జగన్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు.. ప్రభుత్వ అధికారుల్లో గందరగోళం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలు, నాడు-నేడు వంటి పథకాల అమలు కోసం నిధుల సమీకరణకు ప్రభుత్వ భూములను విక్రయించాలన్న నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూములు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రభుత్వ భూములను వినియోగించి అభివృద్ధి చేయాలే తప్పా, విక్రయించి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. భూములు విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి తీవ్ర శరాఘాతంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. బిల్డ్‌ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములను విక్రయిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాల కోసం భూమిని ఎక్కడినుంచి తెస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుని ఆదాయ సముపార్జనకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు.

భూముల విక్రయానికి ప్రభుత్వం ముందుకు వెళితే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.భూములు అమ్మకానికి సంబంధించి శరవేగంగా పావులు కదుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి ఆ మేరకు ఆదేశాలను ఇచ్చింది. జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి..? ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఇచ్చిన భూములలో కార్యాలయాలు, క్వార్టర్లు నిర్మించగా మిగిలిన స్థలాలు ఎన్ని, ఆయా కార్యాలయాల పరిధిలో భూములున్నాయా? వంటి అంశాలకు సంబంధించిన వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రెవెన్యూ శాఖను ఆదేశించింది. దీంతో జిల్లా రెవెన్యూ అధికారులు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో భూములు కంటే విశాఖ నగర పరిధిలోని భూములకు గిరాకీ ఎక్కువ కావడంతో వీలైనంత భూమిని ఈ జిల్లాలోనే సేకరించి విక్రయుంచడం ద్వారా భారీ మొత్తంలోనే నిధులు సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు యోచిస్తున్నారు.ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను విక్రయించేస్తే భవిష్యత్‌లో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. రానున్న రోజుల్లో మరింతగా ప్రభుత్వ కార్యకలాపాలను విస్తరించాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా భూమి తప్పనిసరిగా ఉండాలి.

ఆయా శాఖలకు ఇప్పుడు ఉన్న కొద్దో, గొప్పో భూమిని విక్రయించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు నిధుల సమీకరణకు భూములు విక్రయిస్తే.. భవిష్యత్తులో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు నుంచి భూములు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వంపై తీవ్రమైన భారం పడే అవకాశముంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నిధులు సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు.