వైఎస్ జగన్ హెచ్చరిక… దయచెసి అలా చేయకండి..

కరోనా వైరస్‌ కట్టడికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగకపోతే పరిస్థితి క్లిష్టంగా మారుతుందని, మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని ముఖ్యమంత్రి జగన్‌ హెచ్చరించారు. మూడు వారాలపాటు ఎవరి ఇళ్లల్లో వారు.. ఎవరి గ్రామాల్లో వారు.. ఎవరెవరి జిల్లాల్లో, ఎవరెవరి ప్రాంతాల్లో వారుండిపోవాలని పిలుపునిచ్చారు. ‘‘చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నా! వచ్చే నెల 14 వరకూ ఎక్కడి వారక్కడే ఉండిపోవాలి’’ అని అభ్యర్థించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎలకా్ట్రనిక్‌ మీడియా ద్వారా ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే…ఈ కరోనా వంటి వ్యాధులు బహుశా వందేళ్లకోసారి వస్తాయో రావో కూడా తెలియదు. ఇలాంటివి ఒక జనరేషన్‌లో మనం చూస్తామని కూడా ఎప్పుడూ అనుకోం. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీటిని మనం సమర్థంగా ఎదుర్కొనలేకపోతే మాత్రం తర్వాత పరిస్థితులు ఎంత కష్టంగా ఉంటాయో చెప్పడమూ కష్టమవుతుంది. దీనిని మనం క్రమశిక్షణతోనే అరికట్టగలుగుతాం. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకుంటామన్నది విదేశాల్లో జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే మనకందరకూ అర్థమవుతుంది.

 

ఇక్కడ అందుకనే మనమంతా కొన్ని నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకోవలసిన అవసరం ఉంది. కొంచెం కష్టమైనా కూడా అందరూ సహకరించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పక్కనేమో తెలంగాణ బోర్డర్‌. అక్కడి నుంచి మనవాళ్లు మన రాష్ట్రంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనవాళ్లను మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదు. ఇది మనసుకు చాలా కష్టమనిపించింది. మళ్లీ పొందుగుల, దాచేపల్లి, నాగార్జునసాగర్‌ చెక్‌పోస్టుల దగ్గర ఇదే పరిస్థితులు. దయచేసి మీరు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో.. ఆయా ప్రాంతాలలోనే ఉండిపోండి. ఎందుకంటే.. ఒకసారి ప్రదేశం మారితే వచ్చేవాళ్లు ఎంతమందితో కాంటాక్టులోకి వస్తున్నారు. వాళ్ల ద్వారా ఇంకా ఎంతమందో! ఏప్రిల్‌ 14 దాకా మనం ఎక్కడికీ తిరగకుండా ఎక్కడివాళ్లక్కడ ఇళ్లలోనే ఉండిపోగలిగితే.. ఈ కాంటాక్టు ట్రేసింగ్‌ ఉండదు.మనవాళ్లనే మనం ఆపే పరిస్థితి వస్తుందంటే బాధ కలిగించే విషయం. నిన్ననే దాదాపుగా 44 మంది మందిని బోర్డర్‌ దాకా వచ్చిన వాళ్లను కాదనలేకపోయాం. మార్కాపురం, కందుకూరు, అద్దంకిలలో కూడా ఇంకో 152 మందిని కాదనలేక తీసుకున్నాం. వీళ్లందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచకతప్పదు. వెంటనే ఇళ్లకు పంపించలేమన్న సంగతిని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నాను. ఎందుకంటే.. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే టప్పుడు ఎక్కడ నుంచి వచ్చారో .. వీరు ఎవరితో కాంట్రాక్టులో ఉన్నారో .. ఎవరెనరిని కలిశారో .. ఈ డేటా అంతా ఎవరి దగ్గరా ఉండదు. అందువల్ల జాగ్రత్తలు తీసుకోకపోతే .. వీళ్లలో ఏ ఒక్కరికి ఉన్నా కూడా వీళ్లు ఇంకో పది మందికి వ్యాప్తి చేస్తారు. ఇప్పుడు తీసుకున్నవారు కచ్చితంగా 14 రోజులుపాటు క్వారంటైన్‌లో ఉంటారు. అక్కడే ఉంచకతప్పని పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుగారితోనూ మాట్లాడాను. ఆయన కూడా చాలా సానుకూలంగానే స్పందిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టే దేశం మొత్తం కూడా ఒకే రూల్‌ వచ్చింది. ఎక్కడి వాళ్లక్కడే ఉండిపోవాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్‌ కూడా పంపింది. అక్కడ ఎవరికైనా సమస్య వచ్చిందంటే.. వాళ్లు అక్కడ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే గవర్నమెంట్‌ వెంటనే స్పందిస్తుంది. వాళ్లకు ఫుడ్‌గానీ ..షెల్టర్‌గానీ.. ఇంకా ఏదైనా కావాలంటే ఆదుకుంటుంది. కేసీఆర్‌గారైతే నాలుగు అడుగులు ముందుకేసి .. చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ.. నేను చూసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరి కూడా ఇబ్బంది కలుగనివ్వనని హామీ ఇచ్చారు.మన రాష్ట్రంలో ఇప్పటికే పది కేసులు పాజిటివ్‌గా తేలాయి. దీనిని గనుక మనం వదిలేస్తే.. పరిస్థితులు ఎక్కడికి పోతాయే అర్థం కాదు. దేవుడి దయతో ఇప్పటి వరకూ పదే పది కేసులు మాత్రమే ఉన్నాయి. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు దాదాపుగా 27,819 మంది అని నిన్నటి సర్వే రిపోర్టులో తేలిన సంఖ్య. గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ వలంటీర్లకు, గ్రామ సచివాలయాల్లోని ఆరోగ్య కార్యదర్శులకు, ఆశా వర్కర్లకు. వీళ్లందరీకి మనస్ఫూర్తిగా హాట్సాఫ్‌ చెబుతున్నాను.

 

రాష్ట్రంలో కరోనా సమస్యను ఎదుర్కొనేందుకు ఇప్పటికే నాలుగు చోట్ల.. విశాఖ, నెల్లూరు, విజయవాడ, తిరుపతిలో క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం. ఇంతకు ముందూ నేను చెప్పాను. 80.9 శాతం ఇంటి వద్దే ఉండి.. ఒకవేళ ఇది వచ్చినా నయమైపోయి మళ్లీ మామూలుగా తిరగొచ్చు. కేవలం 14 శాతం మందే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఆందులోనూ 4.8 శాతమే ఐసీయూలో ఉన్నారు. ఇది 60 ఏళ్లు పైబడిన.. సుగర్‌, బీపీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. మన ఇంట్లో మన పెద్దవాళ్లను కాపాడుకోవడం మనం బాధ్యత. ప్రభుత్వ రంగంలో కోవిడ్‌ కోసమని ప్రత్యేకంగా దాదాపు 470 ఐసీయూ బెడ్స్‌, వెంటిలేటర్స్‌ ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో 200 బెడ్లు ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలోనూ.. 100 పడకలను క్వారంటైన్‌ సేవల కోసం ఏర్పాటు చేశాం. ప్రైవేటు సెక్టార్‌లో 213 వెంటిలేర్లను సిద్ధం చేశాం. వ్యాధి ప్రబలితే నియంత్రించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా 1902 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయండి.

"
"