మరి ఇంత దారుణమా జగనా..? కాస్త కూడా పట్టించుకోవా..?

కర్నూలులో హత్యాచారానికి గురైన ఓ బాలిక కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తమపైనా దయ చూపాలని, సొంత బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును కూడా సీబీఐకి అప్పగించి దర్యాప్తు సక్రమంగా సాగేలా చూడాలని ఆయన కుమార్తె డాక్టర్‌ ఎన్‌.సునీత, భార్య సౌభాగ్యమ్మ అభ్యర్థించారు. ఆ బాలిక కుటుంబం పట్ల కనికరం చూపిన సీఎం.. సోదరినైన తనపైనా దయ చూపి ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని సునీత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె తరఫు సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి హైకోర్టుకు విన్నవించారు. వివేకా హత్య కేసును సీబీఐకి గానీ, లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు గానీ ఇవ్వాలని కోరుతూ గతంలో వివేకా సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ, నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా వివేకా కుమార్తె డాక్టర్‌ ఎన్‌.సునీత, అల్లుడు ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే భావన వ్యక్తం చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై సోమవారం జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు ముందు విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వివేకా హత్య కేసు దర్యాప్తుకు సంబంధించిన జనరల్‌ డైరీ, కేసు డైరీ, పోస్టుమార్టం తదితర నివేదికలను న్యాయమూర్తి ముందుంచారు.

 

వాటిని న్యాయమూర్తి పరిశీలించి.. రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) సమక్షంలో భద్రపరచాలని ఆదేశించారు. సౌభాగ్యమ్మ, సునీతల తరఫున పి.వీరారెడ్డి, జగన్‌ తరఫున వివేక్‌ చంద్రశేఖర్‌ వాదనలు వినిపించారు. కాగా ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.‘రాష్ట్ర యంత్రాంగమంతా సీఎం చేతిలో వున్నందున ఈ కేసును తారుమా రు చేసే అవకాశముందని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన ఆరోపణ నిరాధారం. మేం పిటిషన్‌ దాఖలు చేసిన నాటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. ప్రస్తుతం దర్యాప్తు సాఫీగా సాగుతోంది. అందుకే మా పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని మెమో దాఖలు చేశాం’‘పోలీసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని గతంలో వైఎస్‌ జగన్‌ అఫిడవి ట్‌ దాఖలు చేశారు. మరి ఇప్పుడు తన పిటిషన్‌పై తదుపరి ఉత్తర్వులు అవసరం లేదంటూ సాధారణ మెమో వేసి.. కేసు క్లోజ్‌ చేయాలని అడుగుతున్నా రు. అప్పుడు ప్రమాణపత్రం వేసి, ఇప్పుడు మెమోతో ఎందుకు సరిపెడుతున్నారు? ఇక్కడే మాకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడా పిటిషన్‌ను మూసివేసినంతమాత్రాన గతంలో ఆ ప్రమాణపత్రంలో చెప్పిన విషయాలు చెరిగిపోవు. అందులోని విషయాలన్నీ కోర్టులో రికార్డయ్యే ఉంటాయి. అప్పట్లో రాష్ట్రప్రభుత్వం పోలీసుల చేత దర్యాప్తు సరిగ్గా చేయించడం లేదని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం ఎప్పుడూ అలాగే ఉంటుంది. పాలక పార్టీ మా రుతుందే తప్ప పరిపాలనా వ్యవస్థ అలాగే కొనసాగుతుంది. ఆ కారణం చూపుతూ జగన్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి వీల్లేదు. ఒకే ఘటనపై, ఒకే వినతి కోరుతూ ఐదుగురు పిటిషన్లు దాఖలు చేసినప్పుడు.. మధ్య లో ఒకరు ఉపసంహరించుకోవడానికి వీల్లేదు. అందువల్ల జగన్‌ పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించవద్దు. ఆయన దాఖలు చేసిన మెమోలో ‘ఉపసంహరణ’ అనే పదం కూడా ఉపయోగించలేదు. వాదనల సమయంలో అడ్వకేట్‌ జనరల్‌ నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. గత వారం సీఎం కర్నూలు వెళ్లినప్పుడు ఒక బాలికను అత్యాచారం చేసి హత్య చేశారని తెలుసుకున్న ఆయన.. ఆ కుటుంబంపై దయతో ఆ కేసును సీబీఐకి బదిలీ చేస్తామని చెప్పారు.

 

ఇప్పుడు సొంత సోదరిపైనా, బాబాయి కుటుంబంపైనా దయచూపి వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలి.’కర్నూలులో బాలిక కేసును సీబీఐకి అప్పగించినట్లే.. వివేకా హత్య కేసునూ కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలన్న వీరారెడ్డి అభ్యర్థనపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్నూలు అంశానికి, ఈ కేసుకు ఏం సంబంధముందని ప్రశ్నించారు. అలాగే జగన్‌ ప్రత్యేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ కాబట్టి.. ఆయన ఉపసంహరించుకుంటానని కోరడంలో తప్పేముందని వ్యాఖ్యానించారు. తదనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

"
"