వైసీపీలో అంతర్గత విభెదాలు.. ముదురుతున్న వర్గపోరు..

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, వైసీపీల మధ్య పోరు జరుగుతుండగా ఇందుకు భిన్నంగా పల్నాడు ప్రాంతంలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో మాత్రం స్వపక్షీయులే కుమ్ములాడుకుంటున్నారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. విశేషమేమిటంటే ఇద్దరూ కూడా వైసీపీ ద్వారా తొలిగా రాజకీయ అరంగేట్రం చేసి చట్ట సభల్లోకి అడుగుపెట్టిన పిన్న వయస్కులే. ఎన్నికల సమయం నుంచే ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఉన్నట్లు తెలుస్తోంది.మహా శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభల పండుగలో విభేదాలు భగ్గుమని వార్తల్లోకెక్కాయి. చిలకలూరి పేట ఎమ్మెల్యే స్వగ్రామమైన పురుషోత్తంపట్నంలో బైరా కుటుంబీకులు ఏర్పాటు చేసిన ప్రభను సందర్శించేందుకు నిర్వాహకులు ఆహ్వానించగా ఎంపీ ఆ గ్రామానికి వెళ్లారు. ఎంపీ ఆ కార్యక్రమానికి వస్తున్న విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే మరిది ఆయనకు ఫోన్‌ చేసి వారు తమ పార్టీకి చెందిన వారు కాదని, ఆ కార్యక్రమానికి ఎంపీ హాజరైతే తమకు అవమానమని ఆపాలని ప్రయత్నించారని సమాచారం. అయితే ఎంపీ మాత్రం వారు తనతో ఎన్నికల సమయంలో కూడా కలిసి పనిచేశారని, అటువంటి వారిని పార్టీ వారు కాదని ఎలా అంటారని వాదించి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

కాగా ఎమ్మెల్యే రజనీ మాత్రం ఆ కుటుంబీకులు తనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారని ఆరోపిస్తూ గెలిచిన నాటి నుంచి కూడా వారితో దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.ఇదిలా ఉండగా బైరా వారి ప్రభ వద్దకు వెళ్ళే ముందు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ఇంటికి వెళ్ళి ఆ తరువాత ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో రజనీ వర్గానికి పుండు మీద కారం చల్లి నట్లుగా అయుంది. దీంతో రజనీ మరిది గోపి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు పురుషోత్తంపట్నంలో ఎంపీ కారును అడ్డుకొని నిరసన తెలిపారు. ఆ సంఘటన జరిగిన మరునాడే కట్టుబడివారిపాలెం వద్ద రజనీ మరిది గోపి కారుపై దాడి జరిగింది. ఈ దాడి మీద గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిమీద రకరకాల వాదనలు, ఆరోపణలు వచ్చాయి.ఈ సంఘటనల ద్వారా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం బహిర్గతమైనప్పటికీ వాస్తవానికి ఎన్నికల నాటి నుంచే వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు ఉన్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట లోక్‌సభ అభ్యర్ధిగా ఎన్నికల బరిలోకి దిగిన కృష్ణదేవరాయలు తన నియోజకవర్గం పరిధిలోని మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధులకు ఇచ్చినంత ఆర్థిక సహకారం అందించలేదని అక్కసు రజనీ వర్గీయులకు ఉన్నట్లు సమాచారం. పైగా అప్పటికే ఆమెకు అదే సీటు ఆశించి భంగపడిన మర్రి రాజశేఖర్‌తో పూర్తిస్థాయిలో విబేధాలు పొడచూపాయి. సీటు విషయంలో నెలకొన్న అసమ్మతి సర్దుబాటు కాకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరి పేట వచ్చిన జగన్‌ అక్కడి సభలో రాజశేఖర్‌కు సామాజిక సమీకరణలో భాగంగా సీటు ఇవ్వలేకపోయానని రజనీని గెలిపించుకొని వస్తే ఎమ్మెల్సీ పదవి కల్పిస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఇద్దరూ మాత్రం ఎడమొఖం పెడమొఖంగానే ఉంటూ వచ్చారు. గెలిచిన తరువాత కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు మర్రి రాజశేఖర్‌తో స్నేహంగా ఉంటున్నాడనే కోపం కూడా ఎమ్మెల్యే రజనీకి ఉంది. అందువల్లే నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యే కలిసి పాల్గొన్న దాఖలాల్లేవు.

 

ఎన్నికల ఫలితాల్లో ఇద్దరి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం కూడా వారి వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. ఎమ్మెల్యే రజనీకి 8301 ఓట్ల ఆధిక్యత రాగా ఎంపీ కృష్ణదేవరాయలుకు చిలకలూరిపేట నియోజకవర్గంలో 6720 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉన్న రజనీ వర్గీయులు క్రాసింగ్‌ చేయటం వల్లే ఎంపీ అభ్యర్ధికి 1500లకు పైగా ఓట్ల మెజార్టీ తగ్గిందని ఎంపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. కాగా ఎంపీ అభ్యర్ధి కృష్ణదేవరాయలుతో స్నేహంగా వ్యవహరించిన మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి రజనీకి సహకరించటం లేదని ఆమె వర్గీయులు చేసిన ఆరోపణలను కూడా మర్రి వర్గీయులు ఓట్ల వ్యత్యాసాన్ని చూపి తిప్పికొడుతున్నారు. తాము కూడా ఆమెకు అనుకూలంగా చేయటం వల్లే ఎంపీ అభ్యర్థి కంటే ఆమెకు ఎక్కువ మెజార్టీ వచ్చిందని వాదిస్తున్నారు.

"
"