప్రభుత్వం మున్ముందు విశాఖనే ప్రధాన రాజధానిగా ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణాలు పూర్తిచేసిన అమరావతి పేరుకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. అక్కడ ఎడ్యుకేషనల్‌ హబ్‌ ఏర్పాటుచేస్తామని మంత్రులు చెబుతున్నారు గానీ, జనం నివసించని ప్రాంతంలో ఎవరైనా విద్యాసంస్థలను నెలకొల్పుతారా? రాజధానిపై ప్రకటనలు చేస్తున్న మంత్రులు కొందరు ‘పరమానందయ్య శిష్యులను’ గుర్తుకుతెస్తున్నారు. విశాఖలో భూ కుంభకోణంపై గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ తన నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును ప్రముఖంగా ప్రస్తావించింది. స్వాతంత్య్ర సమరయోధులకు, మాజీ సైనికులకు కేటాయించిన దాదాపు 60 ఎకరాల భూమికి ఎన్‌వోసీలు ఇప్పించడం ద్వారా ఆ భూములను ధర్మాన ప్రసాదరావు సొంతం చేసుకున్నారని సిట్‌ బృందం తన నివేదికలో పేర్కొంది. ఇప్పుడు ఇదే ధర్మాన అమరావతి రైతులపై నోరు పారేసుకుంటున్నారు. వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రయోజనాల ముందు రాష్ట్ర ప్రయోజనాలు వెలవెలబోతున్నాయి.రాజధానిని మహా నగరంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పి ప్రజలు కూడా సంకుచితంగా ఆలోచించడమే అన్నింటికంటే విషాదకరం. విశాఖలో పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరుసటి సంవత్సరం నుంచి యేటా లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని మంత్రి బొత్స తాజాగా ప్రకటించారు. ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించి ప్రజలను మోసం చేసేవారు కూడా ఇటువంటి ఆకర్షణీయమైన పథకాన్ని ప్రకటించి ఉండరు. మంత్రి బొత్సకు కూడా తన ప్రకటన హాస్యాస్పదంగా ఉందన్న విషయం తెలుసు. అయితే రానున్న రోజుల్లో వైసీపీలో చోటుచేసుకోబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఆయన అలా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అవినీతి కేసులలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవ్వాలని బొత్సతోపాటు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ పడుతున్నారని వైసీపీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే తన స్థానంలో తన భార్య భారతిని నియమించే ప్రయత్నం జగన్మోహన్‌రెడ్డి చేస్తారనీ, అప్పుడు పార్టీలో చీలిక వస్తుందనీ వైసీపీలోని ఒక ప్రముఖుడు అంచనా వేస్తున్నారు. భారతికి, షర్మిలకు అస్సలు పొసగడం లేదనీ, ఫలితంగా కుటుంబంలో చీలిక వస్తుందనీ, అంతిమంగా పార్టీలో కూడా చీలిక వస్తుందనీ ఆయన జోస్యం చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు కూడా ఇటీవల హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా జరగబోయే పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఆరు నెలలు ఓపిక పట్టండి.. ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతుందో మీరే చూస్తారుగా’’ అని ఆ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం. ఈ కారణంగానే రాజధాని మార్పు విషయంలో వివాదం ముసురుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని చెబుతున్నారు.జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా అప్రతిష్ఠపాలైన తర్వాత తమ ప్రణాళికను అమలుచేయాలని ఇటు బీజేపీ పెద్దలతోపాటు అటు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు కూడా తలపోస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఏపీ అధికార పార్టీలో నిజంగా చీలిక వస్తుందా? ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్‌రెడ్డి తప్పుకోవాల్సి వస్తుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నప్పటికీ రాజధాని వివాదం మాత్రం రగులుతూనే ఉంటుంది.ఇప్పుడిక మంత్రుల ప్రకటనలు, రాష్ట్రాలు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి మహా నగరాల అవసరముందా? అనే అంశాలకు వద్దాం. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు వల్ల మాత్రమే ప్రపంచంలో ఏ నగరం కూడా అభివృద్ధి చెందలేదు. ప్రైవేట్‌ పెట్టుబడులు వచ్చినప్పుడే నగరాలు అభివృద్ధి చెందుతాయన్నది నిర్వివాదాంశం! హైదరాబాద్‌ మహానగరాన్నే తీసుకుందాం. హైదరాబాద్‌ ఇవ్వాళ విశ్వనగరంగా అభివృద్ధి చెందడానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసిన కృషే కారణం. ఆంధ్రప్రదేశ్‌ నాయకులు చెబుతున్నట్లుగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రభుత్వ ఆదాయాన్ని పెద్దగా ఖర్చు చేయలేదు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములే హైదరాబాద్‌ అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి తమదైన శైలిలో హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేశారు.కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను హైదరాబాద్‌కు ఆహ్వానించి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా నుంచి రెడ్లు, కృష్ణా జిల్లా నుంచి కమ్మ సామాజికవర్గం వారు హైదరాబాద్‌ వచ్చి పరిశ్రమలు, వ్యాపారాలు నెలకొల్పారు. ఈ కారణంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందడంతోపాటు పెట్టుబడులు పెట్టినవారు కూడా లాభపడ్డారు. వేల మందికి ఉపాధి లభించింది. ఆనాటి ముఖ్యమంత్రులు కులాలను చూడలేదు. పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉన్నవారందరినీ ఆహ్వానించి ప్రోత్సహించారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్లుగా వెలుగొందిన సరోవర్‌, అశోక, అన్నపూర్ణ, సంపూర్ణ వంటివి కమ్మ సామాజికవర్గానికి చెందినవారివే. నగరం విస్తరించేకొద్దీ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ హోటళ్లు ఏర్పడ్డాయి. అప్పటివరకు కమ్మ సామాజికవర్గం చేతిలో ఉన్న హోటళ్లు పోటీని తట్టుకోలేక మూతపడ్డాయి.

 

 

జీవీ కృష్ణారెడ్డికి చెందిన హోటళ్లు తాజ్‌ గ్రూప్‌తో చేతులు కలపడంతో నిలదొక్కుకున్నాయి. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గాన్ని ప్రత్యేకంగా చేరదీసి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన మర్రి చెన్నారెడ్డి నాటి మద్రాస్‌కే పరిమితమైన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడానికి విశేషంగా కృషి చేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకుని చెన్నారెడ్డి అనుకున్నది సాధించారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు స్టూడియోలకు ఉదారంగా భూములు కేటాయించారు. చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్లకు ఇళ్లు కట్టుకోవడానికై వందల ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌గా అభివృద్ధి చెందిన ప్రాంతం అదే! హైదరాబాద్‌ తరలిరావడానికి తొలుత అంగీకరించని ఎన్‌.టి.రామారావు అనంతరం వచ్చినా ప్రభుత్వం వద్ద భూములు తీసుకోకుండా ముషీరాబాద్‌, నాచారంలలో సొంత డబ్బుతో స్టూడియోలు నిర్మించుకున్నారు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు కుల ద్వేషాలు ఉండి వుంటే కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం ఉండిన చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడానికి చెన్నారెడ్డి అంతలా కృషిచేసి ఉండేవారు కాదు. ఈ సందర్భంగా ఒక సంఘటనను గుర్తుచేసుకోవాలి. అప్పట్లో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఒకాయనకు కమ్మ సామాజికవర్గంతో పొసిగేది కాదు. ఇది గమనించిన చెన్నారెడ్డి విజయవాడ పర్యటనకు రైలులో వచ్చారు. ఆయనకు స్వాగతం చెప్పడానికై రైల్వేస్టేషన్‌కు వచ్చిన సదరు నాయకుడిని ఉద్దేశించి.. ‘‘ఏమయ్యా కమ్మవాళ్లు నీకేమి అన్యాయం చేశారు? వారి సహకారం లేకపోతే రాజకీయాలలో నువ్వు ఎదిగేవాడివా? హైదరాబాద్‌లో అన్ని పెట్టుబడులు వచ్చేవా?’’ అని ప్రశ్నించారు. తర్వాత కాలంలో ఎన్‌టీఆర్‌, చంద్రబాబు ముఖ్యమంత్రులు కావడంతో హైదరాబాద్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.ప్రపంచవ్యాప్తంగా సేవల రంగం విస్తరించడంతో జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలన్నీ హైదరాబాద్‌లో కొలువుదీరాయి. ఆయా కంపెనీలకు హైదరాబాద్‌లో వందల ఎకరాలను చంద్రబాబునాయుడు కేటాయించారు. అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చివేసిందని ఇప్పుడు విమర్శిస్తున్నవారు గతంలోనూ, ఇప్పుడూ హైదరాబాద్‌లో ఏమి జరుగుతున్నదో ఒకసారి గుర్తుచేసుకోవాలి. హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటుచేసిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రభుత్వ అధీనంలోని భూములను లేఅవుట్లుగా అభివృద్ధి చేసి వేలం ద్వారా విక్రయించారు. అలా వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌లో రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ఫ్లైఓవర్లను నిర్మించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన రాజశేఖర్‌రెడ్డి ఆ మోడల్‌నే కొనసాగించారు. ప్రభుత్వ భూములను విక్రయించి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని భూములనే పెట్టుబడిగా వాడారు. అంతేగానీ విజయవాడ, విశాఖపట్టణం వంటి నగరాల నుంచి ఆదాయాన్ని తెచ్చి హైదరాబాద్‌ అభివృద్ధికి ఖర్చు చేయలేదు.ప్రభుత్వ భూముల వేలాన్ని అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్‌ తప్పుబట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా నగరాభివృద్ధికి నిధులను సమకూర్చుకుంటున్నారు. అంటే నాడు చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి చేసింది తప్పు కాదనే కదా?.. ప్రభుత్వ భూములను కంటికి రెప్పలా కాపాడి లేఅవుట్లుగా అభివృద్ధి చేసి విక్రయించిన ఐఏఎస్‌ అధికారిణి లక్ష్మీ పార్థసారథి హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉండేవారు. నాటి ఆమె అనుభవాన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇప్పటి అమరావతి డెవలప్‌మెంట్‌ అథారిటీ బాధ్యతలను ఆమెకి చంద్రబాబు అప్పగించారు. ఇప్పుడు అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారని విమర్శిస్తున్నవారు నాడు రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లో అదేపని చేశారని అంగీకరిస్తారా? ఏ నగరమైనా అభివృద్ధి చెందినప్పుడు భూముల ధరలు పెరగడం సహజం. అలాంటప్పుడు ప్రభుత్వ భూముల ధర కూడా పెరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.ఈ ఫార్ములా ఆధారంగానే అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీగా చంద్రబాబు పేర్కొంటూ వచ్చారు. హైదరాబాద్‌లో భూములు కొనుగోలు చేసినవారు కూడా లాభపడ్డారు. ఉదాహరణకు 1996లో హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో హుడా హైట్స్‌ పేరిట చంద్రబాబు ప్రభుత్వం వేలం వేసిన ప్లాట్లకు గజం రెండున్నర వేల రూపాయలు పలికింది. ఇప్పుడు అక్కడ గజం భూమి ధర రెండు లక్షలకు పైగానే ఉంది. అంటే రెండున్నర దశాబ్దాల కాలంలో ప్లాట్లు కొనుగోలు చేసినవారికి వంద రెట్లు అధిక ఆదాయం లభిస్తోందన్న మాట! అమరావతిలో కూడా అలాగే జరిగి ఉండేది. రాజధానికి 33 వేల ఎకరాల భూమి ఎందుకు అని ప్రశ్నించినవారికి ఇప్పుడు సమాధానం దొరికిందనుకుంటా! అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు కావాలి.. ప్రభుత్వం వద్ద అంత డబ్బు లేదని అంటున్నవారు ఇప్పటికైనా ప్రజలను తప్పుదారి పట్టించకుండా ఉంటే మంచిది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దుబాయ్‌నే తీసుకుందాం. ఎడారి ప్రాంతాన్ని ప్రపంచానికి పెట్టుబడులకు కేంద్రంగా మార్చలేదా? సొంత వనరులు లేకపోయినా అబూదాబి పాలకుల నుంచి రుణం తీసుకుని మరీ దుబాయ్‌లో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించిన ఆ దేశ పాలకుడి దూరదృష్టిని అభినందించకుండా ఉండలేం కదా? కేవలం షాపింగ్‌ కోసమే తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది దుబాయ్‌ వెళ్లివస్తున్నారు.ఇటువంటి వాస్తవాలను గుర్తించడానికి నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పదవులు వెలగబెడుతున్నవారు ‘‘మాకు అభివృద్ధి వద్దు, కుల మతాల రొచ్చులో పడి కుళ్లిపోతాం’’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అమరావతి అభివృద్ధి చెందివుంటే హైదరాబాద్‌ తరహాలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు వచ్చి స్థిరపడి ఉండేవారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్లను నిర్వహించిన కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ఇప్పుడు మాయమైపోయినట్టుగానే అమరావతిలో కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారి ఉనికి మసకబారేది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేసిన మహిళలను అక్రమంగా నిర్బంధించడంతోపాటు ‘‘మీ కులం ఏమిటి?’’ అని పోలీసులు ప్రశ్నించడం అరాచకం కాక మరేమిటి? పాలకుల్లో మూర్తీభవించిన కుల విద్వేషానికి ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది.ఆందోళనకారులను కులం అడగడం నేరం కాదా? ఈ నేరానికి పాల్పడిన పోలీసులను, వారిని ఆ విధంగా ప్రోత్సహించినవారిని ఎవరు శిక్షించాలి? కులం, మతం, ప్రాంతం ఆధారంగా ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినవారు ఎందరో ఉన్నారు. ఈ మూడింటినీ ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి మాత్రమే! అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మూడింటినీ ఆయన పెంచిపోషిస్తున్నారు. కుల విద్వేషాల వల్ల తామెంతగా నష్టపోతామో గుర్తించలేకపోతున్న యువత కూడా దురదృష్టవశాత్తు కుల ద్వేషాలతో రగిలిపోతోంది. జగన్మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నవారు ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఒకసారి గుర్తుచేసుకోవాలి. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్మ సామాజికవర్గానికి చెందినవారిని కూడా ప్రోత్సహించారు.

 

 

ఈ సందర్భంగా అప్పట్లో జరిగిన ఒక సంభాషణను గుర్తుచేసుకుందాం. ‘‘అధికారంలోకి వస్తే అవినీతికి ఆమడదూరంలో ఉంటానని చెప్పిన మీరు ఇప్పుడు ఇలా అవినీతికి పాల్పడటం ఏమిటి? బయట చులకనగా మాట్లాడుకుంటున్నారు’’ అని ఒక ప్రముఖ వ్యాపారవేత్త ప్రశ్నించగా, ‘‘మీ కమ్మ సామాజికవర్గానికి చెందినవారే నేను రూపాయి అడిగితే పది రూపాయలు ఇచ్చి పోతున్నారు. ఆ వచ్చిన డబ్బును పార్టీ అధిష్ఠానానికే ఇవ్వాల్సి వస్తోంది. దానికితోడు మా వాడొకడు’’ అని రాజశేఖర్‌రెడ్డి తన నిస్సహాయతను వ్యక్తంచేశారట! రాజశేఖర్‌రెడ్డి అంత ఓపెన్‌గా తన ఆవేదనను చెప్పగలిగారు గానీ, జగన్మోహన్‌రెడ్డిని అలా ప్రశ్నించగలిగే వారు ఒక్కరు కూడా లేరు. రాష్ట్రం ఏమవుతుందా? అని కూడా ఆలోచించకుండా కులాల రొచ్చులో కూరుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత కులపిచ్చి ఏమిటో? అని తెలంగాణకు చెందిన ప్రముఖులు కూడా ఈసడించుకుంటున్నారు. అయినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలకు ఇవేమీ పట్టడం లేదు. ఇది ఆ రాష్ట్రం, ఆ రాష్ట్ర ప్రజల ఖర్మ అని సరిపెట్టుకోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు!

"
"