జగన్ మరో కీలక నిర్ణయం.. ప్రతి ఒక్కరికి అందేలా..?

రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెల 20 నుంచి డిసెంబరు 20 వరకూ నెల రోజుల పాటు ఏకబిగిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రేషన్‌, పెన్షన్‌, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపడుతున్నట్లు సీఎం ఈ సందర్భంగా తెలిపారు. 20వ తేదీ నుంచి డిసెంబరు 20 దాకా నెల రోజుల పాటు గ్రామ వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ఈ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంతో గ్రామ సచివాలయాలు, వలంటీర్లకు పూర్తిస్థాయిలో పని అప్పగించినట్లు అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలన్నిటికీ వేటికది కొత్త కార్డులు జారీ చేయడం వల్ల ఏ పథకానికి ఏ కార్డు ఉపయోగపడుతుందో లబ్ధిదారులకు తెలుస్తుందని.. అధికారులకూ ఒక స్పష్టత ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో వైఎ్‌సఆర్‌ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, అమ్మఒడి, నాయీ బ్రాహ్మణులకు నగదు, వైఎ్‌సఆర్‌ కాపు నేస్తం తదితర పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తామన్నారు. గ్రామ సచివాలయాల్లో శాశ్వతంగా లబ్ధిదారుల పేర్లు వెల్లడించే బోర్డులు ఉండాలని సూచించారు. అధికారం కోసం కాకుండా.. ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామన్నది కలెక్టర్లు, ఎస్సీలు గుర్తుపెట్టుకోవాలని సీఎం అన్నారు. ప్రజా వినతుల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. వినతుల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమైనదని .. దాని కోసమే ప్రయత్నించాలని స్పష్టం చేశారు. స్పందనలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత కోసం స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌పై 6 జిల్లాల్లో శిక్షణ అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయని సీఎం చెప్పారు.


ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ మానస పుత్రికగా జగన్‌ అభివర్ణించారు. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపైనే రాత్రీ పగలూ ఆలోచించాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.