వైసీపీకి షాక్ తప్పదా..? ఎన్నికల కోడ్ వస్తే ఏం చేస్తారు

ఇప్పుడంతా రంగుల రాజకీయం! తెలుగుదేశం హయాంలో అక్కడక్కడా, స్థానిక నేతల అత్యుత్సాహంతో వాటర్‌ ట్యాంకులు, ఆధునీకరించిన శ్మశానాల ప్రహరీలకు పసుపు రంగు పులిమేశారు. వైసీపీ వచ్చాక గ్రామ సచివాలయాలకు తమ పార్టీ పతాకంలోని రంగులైన ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులు వేయాలంటూ ఏకంగా అధికారిక ఉత్తర్వులే ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌ చిత్రాన్ని కూడా ప్రదర్శించాలన్నారు. రంగుల ఖర్చు, ఇతర లెక్కల సంగతి అటుంచితే… స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటని అధికారులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. జనవరి 10న ప్రారంభించి మార్చి నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ఈ సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది.ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ భవనాలు, ఆస్తులపైన పార్టీలకు చెందిన రంగులు, నేతల చిత్రాలు కనిపించవద్దు.

మరి… ఇప్పటికే రంగులు పూసేసిన గ్రామ సచివాలయాలు, ట్యాంకులను ఏం చేయాలి? పైగా పంచాయతీ భవనాల్లో పోలింగ్‌ బూత్‌లు కూడా ఏర్పాటవుతాయి. విగ్రహాలో, జెండా దిమ్మెలో అయితే ముసుగులు కప్పేయవచ్చు. భవనాల చుట్టూ వేసిన ఆకుపచ్చ-తెలుపు-నీలం రంగులను కవర్‌ చేసేది ఎలా? మరి ట్యాంకులను మూసేదెలా? ఇవేవీ కుదిరేవి కావు. ఎన్నికల నియమావళిని నిక్కచ్చిగా అమలు చేయాలంటే… ఆయా రంగులను చెరిపివేసి, మళ్లీ తెల్ల రంగు వేయాల్సిందే! అంటే… వేయడానికి ఒక ఖర్చు, తీసేయడానికి మరో ఖర్చు! ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత మళ్లీ రంగులు వేయాల్సిందే అంటే… మళ్లీ మళ్లీ ఖర్చు. గ్రామీణ ప్రజలకు పలు రకాల సేవలందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 12,918 గ్రామ పంచాయతీలను 12వేల పైచిలుకు సచివాలయాలుగా మార్పు చేసింది. పంచాయతీ భవనాలను సచివాలయ భవనాలుగా మార్చే క్రమంలో ఆ భవనాలకు రంగులు వేస్తున్నారు. అదికూడా… ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులో ఉండాలంటూ నమూనా ఫొటోలను కూడా ఉత్తర్వులతోపాటు జత చేశారు. ఈ రంగులు అచ్చంగా వైసీపీ జెండాను పోలి ఉన్నాయి. ప్రభుత్వ భవనాలకు రాజకీయ రంగులు వేయాలని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం ఇదే మొదటిసారి. సర్కారు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ నిధులతో ఆ భవనాలకు ఈ రంగులు వేయించారు. ఇది వాటికి భారంగా మారింది. దీంతోపాటు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ కూడా మరో మెమో జారీచేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకులన్నింటినీ ఆకుపచ్చ, నీలం, తెలుగు రంగులోకి మార్చాలని అన్ని జిల్లాల ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలకు ఆదేశాలిచ్చారు.

ఆయన ఆదేశాలను అమలు చేసే క్రమంలో గ్రామాల్లో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు వాటర్‌ట్యాంకులను వైసీపీ జెండా రంగులోకి మారుస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ, ప్రభుత్వ ఆస్తులన్నీ వైసీపీ జెండా రంగులోకి మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాలకు ఒక పార్టీకి పోలిన రంగులు వేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే పంచాయతీరాజ్‌శాఖ ఇచ్చిన మెమో రద్దయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఆ సంగతి పక్కనపెడితే… ఎన్నికల నియమావళి వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

"
"